AP Politics: బెంగళూరులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్
ABN, Publish Date - Jul 27 , 2024 | 08:46 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ (YSR Congress) చేసిన దాడులు అన్నీ ఇన్నీ కావు..! ముఖ్యంగా పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అయితే వైసీపీ నేతలు, అభ్యర్థులు విర్రవీగిపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టానుసారం ప్రవర్తించారు. ఆఖరికి టీడీపీ అభ్యర్థులపైన దాడులు చేసి.. వారి వాహనాలు కూడా ధ్వంసం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ తరఫున పోటీచేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. ఎన్నికల ముందు, పోలింగ్ రోజు.. ఫలితాల ముందు ఇలా ఎన్నిసార్లు దాడికి తెగబడ్డారో లెక్కే లేదు. ఆఖరికి తిరుపతి మహిళా యూనివర్శిటి వేదికగా నాని కారుపై తన గ్యాంగ్‌తో మోహిత్ దాడి చేయించారు. ఈ క్రమంలోనే అతనిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
పాపం పండింది!
గొడవ తర్వాత మోహిత్ రెడ్డి ఎక్కడా కనిపించలేదు. ఆయన్ను అరెస్ట్ చేయాలని తిరుపతి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్నారని పక్కా సమాచారం రావడంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. 307 సెక్షన్ నమోదు నేపథ్యంలో బెంగళూరు వెళ్లి మరీ మోహిత్ రెడ్డిని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. ఈ మేరకు అరెస్ట్ చేసినట్లు అధికారికంగా కూడా తిరుపతి పోలీసులు ప్రకటించారు. కాగా.. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుమారుడు ఓ రేంజిలో రెచ్చిపోయారు. ఎన్నికలు, ఫలితాల ముందు ఇష్టానుసారం ప్రవర్తించిన మోహిత్ రెడ్డి పాపం పండిందని కూటమి కార్యకర్తలు, నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ అసలు కథ..!
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద పలు అవకతవకలకు ప్లాన్ చేసినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే మే-14న శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల దగ్గరికి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, ఆయన సతీమణి సుధారెడ్డి.. అనుచరులతో వెళ్లగా ఒక్కసారిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డారు. వైసీపీ కార్యకర్తలు ఇక్కడికి ఎందుకొచ్చారు..? స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించడంతో పులివర్తి నానిపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి కూడా పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో వైసీపీ శ్రేణులు, చెవిరెడ్డి అనుచరులు సుత్తి, రాడ్లు, బీరు సీసాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో పులివర్తి నాని కారు ధ్వంసం కాగా.. గన్‌మెన్ ధరణికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. 150 మందికిపైగా రాడ్లు, కత్తులతో వచ్చి దాడి చేసి భయాభ్రాంతకులకు గురిచేశారని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు. దాడి చేసిన వారిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులు భానుకుమార్, గణపతిరెడ్డి మరికొందరు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించడంతో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. దీంతో మరుసటి రోజే 13 మందిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. 34 మందిని జైలుకు పంపారు. ఈ క్రమంలోనే .. 37వ నిందితుడిగా మోహిత్ రెడ్డిని చేర్చారు. అయితే అరెస్ట్ కాకుండా ఉండాలని బెయిల్ కోసం హైకోర్డులో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ క్రమంలోనే బెంగళూరులో ఉన్న మోహిత్ రెడ్డిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి.. ఏపీకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
Updated Date - Jul 27 , 2024 | 09:31 PM