Greenfield Refinery : రమాయపట్నంలో... భారీ రిఫైనరీ
ABN, Publish Date - Dec 25 , 2024 | 03:12 AM
ఆంధ్రప్రదేశ్‌లో మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నిర్ణయించింది
పెట్రో-కెమికల్ కాంప్లెక్స్ కూడా.. రూ.6.100 కోట్ల అంచనాతో ఏర్పాటు
బీపీసీఎల్ బోర్డు సమావేశంలో నిర్ణయం
తక్షణమే స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం
స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కోసం ప్రతిపాదన
ప్రీ-ప్రాజెక్టు పనులు ప్రారంభించామన్న సంస్థ
బందరుకు తెచ్చేందుకు ఎంపీ బాలశౌరి యత్నాలు
బీపీసీఎల్‌తో సీఎం స్థాయిలోనూ చర్చలు
మచిలీపట్నం అనువైన ప్రాంతమని,అవసరమైన భూములిస్తామని బాబు హామీ
తొలుత బీపీసీఎల్ అధికారులు సానుకూలం
తర్వాత రామాయపట్నం మేలని తుది నిర్ణయం
రాష్ట్రానికి రావడమే ముఖ్యమని సర్కారు ఓకే
విజయవాడ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారీ పెట్టుబడి పెట్టనుంది. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో భారీ గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) నిర్ణయించింది. రూ.6,100 కోట్ల అంచనా వ్యయంతో తూర్పు తీరాన రామాయపట్నంలో దీనిని నెలకొల్పాలన్న ప్రతిపాదనను మంగళవారం జరిగిన బీపీసీఎల్ బోర్డు సమావేశం ఆమోదించింది. ఆ వెంటనే బీపీసీఎల్ ఈ సమాచారాన్ని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎ్‌సఈ), భారత్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ (బీన్ఎస్ఈ)కు తెలియపరచింది. స్టాక్ మార్కెట్‌లో బీపీసీఎల్ తరఫున లిస్టింగ్ కోసం ఈ మేరకు లేఖ రాసింది. ప్రీ-ప్రాజెక్టు కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించింది. ఈ కార్యకలాపాల్లో ప్రారంభ అధ్యయనాలు, అవసరమైన భూముల గుర్తింపు, భూసేకరణ, సమగ్ర సాధ్యాసాధ్యాల నివేదిక, పర్యావరణ మదింపు ప్రభావం, మౌలిక డిజైన్ ఇంజనీరింగ్ ప్యాకేజీ, ఫ్రంట్-ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్ వంటివి ఉన్నట్లు తెలిపింది. కాగా.. బీపీసీఎల్ లేఖలో తూర్పు తీరం అని పేర్కొన్న నేపథ్యంలో ఎక్కడ ఏర్పాటు చేస్తారన్న దానిపై తొలుత ఆసక్తి నెలకొంది. ముందుగా అనుకున్నట్లుగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాత్రం ఏర్పాటు చేయడం లేదు. రామాయపట్నాన్ని ఎంచుకుంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆయిల్ రిఫైనరీని కృష్ణా జిల్లాకు తీసుకొచ్చేందుకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. బీపీసీఎల్ ప్రతినిధులతో పలుమార్లు భేటీ అయ్యారు కూడా.
అటు సీఎం సైతం ప్రత్యేక చొరవ తీసుకుని బీపీసీఎల్ ఉన్నతాధికారులను కలిసి.. ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని.. దానికి మచిలీపట్నం అనువైన ప్రాంతమని, అవసరమైన భూములను కేటాయిస్తానని కూడా హామీ ఇచ్చారు. వారి నుంచి సానుకూల స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత రామాయపట్నంలో ఏర్పాటు చేయడం మేలన్న నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రప్రభుత్వానికి ఇటీవ లే ఈ సమాచారం అందించింది. మచిలీపట్నం కాదని రామాయపట్నంలో ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపినా.. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి రావడం ముఖ్యమన్న ఉద్దేశంతో బీపీసీఎల్ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఆయిల్ రిఫైనరీ కమ్ పెట్రో-కెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టు రాష్ట్రానికి దక్కింది.
రిఫైనరీలో ఏం చేస్తారు?
బీపీసీఎల్‌కు ప్రస్తుతం ముంబై, బీనా (మధ్యప్రదేశ్), కోచి (కేరళ)ల్లో రిఫైనరీలు ఉన్నాయి. రామాయపట్నంలో ఏర్పాటు చేసేది నాలుగోది. ఈ రిఫైనరీల్లో ముడిచమురు ప్రాసెసింగ్ ద్వారా గ్యాసోలిన్, డీజిల్, పెట్రోల్, జెట్ ఫ్యూయల్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) వంటి పెట్రోలియం ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తారు. బీపీసీఎల్ ప్రధానంగా పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్), ఇంజన్ ఆయిల్స్, గేర్ ఆయిల్స్, గ్రీజు వంటి లూబ్రికెంట్లు, నాఫ్తా, ప్రొపేన్, బ్యూటేన్ వంటి పెట్రోకెమికల్ ఫీడ్‌స్టాక్‌లను కూడా ఉత్పత్తి చేస్తోంది. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ విషయానికి వస్తే.. ఇథలీన్, ప్రొపలీన్, బ్యూటడైన్, బెంజీన్ వంటి పెట్రోకెమికల్స్‌ను, పాలిథిలీన్, పాలీ ప్రాపీలీన్, పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) వంటి పాలిమర్ ఉత్పత్తులను తయారుచేస్తోంది. యూరియా, అమ్మోనియం నైట్రేట్ వంటి ఎరువులను, సాల్వెంట్స్, సర్ఫాక్టంట్స్ , అడిటైవ్స్ వంటి కెమికల్స్‌ను కూడా కూడా పెట్రో కాంప్లెక్స్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు. రిఫైనరీ, పెట్రో-కెమికల్ కాంప్లెక్స్.. రెండింటి ద్వారా విద్యుదుత్పత్తి కూడా చేపడతారు. వేస్ట్ మేనేజ్‌మెంట్ విధానాలను చేపట్టడంతో పాటు పరిశోధనలను కూడా నిర్వహిస్తారు. దేశంలో ఇంధన భద్రత పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. ఉపాధి అవకాశాలు కూడా విస్తృతమవుతాయి.
పెట్టుబడులకు బారులు..
చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక.. రాష్ట్రానికి భారీ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమివ్వడానికి ఎంతో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రిలయన్స్, టాటా వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రిని కలిసి వెళ్లాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసు (టీసీఎస్), లులు గ్రూపు విశాఖకకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే రూ.6,100 కోట్ల విలువ చేసే బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టు సాకారం కాబోతోంది.
Updated Date - Dec 25 , 2024 | 03:16 AM