Rammurthy Naidu: ప్రభుత్వ లాంఛనాలతో రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు.. పాడె మోస్తున్న సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Nov 17 , 2024 | 02:54 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి పలువురు ప్రజా ప్రతినిధులు సినీ నటులు నివాళులర్పించారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు నిన్న(శనివారం) మధ్యాహ్నం హైదరాబాద్‌లో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈరోజు(ఆదివారం) మధ్యాహ్నం నారావారిపల్లెలో అంత్యక్రియలు జరగనున్నాయి. రామ్మూర్తి నాయుడు మృతితో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే నారా రామ్మూర్తి నాయుడు అంతిమయాత్ర ప్రారంభమైంది. తమ్ముడి పాడెను సీఎం చంద్రబాబు మోస్తున్నారు. ప్రభుత్వ లాంఛనలతో రామ్మూర్తి నాయుడు అంత్య క్రియలు జరపనున్నారు. నారా రోహిత్ తలకొరివి పెట్టనున్నారు. నారావారిపల్లెలోని నారా రామ్మూర్తి నాయుడు అమ్మానాన్నలు సమాధులు ఉన్న చోటే అంతిమ సంస్కారాలు చేయనున్నారు.
అంతకుముందు హైదరాబాద్ నుంచి నారావారిపల్లికి రామ్మూర్తి నాయుడు పార్టీవ దేహం చేరుకుంది. స్విమ్స్ అంబులెన్స్‌లో రేణిగుంట విమానాశ్రయం నుంచి నారావారిపల్లికి చేరుకుంది. ఈరోజు(ఆదివారం) ఉదయం బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి నాయుడు పార్టీవ దేహాన్ని తీసుకుని వచ్చారు. పార్థివ దేహంతో పాటు మంత్రి నారా లోకేష్, ఇతర బంధువులు వచ్చారు. నారావారి పల్లెకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి చంద్రబాబుతో పాటు నారావారిపల్లికి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణ వచ్చారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మిణి ఇతర కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ రోజు రాత్రి నారావారిపల్లెలోనే చంద్రబాబు ఉండనున్నారు. రేపు తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది.
నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి పలువురు ప్రజా ప్రతినిధులు సినీ నటులు నివాళులర్పించారు. చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు,, సినీనటులు మోహన్ బాబు, మంచు విష్ణు, రాజేంద్రప్రసాద్, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి, మహారాష్ట్ర గవర్నర్ సి.రాధాకృష్ణన్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్. కలికిరి మురళీమోహన్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులు అర్పించారు. రామ్మూర్తి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంచి మిత్రున్నీ కోల్పోయా: రాజేంద్రప్రసాద్
నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడుకు సినీ నటులు రాజేంద్రప్రసాద్ నివాళులు అర్పించారు. ‘‘మంచి మిత్రుడిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి రామ్మూర్తి నాయుడు. మేమిద్దరం ఎప్పటినుంచో మంచి స్నేహితులం. మంచి రాజకీయ ఆదర్శ నాయకుడు. రాజకీయంగానే కాకుండా ఆయన మంచి మనసు కలిగిన వ్యక్తి రామ్మూర్తి నాయుడు. ఆయన లేని లోటు కుటుంబానికే కాదు ప్రజలందరికీ తీరని లోటు’’ అని రాజేంద్రప్రసాద్ తెలిపారు.
అనారోగ్యంతో రామ్మూర్తినాయుడు కన్నుమూత
కాగా. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడు(72) శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 14న హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజులుగా ఆరోగ్యం విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి అత్యాధునిక చికిత్స అందించారు. అయినప్పటికీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని, మధ్యాహ్నం 12.45గంటలకు కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు భార్య ఇందిర, కుమారులు గిరీశ్, రోహిత్ ఉన్నారు. వీరిలో రోహిత్ సినీనటుడు కాగా, గిరీశ్ గల్ఫ్‌లో వ్యాపారం చేస్తున్నారు.
సోదరుడి ఆరోగ్యం విషమించిన వార్త తెలియగానే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు. తమ్ముడి పార్ధివదేహానికి నివాళులర్పించి, ఆయన కుమారులు రోహిత్, గిరీశ్‌ను ఓదార్చారు. ఈ అంత్యక్రియలకు నారా, నందమూరి కుటుంబీకులు హాజరు కానున్నారు. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు, తెలంగాణ నుంచి సైతం పలువురు నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.
రాజకీయ నేపథ్యం
తొలినాళ్లలో అన్న చంద్రబాబు వెన్నంటి నడుస్తూ రాజకీయంగా తోడునీడగా నిలిచిన రామ్మూర్తినాయుడు 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1994 ఎన్నికల్లో చంద్రగిరి ఎమ్మెల్యే టికెట్ పొంది కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారిపై 16వేలకు పైగా మెజారిటీతో గెలిచారు. 1999లో వర్గ రాజకీయాలతో ముఖ్య నేతలు సహాయ నిరాకరణ చేయడంతో ఓటమి పాలయ్యారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గడంతో 2003లో టీడీపీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే చంద్రగిరి అసెంబ్లీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పెద్దలు మొండిచేయి చూపడంతో 2004 ఎన్నికల సమయంలో ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే టీడీపీ అభ్యర్థి కంటే ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. రామ్మూర్తినాయుడు ఓట్లు చీల్చడం వల్లే కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణకుమారి సునాయాసంగా విజయం సాధించారు.
Updated Date - Nov 17 , 2024 | 03:02 PM