వ్యవసాయానికి ఉపాధి నిధుల అనుసంధానం
ABN , Publish Date - Aug 23 , 2024 | 02:24 AM
విప్లవాత్మక కార్యాచరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తూ ప్రతిపాదనలతో ఆగిపోయిన అంశాన్ని పరిష్కరించనుంది. వ్యవసాయ అనుబంధ పనులకు ఉపాధి నిధులను అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విధానం రైతుల జీవితాల్లో కొత్త వెలుగు నింపనుంది. పంచాయతీల్లో శుక్రవారం జరిగే గ్రామ సభలు.. రైతుల ఆకాంక్షలకు బాసటగా నిలవనున్నాయి.

నేటి గ్రామ సభల్లో పనుల గుర్తింపు
చిత్తూరు, ఆంధ్రజ్యోతి: ఉపాధి నిధులతో చేపడుతున్న చెరువులు, సాగునీటి కాలువలు, మొక్కల పెంపకం వంటి పనులతో పాటు కొత్తగా ఈ ఏడాది వ్యవసాయంతో రైతులకు ఉపయోగపడే పనులను మంజూరు చేయనున్నారు. రైతుకు అవసరమైన పంట కాలువల నిర్మాణంతో పాటు పొలం గట్లపై మొక్కల పెంపకం, పొలంలో గుంతల తవ్వకం, సరిహద్దు కందకాలు నిర్మించుకోవడం, వ్యవసాయ బావుల నిర్మాణం, పండ్ల తోటల్లో రింగ్ ట్రెంచీల నిర్మాణం, గడ్డి పెంపకం, పండ్లు, పూలు, పట్టు పురుగులు, మల్బరీ తోటల పెంపకానికి నిధులు మంజూరు చేయనున్నారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం మినీ గోకులాలను సైతం ఉపాధి నిధులతోనే మంజూరు చేయనుంది. దీనికోసం విధివిధానాలను పశుసంవర్థక శాఖ ప్రకటించింది. ఒక్క యూనిట్ విలువలో రైతు వాటాగా 10 శాతం చెల్లించాలి. రెండు పశువుల మినీ గోకులానికి రూ.1.15 లక్షలు, నాలుగు పశువులకు రూ.1.85 లక్షలు, ఆరింటికి రూ.2.30 లక్షలు మంజూరు చేయనున్నారు. గొర్రెలు, మేకల షెడ్లకు 20 జీవాలకు రూ.1.30 లక్షలు, 50 జీవాలకు రూ.2.30 లక్షలు మంజూరు చేయనున్నారు. కోళ్ల షెడ్లకు వంద కోళ్లకు రూ.87 వేలు, 200 కోళ్లకు రూ.1.32 లక్షలు అందిస్తారు. దీనికోసం అన్ని గ్రామ పంచాయతీల్లోనూ ఒకేసారి శుక్రవారం గ్రామ సభల్ని నిర్వహించానున్నారు. రైతులు తమ ప్రణాళికలు, అవసరాలను గ్రామ సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. వీటిని అధికారులు పరిశీలించి పనులు మంజూరు చేస్తారు. జిల్లాలో పెద్దఎత్తున పాడి, తోటల పెంపకం, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు పునరుద్ధరణ జరిగే అవకాశముంది.
గ్రామ పంచాయతీలు: 697, ఉపాధి జాబ్ కార్డులు: 2,55,153
వేతనదారులు: 4,56,043, పనులకు హాజరవుతున్నవారు: 1,55,632
ఈ ఏడాది ఇంతవరకు జరిగిన చెల్లింపులు: రూ.127.64 కోట్లు
వేతనాలు: రూ.94.71 కోట్లు, మెటీరియల్ చెల్లింపులు: రూ.32,93 కోట్లు
వంద రోజులు పూర్తి చేసుకున్న కుటుంబాలు: 1,271
సగటు వేతనం: రూ.252