AP Elections 2024: సజ్జలపై ఏం చేద్దాం!
ABN, Publish Date - Apr 11 , 2024 | 09:32 AM
Sajjala Rama Krishna Reddy: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) గీత దాటుతున్నారని, ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉండి రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్ మీనాకు పాలుపోవడం లేదు. సజ్జల ఓ వైసీపీ కార్యకర్తలా విపక్షాలపై విషం చిమ్ముతున్నారని..
ఈసీకి సీఈవో మీనా లేఖ
సలహాదారులపై చర్యలకు ఎన్నికల నియమావళిలో నిబంధనల్లేవు
40 మంది అడ్వయిజర్లు ఉన్నారు.. వీరిలో 9 మందికి కేబినెట్ ర్యాంకు
మిగతా 31 మంది వివిధ కేటగిరీల్లో ఉన్నారు
వీరిపై వచ్చే ఫిర్యాదులపై ఎలా వ్యవహరించాలో మీరే చెప్పండి
ఎన్నికల సంఘాన్ని కోరిన సీఈవో
అమరావతి, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) గీత దాటుతున్నారని, ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉండి రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేశ్‌కుమార్ మీనాకు పాలుపోవడం లేదు. సజ్జల ఓ వైసీపీ కార్యకర్తలా విపక్షాలపై విషం చిమ్ముతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత నెల 24న ఫిర్యాదు చేశారు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోపణలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని.. సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల నియమావళిలో సలహాదారులు లక్ష్మణ రేఖ దాటితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎలాంటి నిబందనలనూ పేర్కొనలేదు. ఈ నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకోవాలో చెప్పాలంటూ మీనా కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్‌కుమార్‌కు తాజాగా లేఖ రాశారు. ప్రభుత్వంలో 40 మంది సలహాదారులున్నారని, ఇందులో 9 మందికి కేబినెట్ ర్యాంకు ఉందని.. మిగిలిన 31 మంది పీ, క్యూ, ఆర్ కేటగిరీల్లో ఉన్నారని.. ప్రభుత్వం నుంచి జీత భత్యాలు అందుకుంటూ సౌకర్యాలు అనుభవిస్తున్నారని అందులో పేర్కొన్నారు.
కొల్లి, ధర్మారెడ్డిల సంగతేంటి?
సలహాదారులందరికీ వర్తించేలా ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలని ఈసీని అభ్యర్థించారు. అయితే.. పేరేదైనా ప్రభుత్వ ఖజానా నుంచే సలహాదారులు జీతభత్యాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఖర్చుతో సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అందుచేత ఆ స్థాయి వ్యక్తులకు వర్తించే నియమావళే సలహాదారులకూ వర్తింపజేయాలన్న డిమాండ్ వస్తోంది. నియమావళిలో నిబంధనలు లేవని వారు ఏం మాట్లాడినా ఎలా చెల్లుబాటవుతుంది? ప్రజల సొమ్ము జీతభత్యాలుగా తీసుకుంటూ అధికార పక్షానికి అనుకూలంగా ఎలా వ్యవహరిస్తారు..? జీవోలిచ్చి నిబంధనల ప్రకారమే ప్రభుత్వం వారిని సలహాదారులుగా నియమించుకుంది. అలాంటప్పుడు వారిపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కించడం ఏమిటని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
Updated Date - Apr 11 , 2024 | 09:32 AM