ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Sharmila: షర్మిల దూకుడు!

ABN, Publish Date - May 11 , 2024 | 05:04 AM

కడపలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఢిల్లీ గడ్డ సైతం అటు వైపే చూస్తోంది.

  • కడపలో శరవేగంగా మారుతున్న రాజకీయం

  • వైసీపీతో ఢీ అంటే ఢీ

  • వివేకా హత్య కేసులో అన్న, తమ్ముడితో చెడుగుడు

  • సొంత జిల్లా బిడ్డగా జనంలో క్రేజ్‌.. విస్తృత ప్రచారం

  • చిన్నాన్న వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ధ్వజం

  • జిల్లా అభివృద్ధిని దెబ్బతీశారని ఆగ్రహం

  • చాపకింద నీరులా సునీత ప్రచారం.. సౌభాగ్యమ్మ కూడా

  • జగన్‌ శిబిరం ఉక్కిరిబిక్కిరి.. అయోమయంలో అవినాశ్‌

  • దీంతో జిల్లాపై జగన్‌ ప్రత్యేక ఫోకస్‌.. 4 చోట్ల సభలు

(కడప-ఆంధ్రజ్యోతి)

కడపలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఢిల్లీ గడ్డ సైతం అటు వైపే చూస్తోంది. ప్రాంతీయ మీడియాతో పాటు జాతీయ మీడియా సైతం కడప బాట పడుతుండడం అక్కడి పరిస్థితిని తెలియజేస్తోంది. సీఎం జగన్‌ (YS Jagan) సోదరి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలారెడ్డి (YS Sharmila) కడప ఎంపీ స్థానానికి బరిలో దిగారు. ఇదే స్థానానికి వైసీపీ నుంచి వరుసకు జగన్‌/షర్మిలకు సోదరుడు, సిటింగ్‌ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి చదిపిరాళ్ల భూపేశ్‌రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ షర్మిల దూకుడు మామూలుగా లేదు. చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో అన్నను, తమ్ముడిని చీల్చి చెండాడుతున్నారు. నిందితుడైన అవినాశ్‌ అండ్‌ కోను జగన్‌ వెనకేసుకురావడం వెనుక మర్మమేంటో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి ఆమె వెంట తిరుగుతూ తండ్రి హత్యకు న్యాయం చేయాలని ప్రజలను అడుగుతున్నారు. షర్మిల కొంగుపట్టి న్యాయం అర్థించడం జనంలో ఆలోచన రేపుతోంది. ఆమె వాగ్ధాటి, చొచ్చుకు పోతున్న తీరు జగన్‌ను కలవరపరుస్తున్నాయి. మరోపక్క అవినాశ్‌రెడ్డి దిక్కుతోచక అయోమయంలో పడిపోయారు.

పీసీసీ చీఫ్‌గా వచ్చీ రాగానే..

అవినాశ్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ షర్మిల ప్రచారం వైసీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రజలపైన, వారి ఓటింగ్‌పైన ఆమె చూపించే ప్రభావం కడప లోక్‌సభ స్థానానికే పరిమితం కాబోదని.. అసెంబ్లీ సీట్లపైనా పడితే వైసీపీ అభ్యర్థులకు కష్టాలు తప్పవన్న భయం వారిలో కనబడుతోంది. షర్మిల పీసీసీ చీఫ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఇడుపులపాయ వచ్చినప్పుడు, అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు, వివేకా వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన స్మారక కార్యక్రమానికి వచ్చినప్పుడూ.. వివేకా హత్య కేసులో నిందితులను జగన్‌ కాపాడుతుండడం, అవినాశ్‌రెడ్డి గురించి చెప్పుకొచ్చారు. కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించాక జిల్లా అంతటా ఆమె బస్సుయాత్ర చేపట్టారు. ఈ నెల 1 నుంచి జిల్లాలో రెండో విడత ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ‘చిన్నాన్నను చంపించింది అవినాశ్‌రెడ్డే. అతడు అరెస్టు కాకుండా కాపాడుతున్నది సీఎం జగన్‌రెడ్డే. రాజశేఖర్‌రెడ్డి తమ్ముడు, సొంత బాబాయి అయిన వివేకాను హత్య చేస్తే జగన్‌కు బాధ లేకుండా హంతకుల పక్క ఉంటున్నాడు’ అని ఆమె ఊరూవాడా విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో జిల్లా అభివృద్ధిపైనా నిలదీస్తున్నారు.

వన్‌ మేన్‌ ఆర్మీ..

షర్మిల సభలకు జనం కూడా బాగా తరలివస్తున్నారు. జిల్లాలో బలమైన నాయకులు, కేడర్‌ లేకున్నా ఆమె వన్‌మేన్‌ ఆర్మీగా తిరుగుతూ కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. అగ్నికి అజ్యం తోడైనట్టు సునీత, ఆమె తల్లి సౌభాగ్యమ్మ కూడా షర్మిల వెంట నడుస్తున్నారు. సునీత పులివెందుల మొత్తం ఓ మారు చుట్టేశారు. షర్మిలను ఎంపీగా చూడాలన్నది నాన్న చివరి కోరిక అనే విషయాన్ని జనంలోకి బాగా తీసుకెళ్లారు. ఇక షర్మిల పదునైన విమర్శలతో జగన్‌, అవినాశ్‌రెడ్డిలపై విరుచుకుపడుతున్నారు. ‘సొంత చిన్నాన్న గురించి జగన్‌ ఒక్కరోజైనా మంచి మాట మాట్లాడారా..? వివేకా వ్యక్తిగత జీవితాన్ని హననం చేసేలా సొంత పత్రికలో కథనాలు, సోషల్‌ మీడియాలో రాక్షసమూక ట్రోల్‌ చేస్తోంటే ఏం చేస్తున్నారు’ అంటూ ఆమె వేస్తున్న ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.

జగన్‌ శిబిరంలో వణుకు..

షర్మిల సభలకు జనం స్వచ్ఛందంగా తరలిరావడం జగన్‌ శిబిరానికి వణుకు పుట్టిస్తోంది. మొన్నటిదాకా గెలుపు ఏకపక్షమని సంబరపడ్డారు. ఇప్పుడు ఆమె దూకుడు చూసి వారికి మైండ్‌ బ్లాక్‌ అవుతోంది. రాజశేఖర్‌రెడ్డి బాడీ లాంగ్వేజ్‌, హావభావాలు షర్మిలలో కనిిపిస్తాయి. జనాన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం, మాట్లాడడం అచ్చం ఆయన్ను తలపిస్తోంది. అందుకే తక్కువ వ్యవధిలోనే జిల్లావాసులకు ఆమె బాగా చేరువయ్యారు. పార్టలకతీతంగా అభిమానిస్తున్నారని వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అటు వైఎస్‌ అభిమానులు, ఇటు వివేకా అభిమానులు, జగన్‌ శిబిరాన్ని వ్యతిరేకించే వైసీపీ నేతలంతా ఆమెకే మద్దతివ్వడం జగన్‌ శిబిరాన్ని టెన్షన్‌ పెడుతోంది.

సెంటిమెంటు పండుతుందా..?

షర్మిల రాకముందు పోటీ టీడీపీ, వైసీపీ మధ్యే ఉంది. జమ్మలమడుగుకు చెందిన భూపేశ్‌రెడ్డి మొదటిసారి టీడీపీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈసారి ఆ పార్టీ పుంజుకుంది కూడా. అయితే అభ్యర్థి ఎంపిక బాగా ఆలస్యమైంది. దీంతో పాటు వివేకా హత్య ప్రధాన అస్త్రంగా మారింది. ‘అమ్మా.. ఆడబిడ్డలు పుట్టింటికి వస్తే చీరసారె ఇచ్చి పంపిస్తాం. మీ ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చి న్యాయం అడుగుతున్నారు. న్యాయం చేసేందుకు మీ అందరికీ సమయం వచ్చింది. అందరం కలిసి షర్మిలకు ఓట్లు వేద్దాం. మీ అందరి ఓట్లతో షర్మిల కొంగు నింపండి’ అంటూ సౌభాగ్యమ్మ అర్థించడం.. పార్టీలకతీతంగా అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ సెంటిమెంటు బాగానే పనిచేస్తోందని.. పోటీ అవినాశ్‌, షర్మిల మధ్యే ఉన్నట్లు ప్రస్ఫుటంగా కనిపిస్తోందని అంటున్నారు. షర్మిల దూకుడు ప్రభావాన్ని తగ్గించేందుకు జగన్‌ కూడా జిల్లాలో నాలుగు బహిరంగ సభలు పెట్టారు.

పులివెందులలో చెరొక ఓటు!!

జగన్‌పైన, వైసీపీపైన షర్మిల ఎఫెక్ట్‌ మామూలుగా ఉండేటట్లు లేదు. కడప, పులివెందుల, మైదుకూరు, బదే ్వలు, జమ్మలమడుగులో ఆ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. పులివెందులలో క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కొంత మంది మహిళలను ప్రశ్నిస్తే ఒక ఓటు రాజశేఖర్‌రెడ్డి కొడుకు, మరో ఓటు ఆయన కూతురికని చెబుతుండడం జగన్‌ శిబిరానికి మింగుడుపడడం లేదు. జిల్లాలో ముస్లిం ఓట్లు కూడా గణనీయంగా ఉన్నాయి. వీరు షర్మిల వైపు మొగ్గుచూపుతారని ప్రచారం సాగుతోంది. ఏతావాతా తమ ఓట్లకే భారీగా గండి పడే పరిస్థితి నెలకొనడం వైసీపీని కలరవపాటుకు గురిచేస్తోంది.

నోటా నుంచి గెలిచేస్తారనే దాకా..

కడప పార్లమెంటు నుంచి షర్మిల పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే.. మొదట్లో ఆమె మూడో స్థానానికి పరిమితమవుతారని.. వైసీపీ ఓట్లు చీల్చేస్తారని.. టీడీపీ లాభపడుతుందని అందరూ భావించారు. స్వయంగా జగనే మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో కాంగ్రె్‌సకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన చోట నిలబడ్డారని ఆమెను ఎద్దేవా కూడా చేశారు. అయితే జిల్లాలో షర్మిల రెండో విడత ప్రచారం తర్వాత అంచనాలు తలకిందులయ్యాయి. పోస్టల్‌ బ్యాలెట్‌లో ఉద్యోగులు షర్మిలకే ఓట్లు వేశారని అంటున్నారు. మహిళలు, క్రిస్టియన్‌, ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఆమెపై సానుకూలత కనబడుతోంది. ప్రస్తుత ట్రెండ్‌ చూస్తుంటే షర్మిలే గెలిచే సూచనలు ఉన్నాయనే టాక్‌ జనాల్లోకి బలంగా వెళ్లింది.

Updated Date - May 11 , 2024 | 07:41 AM

Advertising
Advertising