Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి
ABN, Publish Date - Jun 28 , 2024 | 03:01 AM
ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
విశాఖ చిత్రనగరికి ఆయన పేరు
అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం
రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు
ఎన్టీఆర్, రామోజీని తెలుగు జాతి మరవదు
వారిద్దరికీ భారతరత్న సాధించడమే మన లక్ష్యం
విజయవాడ సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు
అమరావతిలో విగ్రహం పెట్టాలి: డిప్యూటీ సీఎం పవన్
రాజధానికి 10 కోట్లు విరాళమిచ్చిన రామోజీ కుటుంబం
‘‘ఎన్టీఆర్‌ను, రామోజీరావును తెలుగు జాతి మరవబోదు. కృష్ణా జిల్లాలో జన్మించిన వారిద్దరికీ భారతరత్న సాధించడమే మనందరి కర్తవ్యం. నటులు, కళాకారులకు రామోజీరావు జీవితాన్ని ఇచ్చారు. ఆయన గౌరవార్థం విశాఖపట్నంలోని చిత్రనగరికి రామోజీ పేరు పెడతాం. రాజధానిగా అమరావతి పేరు ఆయనే సూచించారు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు పెడతాం’’
- చంద్రబాబు
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అగ్రస్థానాన్ని అధిరోహించారని, ఏ పని చేసినా అందులో ప్రజా హితం కోరుకున్నారని కొనియాడారు. ‘‘ఎందరో నటులు, కళాకారులకు రామోజీరావు జీవితం ఇచ్చారు. ఆయన గౌరవార్థం విశాఖపట్నంలోని చిత్రనగరికి రామోజీ పేరు పెడతాం. రాజధానిగా అమరావతి పేరు ఆయనే సూచించారు. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. రాజధానిలో ఒక రోడ్డుకు ఆయన పేరు పెడతాం’’ అని చంద్రబాబు ప్రకటించారు.
తెలుగు జాతి ఎన్టీఆర్‌ను, రామోజీని మరవబోదని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో జన్మించిన వారిద్దరికీ భారత రత్న సాధించడం మనందరి కర్తవ్యమని స్పష్టం చేశారు. విజయవాడలోని కానూరులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన రామోజీరావు సంస్మరణ సభకు సతీసమేతంగా చంద్రబాబు హాజరయ్యారు. రామోజీ రావు విలువలు, ఆయన సేవ భావి తరాలకు స్ఫూర్తి అని అన్నారు. నీతి నిజాయితీగా వ్యాపారం చేసిన ఆయన ఆర్థిక మూలాలను దెబ్బ తీసేందుకు ‘మార్గదర్శి’పై గత ప్రభుత్వం కుట్ర చేసిందని గుర్తుచేశారు.
ప్రజల పక్షపాతి: పవన్ కల్యాణ్
ప్రజాస్వామ్యానికి పత్రికాస్వేచ్చ ఎంత అవసరమో ఈ దేశానికి రామోజీరావు చాటి చెప్పారని ఉపముఖ్యమంతి పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆయన ప్రజల పక్షపాతి అని తెలిపారు. జర్నలిస్టు విలువల్ని కాపాడిన ఆయన పత్రికాధిపతిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఆరోగ్యం క్షీణిస్తున్న సమయంలోనూ... కూటమి విజయంపై ఆరా తీసినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారన్నారు. ‘‘మొదటిసారి 2008లో ఆయన్ను కలిశాను. ‘నువ్వు ఏమి చేయాలనుకున్నావో, ఏం నమ్ముతున్నవో అది త్రికరణ శుద్ధిగా చేయి’ అని సూచించారు. ప్రజలకు ఏమి చేయాలో ఆయనకు స్పష్టత ఉంది.ఐదేళ్ల క్రితం లంచ్‌కు ఆహ్వానించినప్పుడు ఆయనలో వేదన కనిపించింది. ఆయనను గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అయినా తట్టుకుని నిలబడ్డారు. ఆయన విగ్రహం అమరావతిలో ఏర్పాటు చేయాలి. ఆర్టీఐ ఉద్యమకారుడిగానూ పోరాడిన రామోజీ ఒక పాత్రికేయ నదీ ప్రవాహం. అందులోంచి వీలైనన్ని నీళ్లు (పాత్రికేయ విలువలు) మనం తీసుకుని ఆయన వారసత్వాన్ని కొనసాగిద్దాం’’ అని వ్యాఖ్యానించారు.
పరిశోధనాత్మక జర్నలిజం ఇష్టం: ఎన్.రామ్
పరిశోధనాత్మక జర్నలిజాన్ని ఇష్టపడే రామోజీ రావు నమ్మిన విలువల కోసం కట్టుబడ్డారని హిందూ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్. రామ్ కొనియాడారు. ‘‘ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాత్రికేయ హక్కుల కోసం బలంగా పోరాటం చేశారు. పాత్రికేయులే లక్ష్యంగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం అప్పట్లో తెచ్చిన పరువు నష్టం బిల్లుకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ బిల్లులోని కఠిన నిబంధనలు ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, సాధించారు’’ అని గుర్తుచేశారు.
ప్రజాస్వామ్యం కోసం తపించారు: కిరణ్
ప్రజాస్వామ్య విలువల కోసం రామోజీ రావు ఎప్పుడూ పరితపించే వారని కుమారుడు కిరణ్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అండగా నిలిచే వారంటూ తండ్రి సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఎక్కడ విపత్తులు వచ్చినా సహాయం చేయడానికి ముందుండే ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు. నవ్యాంఽధ్ర రాజధాని అమరావతి పేరు రామోజీ రావు సూచించారని, దేశంలోనే గొప్ప నగరంగా అది ఎదగాలని ఆకాంక్షించారంటూ కిరణ్ గుర్తు చేసుకున్నారు. తమ కుటుంబం తరపున రాజధాని నిర్మాణానికి పది కోట్ల రూపాయలు విరాళంగా చెక్కు రూపంలో అందజేశారు. కార్యక్రమంలో రామోజీరావు కుటుంబ సభ్యులు, మంత్రులు లోకేశ్, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్, పార్థసారథి, కొల్లు రవీంద్ర, రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి, సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు, రాజమౌళి, బోయపాటి శీను, అశ్వనీదత్, శ్యాంప్రసాద్ రెడ్డి, ఎం.ఎం. కీరవాణి, ప్రసాద్ రెడ్డి, జయసుధ, మురళీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 08 , 2024 | 11:35 AM