MLA Pinnelli: సుప్రీంకోర్టులో పిన్నెల్లికి దక్కని ఊరట
ABN, Publish Date - Jun 03 , 2024 | 11:56 AM
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మాచర్ల నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.
ఢిల్లీ: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మంగళవారం మాచర్ల నియోజకవర్గానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. అందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. మాచర్ల నియోజకవర్గం వెళ్లేందుకు అంగీకరించలేదు. కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాలకు పిన్నెల్లి వెళ్లకూడదని స్పష్టం చేసింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ నెల 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తప్పు పట్టింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉపశపనం కలిగించి హైకోర్టు తప్పు చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
హత్యాయత్నం కేసులు
పాల్వాయి గేట్ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్ శేషగిరిరావుపై పిన్నెల్లి సోదరులు దాడి చేశారు. ఆ ఘటనలో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ పోలీస్ అధికారిపై దాడి చేయడంతో మరో హత్యాయత్నం కేసు ఫైల్ చేశారు. పాల్వాయి గేట్ గ్రామంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాలతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ఇంతలో పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించడంతో జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ పిన్నెల్లి ఇప్పటికీ బయటకు రాలేదు.
Updated Date - Jun 03 , 2024 | 02:16 PM