Rejection : తెలంగాణకు కేంద్రం షాక్!
ABN, Publish Date - Dec 23 , 2024 | 04:12 AM
: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగేలా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన డాక్టర్ అంబేడ్కర్ వార్దా, కాళేశ్వరం (రోజుకు ఒక టీఎంసీ), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను...
వార్ధా, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి
3 నివేదికలను తిప్పిపంపిన కేంద్రం
స్వాగతిస్తున్న ఏపీ ప్రభుత్వం, నిపుణులు
అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు నష్టం కలిగేలా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన డాక్టర్ అంబేడ్కర్ వార్దా, కాళేశ్వరం (రోజుకు ఒక టీఎంసీ), పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మిస్తోందంటూ పదేళ్లుగా ఏపీ చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మూడు ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర జలశక్తి శాఖ తిప్పి పంపింది. కేంద్ర జలసంఘం లేవనెత్తిన సందేహాలకు సంతృప్తికరమైన రీతిలో సమాధానాలివ్వకపోవడంతో వాటి డీపీఆర్‌లను వెనక్కి పంపుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ ఇంజనీర్-ఇన్-చీ్‌ఫకు మూడ్రోజుల కిందట లేఖ రాసింది. జలశక్తి శాఖ నిర్ణయాన్ని ఆంధ్ర జల వనరుల శాఖ.. సాగునీటి రంగ నిపుణులు స్వాగతిస్తున్నారు.
ఏమిటా ప్రాజెక్టులు..?
డాక్టర్ అంబేడ్కర్ వార్దా ప్రాజెక్టు డీపీఆర్‌ను ఆమోదించరాదని కేంద్ర జల సంఘం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఈ ఏడాది మే 17నే నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో అధిక వ్యవసాయ భూములు మునిగిపోతాయని.. దీనికి ఆ రాష్ట్రప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) సమర్పించలేదని పేర్కొంటూ జల సంఘం గతేడాది జూలై 4, 17, 20 తేదీల్లో తెలంగాణకు లేఖలు రాసింది. ఆ రాష్ట్రప్రభుత్వం జవాబివ్వలేదు. ఈ అంశాన్ని జలసంఘం గత నెల 22న గుర్తుచేసినా సమాధానం లేదు. ఈ నేపథ్యంలో ఈ డీపీఆర్‌ను తిప్పిపంపింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా రోజుకు ఒక టీఎంసీని వాడుకునేలా తయారుచేసిన డీపీఆర్ 2022 ఏప్రిల్ 6 నుంచి జల సంఘం పరిశీలనలో ఉంది.
అయితే రోజుకు 2/3 టీఎంసీలు ఎత్తిపోసేలా పంపింగ్ సామర్థ్యం పెంచడానికి అదనంగా రూ.27 వేల కోట్లు ఖర్చవుతాయని తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్‌లో తెలిపింది. దీనిపై జలసంఘం వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను కూడా తిప్పి పంపింది. కాగా.. శ్రీశైలం ఫోర్‌షోర్ నుంచి రోజు కు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీల కృష్ణా జలాలను ఎత్తిపోసేందుకు పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని తెలంగాణ చేపట్టింది. చిన్న నీటి వనరుల్లో నీటి ఆదా ద్వారా 45 టీఎంసీలు, పోలవరం ప్రాజెక్టు కుడికాలువ ద్వారా పట్టిసీమ ఎత్తిపోతల నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఏపీ తరలిస్తే.. తమకు కృష్ణాజలాల్లో 45టీఎంసీల వాటా వస్తుందని.. ఈ 90 టీఎంసీలపై ఆధారపడి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు డీపీఆర్ సమర్పించింది. అయితే గోదావరి జలాల మళ్లింపు వల్ల కృష్ణా జలాల్లో లభించే 45 టీఎంసీలు తమకే చెందుతాయని ఏపీ కూడా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో దీని డీపీఆర్‌ను పరిశీలించే అవకాశంలేదని జలసంఘం స్పష్టంచేసింది.
Updated Date - Dec 23 , 2024 | 04:12 AM