Share News

CM Chandrababu : నేడు 15 పరిశ్రమలు ప్రారంభం

ABN , Publish Date - Aug 19 , 2024 | 04:13 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.1,570 కోట్ల పెట్టుబడులతో, 8,480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటైన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు.

CM Chandrababu : నేడు 15 పరిశ్రమలు ప్రారంభం

రూ.1,570 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు

900 కోట్లతో 7 పరిశ్రమలకు భూమి పూజ

శ్రీసిటీలో సీఎం చేతులమీదుగా కార్యక్రమం

రూ.1,213 కోట్లతో మరో 5 పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు

తిరుగు ప్రయాణంలో సోమశిల సందర్శన

అమరావతి/తిరుపతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రూ.1,570 కోట్ల పెట్టుబడులతో, 8,480 మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయిలో ఏర్పాటైన 15 పరిశ్రమలను ఆయన ప్రారంభించనున్నారు. అలాగే రూ.900 కోట్ల పెట్టుబడులతో 2,740 మందికి ఉద్యోగాలు కల్పించే 7 పరిశ్రమలకు భూమిపూజ చేయనున్నారు.

అదేవిధంగా రూ.1,213 కోట్ల పెట్టుబడితో 4,060 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే మరో 5 పరిశ్రమల స్థాపనకు సంబంధిత ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అధికారిక సమాచారం మేరకు... సోమవారం ఉదయం 10.40 గంటలకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో బయల్దేరి 11.30 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడనుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12గంటలకు శ్రీసిటీ వెళ్లనున్నారు.


శ్రీసిటీ బిజినెస్‌ సెంటర్‌ను సందర్శించి మధ్యాహ్నం 2.30 వరకూ అక్కడే గడపనున్నారు. ఈ సందర్భంగా ఎల్జీ పాలిమర్స్‌, నైడెక్‌, ఈప్యాక్‌ డ్యూరబుల్స్‌, నియో లింక్‌ టెలికమ్యూనికేషన్స్‌, ఓజీ ఇండియా ప్యాకేజింగ్‌, జెన్‌ లైనెన్‌ ఇంటర్నేషనల్‌, బెల్‌ ఫ్లేవర్స్‌ అండ్‌ ఫ్రాగ్రెన్సెస్‌, జేజీఐ మెటల్‌ కన్‌వెర్ట్స్‌, త్రినాథ్‌ ఇండస్ట్రీస్‌, ఎవర్‌ షైన్‌ మౌల్డర్స్‌, ఆటోడేటా, ఎస్‌కే కాంపొనెంట్స్‌, అడ్మైర్‌ కేబుల్స్‌, బాంబో కోటెడ్‌ అండ్‌ స్పెషల్‌ స్టీల్‌, శ్రీలక్ష్మీ ఆగ్రో ఫుడ్స్‌ తదితర పరిశ్రమలతో పాటు శ్రీసిటీ ఈఎంసీ ఫైర్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు.


అలాగే బ్లూస్టార్‌, ఎన్జీసీ ట్రాన్స్‌మిషన్‌, సిద్ధార్థ లాజిస్టిక్స్‌, టీఐఎల్‌ హెల్త్‌ కేర్‌, ఏజీపీ సిటీ గ్యాస్‌, ఆర్‌ఎ్‌సబీ ట్రాన్స్‌మిషన్‌, వెర్మైరెన్‌ రిహాబ్‌ తదితర పరిశ్రమలతో పాటు హైటెక్‌ పోలీ్‌సస్టేషన్‌ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత డైకిన్‌, యాక్సెలెంట్‌ ఫార్మా, ఆర్మ్‌ వెస్ట్‌ మిరైటెక్‌ ఇండియా, క్యాప్‌ మ్యాన్‌ ఇండియా, పీఐ ప్రిస్టేజ్‌ ఇంటర్నేషనల్‌ తదితర ఐదు పరిశ్రమల ఏర్పాటుకు ఆయా సంస్థల ప్రతినిధులతో ఎంవోయూలు కుదుర్చుకుంటారు. అనంతరం శ్రీసిటీలోని వివిధ పరిశ్రమల సీఈవోలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 2014-19 మధ్యకాలంలో శ్రీసిటీ విస్తరణకు... పెట్టుబడుల ఆకర్షణకు నాటి టీడీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేసింది.


2016లో 4వేల మందికి ఉపాధి లభించేలా రూ.1,200 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకొంది. 2017లో రూ.600 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు 13 కంపెనీలతో, 2018లో 14 సంస్థలతో రూ.3,500కోట్ల పెట్టుబడులతో 4వేల ఉద్యోగాలు లభించేలా ఒప్పందాలు కుదిరాయి. ఈసారి కూడా అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపిస్తోంది. దీనిలో భాగంగానే అక్కడ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాటైంది. శ్రీసిటీ పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టును చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం గన్నవరం తిరుగు ప్రయాణం కానున్నారు.

Updated Date - Aug 19 , 2024 | 08:53 AM