YSRCP: ఏకగ్రీవంగా ఎన్నికయ్యాక బొత్స ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ABN, Publish Date - Aug 16 , 2024 | 06:01 PM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు...
విశాఖపట్నం/అమరావతి: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) స్థానానికి వైసీపీ (YSR Congress) అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కాస్త ఎమ్మెల్సీ బొత్స అయ్యారు.! ధ్రువీకరణ పత్రం తీసుకున్నాక మీడియాతో మాట్లాడిన బొత్స ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం
పేరు పేరునా..!
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక (MLC By Election) ఏకగ్రీవం కావడం చాలా సంతోషంగా ఉందని బొత్స చెప్పుకొచ్చారు. ‘నాకు బీఫామ్ ఇచ్చిన మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) కృతజ్ఞతలు. ఎన్నిక ఏకగ్రీవం కావడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రావణ శుక్రవారం మంచి రోజు.. రాష్ట్ర ప్రజలందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను. విశాఖపట్నం జిల్లా అభివృద్ధి కూడా ఇలాగే అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తాను’ అని బొత్స మీడియాకు వెల్లడించారు. కాగా.. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా పరాజయం పాలైన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇదే.. ఇందులో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి.
ఏకగ్రీవం ఇలా..!
ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం రిటర్నింగ్ అధికారి, విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది. నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి స్వతంత్య్ర అభ్యర్థి షేక్ షఫీ, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తరపున ఆయన ప్రతినిధులు హాజరయ్యారు. అన్ని పత్రాలు ఉండడంతో రెండు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది. స్వతంత్య్ర అభ్యర్థి షేక్ షఫీ తాను నామినేషన్ ఉపసంహరించుకున్నట్టు బుధవారమే పత్రాలు దాఖలు చేశారు. దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఒక్కరే బరిలో ఉన్నట్టు అయ్యింది. అయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తరువాతే అధికారికంగా బొత్స సత్యనారాయణ ఎన్నికను ప్రకటించాల్సి ఉంది. దీంతో శుక్రవారం నాడు సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చేసింది. కాగా.. ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తరువాత కోడ్ తొలగిపోనున్నది. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి మయూర్ అశోక్ వెల్లడించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కూటమి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
Updated Date - Aug 16 , 2024 | 10:20 PM