Share News

‘స్పోక్‌’ కోసం భవనాల పరిశీలన

ABN , Publish Date - Apr 16 , 2025 | 01:28 AM

తిరుపతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌కు అనుసంధానంగా ఏర్పాటు కానున్న స్పోక్‌ (సింగిల్‌ పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌) మోడల్‌ భవనం గుర్తింపు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు.

‘స్పోక్‌’ కోసం భవనాల పరిశీలన
ఏర్పేడులో స్థలాలకు సంబంధించి మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

రేణిగుంట, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌కు అనుసంధానంగా ఏర్పాటు కానున్న స్పోక్‌ (సింగిల్‌ పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌) మోడల్‌ భవనం గుర్తింపు పనులను వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. స్పోక్‌ భవనం కోసం మంగళవారం ఐఐటీ డైరెక్టర్‌ సత్యనారాయణ, ఐటీఈపీఓ ప్రతినిధి దీప్తి, అమరరాజా, అదానీ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు చేశారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఐదు సింగల్‌ పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌ హబ్‌లు ఏర్పాటు చేయనున్నారని, అందులో తిరుపతి ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న స్పోక్‌లో టెక్నాలజీ ఆవిష్కరణలకు ముందుకు వచ్చే విద్యార్థులకు అన్ని విధాల సహకారం అందించి నూతన ఆవిష్కరణలకు దోహదపడేలా చేస్తామన్నారు. అదానీ, అమరరాజా, నవయుగ పరిశ్రమలు, తిరుపతి ఐఐటీ సహకారంతో టెక్నాలజీ ఆవిష్కరణల కోసం కొత్త ఆలోచనలతో వచ్చే విద్యార్థులకు సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లో సహకారం అందిస్తామని చెప్పారు. తిరుపతి స్పోక్‌ హబ్‌లో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్‌ ఆర్కిటెక్చర్‌ మణి సందీప్‌, అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్‌ సీవోవో రాజన్‌బాబు, నవయుగ సీఈవో సుబ్బారావు, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ విజయ్‌ భరత్‌ రెడ్డి, ఏర్పేడు తహసీల్దార్‌ భార్గని తదితరులు పాల్గొన్నారు. ఏర్పేడులో స్థలాలను కలెక్టర్‌ పరిశీలించారు.

Updated Date - Apr 16 , 2025 | 01:28 AM