Kakinada: సంచలనం సృష్టించిన పిఠాపురం అత్యాచారం కేసులో ఇద్దరి అరెస్టు..
ABN, Publish Date - Oct 09 , 2024 | 10:08 PM
పిఠాపురంలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
కాకినాడ: పిఠాపురంలో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన జాన్ అనే వ్యక్తిని సహకరించిన సుబ్బలక్ష్మి అనే మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈనెల 7న చిన్నారికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన నిందితులు మాధవపురం డంపింగ్ యార్డుకు తీసుకెళ్లారు. అనంతరం అఘాయిత్యానికి పాల్పడగా.. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అత్యాచార ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. నిందితులను అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ(బుధవారం) వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
అసలేం జరిగిందంటే..
పిఠాపురం స్టువర్టుపురం ప్రాంతంలో స్థానికంగా ఉండే బాలిక ఈనెల 7న పని నిమిత్తం రోడ్డుపై వెళ్తోంది. అయితే అటుగా ఆటోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు(జాన్, సుబ్బలక్ష్మి) ఆమెకు కాగితం చూపించి అడ్రస్ అడుగుతున్నట్లు నటించారు. అయితే బాలిక అడ్రస్ చెప్తున్న సమయంలో ఆమె ముఖంపై నిందితులిద్దరూ మత్తుమందు చల్లారు. స్పృహ తప్పిపోయిన ఆమెను వెంటనే ఆటోలో ఎక్కించుకుని పిఠాపురం శివారు మాధవపురం డంపింగ్ యార్టుకు తీసుకెళ్లారు.
అక్కడ యువతికి మద్యం తాగించిన జాన్ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడికట్టాడు. అయితే అటుగా వచ్చిన ప్లాస్టిక్ కాగితాలు ఏరుకునే మహిళ వారిని గమనించి స్థానికులు, చిన్నారి కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యాచార ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ సైతం మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అయితే బాలిక ప్రస్తుతం కోలుకుంటోంది.
Updated Date - Oct 09 , 2024 | 10:08 PM