Share News

ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఏఆర్‌ అనురాధ

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:13 AM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(ఏపీపీఎస్సీ) చైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అర్కాట్‌ రాజారత్నం (ఏఆర్‌) అనురాధ నియమితులయ్యారు. ఆమె నియామకానికి గవర్నర్‌ ఆమో దం

ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ఏఆర్‌ అనురాధ

రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారికి కీలక పదవి

అమరావతి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(ఏపీపీఎస్సీ) చైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అర్కాట్‌ రాజారత్నం (ఏఆర్‌) అనురాధ నియమితులయ్యారు. ఆమె నియామకానికి గవర్నర్‌ ఆమో దం తెలపడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమితులై ఐపీఎస్‌ అధికారి గౌతం సవాంగ్‌ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదవికి రాజీనామా చేశారు. దీంతో తాజాగా చైర్‌పర్సన్‌ను నియమించారు. ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం చైర్మన్‌ లేదా చైర్‌పర్సన్‌ గరిష్ఠ వయో పరిమితి 62 సంవత్సరాలు. దీంతో ఏఆర్‌ అనురాధ సుమారు ఏడాది కాలం ఈ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. కాగా, తమిళనాడుకు చెందిన అనురాధ 1987లో ఐపీఎ్‌సకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీ కేడర్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఉమ్మడి ఏపీలో విభజన, సమైక్య ఉద్యమాలతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నప్పుడు అప్పటి హోం శాఖ.. అనురాధ కు సమన్వయ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కేడర్‌కు వచ్చిన ఆమె నిఘా విభాగం తొలి మహిళా అధిపతిగా నియమితులయ్యారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి గత ఏడాది అక్టోబరులో అనురాధ పదవీ విరమణ చేశారు. అనురాధ భర్త నిమ్మగడ్డ సురేంద్ర బాబు కూడా ఐపీఎస్‌ అధికారే. ఆయన కూడా ఏపీ కేడర్‌లో పనిచేసి రిటైర్‌ అయ్యారు.

గాడిన పెట్టాలి!

గత వైసీపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీని భ్రష్ఠు పట్టించింది. గ్రూప్‌-1 పరీక్షలు, భర్తీ విధానాన్ని అక్రమాలకు వేదికగా మార్చింది. పదే పదే సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి గందరగోళం సృష్టించింది. ఈ అక్రమాలను అభ్యర్థులు ఆధారాలతో నిరూపించడంతో ఏపీపీఎస్సీ పరువు పోయిం ది. ప్రభుత్వం మారడంతో వీటిపై విచారణ చేస్తారని భావించిన అప్పటి చైర్మన్‌ గౌతంసవాంగ్‌ రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఉద్యోగార్థులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీపీఎస్సీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత అనురాధపైనే ఉంది.

Updated Date - Oct 24 , 2024 | 04:13 AM