ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Deputy CM Pawan Kalyan : చంద్రబాబు విజన్‌ అద్భుతం

ABN, Publish Date - Dec 14 , 2024 | 03:18 AM

భవిష్యత్తు ఆంధ్రా కోసం పాటుపడే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వందేళ్ల ఆయుష్షు ఇవ్వాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

  • దేవుడు వందేళ్ల ఆయుష్షు ఇవ్వాలి.. నా సంపూర్ణ సహకారం ఉంటుంది

  • రూల్‌ ఆఫ్‌ లా బలంగా ఉంటేనే అభివృద్ధి.. అన్ని రంగాల్లో వృద్ధి చెందాలి

  • అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం.. యువతకు ఉపాధి అవకాశాలు

  • సమష్టిగా పనిచేద్దాం.. అధికారులు తమ బలం తెలుసుకోవాలి

  • సక్రమంగా బాధ్యతలు నిర్వహించాలి.. డిప్యూటీ సీఎం పవన్‌

  • స్వర్ణాంధ్ర-2047 ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం పవన్‌

రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం. మన రాష్ట్రంలో మరో రెండున్నర దశాబ్దాలు సుస్థిర ప్రభుత్వం ఉండాలి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలలు గన్న వికసిత్‌ భారత్‌-2047లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామి కావాలి.

- ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు ఆంధ్రా కోసం పాటుపడే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వందేళ్ల ఆయుష్షు ఇవ్వాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని, తనతో పాటు ఈ వేదికపై ఉన్న వారందరూ ఆయన వెంటే ఉంటామన్నారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్‌ను చంద్రబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు. ఉపాధి అవకాశాలకు చంద్రబాబు ఆర్కిటెక్ట్‌ అని, ఆయన విజన్‌ అద్భుతమని ప్రశంసించారు. ‘సీఎం చంద్రబాబు 1999లో విజన్‌-2020 అని చెప్పినప్పుడు అపహాస్యం చేసిన వ్యక్తులే సైబరాబాద్‌ ప్రాంతాల్లో స్థలాలు కొనుక్కొని ఈ రోజు ఆనందంగా ఉన్నారు. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిందే ఈ స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్‌.ఏ రంగం ఎలా ముందుకు వెళ్లాలి? ఏ రంగానికి భవిష్యత్తులో ప్రాధాన్యముంటుంది? ఆ రంగాల్లో మనం ఎలా ప్రగతి సాధించాలి? అన్న పూర్తి విజన్‌ మనకు ఉన్నప్పుడే భవిష్యత్తు అందంగా మారుతుంది. అలాంటి భవిష్యత్తును ముందుగానే ఊహించగల దార్శనికుడు చంద్రబాబు. రాబోయే కాలంలో యువతకు ఉద్యోగాలు ఉండాలి. 2047 నాటికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం వస్తుంది. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ పెరగాలి.


నాణ్యమైన విద్య, వైద్యం అందరికీ అందాలనే గొప్ప లక్ష్యాలతో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని ఈ డాక్యుమెంట్‌ రూపొందించారు. దీన్ని సాకారం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు సమష్ఠగా పనిచేయాల్సిన అవసరముంది. మనమంతా ఐకమత్యంగా కష్టపడితే భావితరాలకు గొప్ప భవిష్యత్తును అందించవచ్చు’ అన్నారు.

  • నిర్మించడమే కష్టం

‘రాష్ట్రంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో సకాలంలో వైద్య సాయం అందక, డోలీల్లో రోగులను, బాలింతలను తీసుకొచ్చే పరిస్థితి ఉండటం బాధాకరం. రాష్ట్రంలో ఇలాంటి గ్రామాలు 2,854 ఉన్నాయని కలెక్టర్ల సదస్సులో అధికారులు చెప్పారు. అక్కడ రోడ్ల సదుపాయం, వైద్య సౌకర్యాల మెరుగుదలకు రూ.3 వేలకోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇంతటి కీలకమైన సమస్యను తీర్చడానికి ప్రభుత్వ ఖజానాలో తగినన్ని నిధులు లేవు. గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌ కోసం రూ.500 కోట్లు, జగనన్న సర్వే రాళ్లు పాతేందుకు రూ.1200 కోట్లు దుబారా చేసింది. గత ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేసిన నిధులే కనుక ఈ రోజు మన దగ్గర ఉంటే కనీసం 1400 గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించేందుకు వీలుండేది. గిరిజన గ్రామాలకు మూడు దశల్లో రోడ్డు సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని సీఎం చెప్పడం ఆనందం కలిగించింది. ఏ వ్యవస్థను అయినా, నిర్మాణాన్ని అయినా నిర్మించడం చాలా కష్టం. కూల్చేయడం తేలిక. గత ప్రభుత్వం కూల్చివేతలతో పాలనను మొదలుపెట్టి పూర్తిగా కూలిపోయింది. కలెక్టర్ల సదస్సులో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా చెప్పినట్లు అధికారులు వారి బలం వారే తెలుసుకోవాలి. వ్యవస్థలను గాడిలో పెట్టే శక్తి ప్రభుత్వ కార్యనిర్వాహక యంత్రాంగం దగ్గర ఉంది. దానిని తెలుసుకుని పనిచేస్తే మనమందరం కలలు కనే కొత్త ఆంధ్రప్రదేశ్‌ కచ్చితంగా సాధ్యమవుతుంది. ఒత్తిళ్లకు, భయాలకు అతీతంగా పనిచేయండి. మీకు కచ్చితంగా ప్రభుత్వ మద్దతు ఉంటుంది. మీరు చేసే పని ప్రజలకు మేలు చేసేది అయితే దానిని ప్రోత్సహించే బాధ్యత మేం తీసుకుంటాం’ అని పవన్‌ పేర్కొన్నారు.


  • రూల్‌ ఆఫ్‌ లా బలంగా ఉండాలి

‘రూల్‌ ఆఫ్‌ లా అనేది బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే ప్రతి ఒక్కరికీ రూల్‌ ఆఫ్‌ లా సమానంగా ఉండాలి. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు బలంగా ఉండాలి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటే పెట్టుబడిదారులు తరలివస్తారు. రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుంది. స్వర్ణాంధ్ర విజన్‌-2047 ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రతి ఒక్కరి జీవితంలో సంపద రావాలని, సుస్థిరత రావాలని, సమగ్రాభివృద్ధి చెందాలనేది మా సంకల్పం. ఇది మహా సంకల్పంగా మారాలి’ అని పవన్‌ అన్నారు.

  • సీఎంపై పవన్‌ ప్రశంసలు

‘ముఖ్యమంత్రి, నేను పరస్పరం ఎంతో గౌరవించుకుంటాం. ఆయన నాకు ఎంతో గౌరవం ఇస్తారు. ఏ విషయంలో కూడా నాకు చెప్పకుండా ముందుకు వెళ్లరు. ఆయన నాయకత్వ తీరును, ఓపికను దగ్గర నుంచి గమనిస్తూ ప్రతి అంశాన్ని నేర్చుకోవాలని భావిస్తున్నాను. 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడు అవసరమని ఆనాడు ఏమీ ఆశించకుండా మద్దతు ఇచ్చాను. ఇప్పుడు ఆయన నాయకత్వం లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రజల ఆశలను నెరవేర్చేలా సీఎం, నేను పనిచేస్తాం. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని విభేదాలు పక్కనపెట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. 21వ శతాబ్దంలో కూడా నా కులం, నా వర్గం అంటే కష్టం. సమస్యలు అందరికీ ఉంటాయి. వాటిని శాంతియుత పంథాలో పరిష్కరించుకుందాం. కులాలు, మతాలని కూర్చుంటే అభివృద్ధి సాగదు. వాటిని దాటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం’ అని పవన్‌ అన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 03:18 AM