ఆర్డీఎ్‌సఎ్‌స పనులు పూర్తయ్యేదెప్పుడు?
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:32 AM
ఏడాది పడుతుందంటున్న అధికారులు

చిత్తూరు రూరల్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరాకోసం చేపట్టిన పనులు ఆలస్యమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎ్‌సఎ్‌స) నిధులతో జరుగుతున్న పనులు పూర్తయితే విద్యుత్ సరఫరాలో అంతరాలు తొలగనున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం సింగిల్ ఫేజ్ ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుండడంతో.. తరచూ ఎక్కడో ఒక చోట అంతరాయం కలుగుతోంది. ఆ క్రమంలో ప్రజలతోపాటు చిన్న, కుటీర పరిశ్రమల నిర్వహణ భారంగా మారింది. రైతులు కూడా ఇబ్బందిపడుతున్నారు.ఈ పరిస్థితులను అధిగమించేందుకు సింగిల్ ఫేజ్ వ్యవస్థను త్రీఫేజ్‌గా మారుస్తున్నారు. ఇందు కోసం జిల్లాకు సుమారు రూ.200 కోట్లు మంజూరయ్యాయి.ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 30 శాతం పనులు పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
పరిశ్రమలకు మేలు
కూటమి ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తోంది. ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.కోట్ల రాయితీతో రుణ సదుపాయం కుడా కల్పిస్తోంది. దాంతో నగర, గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి పరిశ్రమల ఏర్పాటు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పిండి మిషన్లు, కుటీర పరిశ్రమలు పెరిగే అవకాశం ఉంది. ఆ దిశగా త్రీఫేజ్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తే 24 గంటల విద్యుత్ సరఫరాకు ఆస్కారం ఏర్పడుతుంది. గృహ, వ్యవసాయ కనెక్షన్లు వేరుచేస్తూ...వాటికి ప్రత్యేక ఫీడర్ల ద్వారా ప్రత్యామ్నాయంగా ఇంటర్ లింక్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు.
గ్రామాలకు వేరుగా లైన్లు
ఆర్టీఎ్‌సఎస్ పథకంలో భాగంగా వ్యవసాయ పంపుసెట్లు ఎక్కువగా ఉన్న గ్రామాలకు ప్రత్యేక విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తారు.పొలాలకు ప్రత్యేక లైన్ ఏర్పాటు చేస్తారు. సబ్‌స్టేషన్ నుంచి గ్రామాలకు వెళ్లే ప్రత్యేక లైన్లకు త్రీఫేజ్ ఇస్తారు. పొలాలకు వెళ్లే లైన్‌కు తొమ్మిది గంటల పాటు మాత్రమే త్రీ ఫేజ్ ఇచ్చి... తరువాత నిలిపివేస్తారు. జిల్లాలో ఉన్న ఫీడర్లతో పాటు అదనంగా 50 ఫీడర్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా గ్రామీణ ప్రాతాల్లో ఉంటే రైస్‌మిల్లులు, త్రీఫేజ్‌పై ఆధారపడే పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ అందనుంది.
నత్తనడకన పనులు
జిల్లాలోని అన్ని మండలాల్లో ఆర్డీఎ్‌సఎస్ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు రెండేళ్ల క్రితమే ప్రారంభమైనా పనులు జరిగింది మాత్రం 35 శాతం కంటే తక్కువేనని చెప్పాలి. ఈ పనులపై గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అంతే కాకుండా కార్మికుల కొరత కూడా మరో కారణమని అధికారులు చెబుతున్నారు.దేశమంతా ఆర్డీఎ్‌సఎస్ పనులు జరుగుతుండడంతో కార్మికుల కొరత ఏర్పడింది. ఈ కారణం చేత పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి. .
ఏడాదిలోపు పూర్తి చేస్తాం
ఈ ఏడాదికే జిల్లాల్లో ఆర్టీఎ్‌సఎస్ పనులు పూర్తి కావాల్సివుంది. అయితే పనులు చేసేందుకు లేబర్ లేక ఆలస్యమైంది. వచ్చే ఏడాదికి పనులు పూర్తవుతాయి. ఈ పనులు పూర్తయితే గ్రామాల్లో కూడా 24 గంటల పాటు త్రీఫేజ్ కరెంటు సరపరా ఉంటుంది.
-ఇస్మాయిల్ అహ్మద్, ఎస్‌ఈ