AP Cabinet: తూర్పు నుంచి మంత్రులు వారేనా.. రేసులో ఎవరంటే..!
ABN, Publish Date - Jun 09 , 2024 | 12:59 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చంతా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు.. అనుభవానికి పెద్దపీట వేస్తారా.. యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 12న కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడు చర్చంతా చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరు ఉండబోతున్నారు.. అనుభవానికి పెద్దపీట వేస్తారా.. యువతకు అవకాశాలు ఇస్తారా అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం టీడీపీ నుంచి గెలిచిన 135 మంది ఎమ్మెల్యేల్లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో ఉన్నత విద్యావంతులైన యువత ఉన్నారు. దీంతో మంత్రివర్గంలో ఎవరుంటారనేది హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు జనసేన నుంచి 21 మంది, బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ చేరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రమంత్రివర్గంలో జనసేన, బీజేపీ ఉండే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయి. రెండు పార్టీలకు కలిపి నాలుగు నుంచి ఆరు మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. మొత్తం మంత్రిమండలిలో సీఎంతో కలిపి గరిష్టంగా 26మంది ఉండే అవకాశం ఉంది.
చంద్రబాబు నాయుడిని మినహిస్తే మూడు పార్టీల నుంచి కలిపి 25 మందికి మంత్రివర్గంలో అవకాశం లభిస్తుంది. అంటే టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో 19 నుంచి 20 మందికి కేబినెట్‌లో ఛాన్స్ దక్కనుంది. వీరిలో కుల, మత, ప్రాంతీయ సమీకరణలు చూడనున్నారు. ముస్లిం మైనార్టీలకు ఒక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన 18 లేదా 19 మందిలో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తుంది. దీంతో రాష్ట్రంలో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలున్న జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి. ఈ జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉండగా.. అన్నిచోట్ల కూటమి అభ్యర్థులే గెలుపొందారు. జనసేన నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎన్నికయ్యారు. వీరిలో పవన్‌కళ్యాణ్ కూడా ఉండటంతో.. ఆయనకు కేబినెట్‌లో బెర్త్ కన్ఫర్మ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ జిల్లాలో గెలిచిన మరో నలుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కావడంతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కేటాయించాల్సి ఉండటంతోతూర్పునుంచి జనసేనలో పవన్‌కు మినహ మిగతావాళ్లకు అవకాశం దక్కకపోవచ్చనే చర్చ జరుగుతోంది.
Chandrababu : బాబు ప్రమాణానికి వేగంగా ఏర్పాట్లు
తూర్పు నుంచి బరిలో..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 13 స్థానాల్లో పోటీచేసింది. అన్ని స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించారు. వీరిలో గతంలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న నాయకులు నలుగురు ఉన్నారు. ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్లు నలుగురు ఉన్నారు. అంటే మొత్తం 8మంది గతంలోనే ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లు ఉన్నారు. ఐదుగురు మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ ఎనిమిది మంది మంత్రి పదవికోసం పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నిమిది మందిల్లో ఆ ఇద్దరు ఎవరనేది ప్రస్తుతం ఆసక్తి రేపుతుంది.
Modi 3.0 Cabinet: తెలుగు రాష్ట్రాల నుంచి మోదీ కేబినెట్‌లోకి ఊహించని వ్యక్తులు.. సీనియర్లకు బిగ్ షాక్
సామాజిక వర్గాలవారీ..
సామాజిక వర్గాల పరంగా చూస్తే టీడీపీ నుంచి గెలిచిన 13 మందిలో నలుగురు కాపు సామాజికవర్గం నేతలు ఉన్నారు. బీసీ నేతలు నలుగురు ఉండగా.. వీరిలో వెలమ సామాజికవర్గం నుంచి ఇద్దరు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి ఇద్దరు, ఎస్సీ ఒకరు, ఎస్టీ నుంచి ఒకరు ఉన్నారు. అలాగే క్షత్రియ సామాజిక వర్గం నుంచి మరొకరున్నారు. కాపు సామాజికవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉండటంతోపాటు.. ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు కాపు నేతలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉండటంతో టీడీపీ నుంచి ఈ జిల్లాలో ఆ సామాజిక వర్గానికి మరో మంత్రి పదవి రాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. ఎస్సీ నుంచి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే అయితాబత్తుల ఆనందరావును అదృష్టం వరించే అవకాశం ఉంది. ఇక ఓసీ సామాజికవర్గానికి మంత్రి పదవి లభిస్తే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వేగుళ్ళ జోగేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు పోటీపడనున్నారు. వీరిలో ప్రధానంగా గోరంట్ల బుచ్చయ్యచౌదరి లేదా జోగేశ్వరరావుకు అవకాశం రావొచ్చని ప్రచారం జరుగుతోంది. బుచ్చయ్య చౌదరిని స్పీకర్ చేసే అవకాశం ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. అదే నిజమైతే వేగుళ్ళ జోగేశ్వరరావుకి కేబినెట్ బెర్త్ కన్ఫర్మ్ కావొచ్చు. గోరంట్లను మంత్రి వర్గంలోకి తీసుకుంటే మాత్రం వేగుళ్ళకు అవకాశం దక్కకపోవచ్చు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు.. సుదీర్ఘకాలంగా టీడీపీనే నమ్ముకుని ఉండటంతో పాటు.. పార్టీ కష్టకాలంలో అండగా ఉండటంతో జోగేశ్వరరావుకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
అయితాబత్తుల ఆనందరావుతో పాటు వేగుళ్ళ జోగేశ్వరరావు లేదా గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి అవకాశం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో అయితాబత్తుల ఆనందరావు అమలాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మండపేట సైతం ఇదే పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అందుకే ఒకే నియోజకవర్గం నుంచి రెండు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం లేకపోతే మాత్రం జోగేశ్వరరావుకు అవకాశం రాకపోవచ్చు. అప్పుడు రాజమండ్రి పార్లమెంట్ నుంచి గోరంట్లకు లేదా కాకినాడ పార్లమెంట్ నుంచి బీసీ కోటాలో వనమాడికి కూడా మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. మొత్తానికి మంత్రివర్గం రేసులో ఉమ్మడి తూర్పుగోదావరి నుంచి ఎనిమిది మంది పోటీపడుతుండగా.. ఇద్దరికి బెర్త్‌లు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రి మండలిలో ఎవరెవరుంటారనేది ఈనెల 11 రాత్రికి లేదా 12న తేలనుంది.
YSRCP: వైసీపీలో మొదలైన రాజీనామాలు.. సీనియర్లు ఔట్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh and Latest Telugu News
Updated Date - Jun 09 , 2024 | 12:59 PM