Chandrababu: అధికారంలోకి వస్తే పేదలకు ఆ పథకాలు అందిస్తాం.. బాబు వరాల జల్లు..
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:53 AM
అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే ప్రజలు తిరగబడతారని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
డ్రామా కంపెనీని మూసేసి జగన్ ఇంటికే: చంద్రబాబు
ఇష్టానుసారం పాలిస్తే జనం తిరగబడతారు
ఆయన మళ్లీ వస్తే ఆస్తులు దోచేస్తాడు
చిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి ప్రజలే చికిత్స చేయాలి
కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ 3 సెంట్లు.. ఇల్లూ కట్టిస్తాం
ఏప్రిల్ నుంచే రూ.4 వేల పెన్షన్.. ఫస్టునే ఇంటికొచ్చి ఇస్తాం
మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే
ఉద్యోగం వచ్చే వరకు 3 వేల నిరుద్యోగ భృతి
టీడీపీ అధినేత హామీలు
రాయచోటి, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా పరిపాలన చేస్తే ప్రజలు తిరగబడతారని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) స్పష్టం చేశారు. రాయలసీమలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జగన్‌రెడ్డి(YS Jagan) ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు. ఎన్నికల్లో వైసీపీని(YCP) చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపిచ్చారు. అప్పుడు జగన్‌రెడ్డి డ్రామా కంపెనీ వైసీపీని మూసేసి ఇంటికి వెళ్లడం ఖాయమన్నారు. ప్రజాగళంలో భాగంగా గురువారం అన్నమయ్య జిల్లా రాజంపేట, రైల్వేకోడూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన, జనసేనాని పవన్ కల్యాణ్, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగించారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచి జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరి ఆస్తులను దోచేస్తాడని చంద్రబాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. టీడీపీ హయాంలో మద్యం క్వార్టర్ బాటిల్ ధర రూ.60 ఉండేదని.. అది ఇప్పుడు రూ.200 అయిందని.. పెరిగిన రూ.140 మంత్రి పాపాల పెద్దిరెడ్డి ద్వారా తాడేపల్లె ప్యాలె్‌సకు చేరుతున్నాయని ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో నిత్యవసర వస్తువుల ధరలు, కరెంట్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెరిగాయన్నారు. గాడితప్పిన రాష్ట్రాన్ని బాగుచేయాలనే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయని చెప్పారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. పొత్తులవల్ల లాభనష్టాలు బేరీజు చేసుకోకుండా రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలన్నారు. కూటమి పొత్తు కు అదే నాంది’ అని చెప్పారు. ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు గానీ, కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు గానీ ముస్లింలకు అన్యాయం జరిగిందా అని ప్రశ్నించారు. వారిలో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధిపొందాలని వైసీపీ చూస్తోందన్నారు. ఇంకా ఏమన్నారంటే..
విధ్వంసకారుడిని ఇంటికి పంపే బాధ్యత మీదే..
ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడిని ఇంటికి పంపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. జగన్ ఐదేళ్లు పరదాలు కట్టుకుని తిరిగాడు. నేను గానీ, కిరణ్‌కుమార్‌రెడ్డి గానీ సీఎంలుగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకున్నామా? ప్రజల జీవితాల్లో వెలుగు రావాలన్నా.. మార్పు రావాలన్నా. సైకో జగన్‌రెడ్డిని తరిమికొట్టాలి. గత ఐదేళ్లలో జగన్‌రెడ్డి కట్టించింది ఊర్లు కాదని గూళ్లు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన పేదలందరికీ మూడు సెంట్ల స్థలమిచ్చి ఇల్లు కట్టిస్తాం. నెలకు రూ.4 వేల పెన్షన్ ఏప్రి ల్ నుంచి అమలు చేసి ప్రతి నెలా మొదటి తారీఖునే ఇంటి వద్దకు వచ్చి ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. సూపర్ సిక్స్‌తో ముందుకు వస్తున్నాం. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికీ ఇస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం.
ఇలాంటివి జరిగే చాన్సు
ఒంటిమిట్టకు చెందిన చేనేత కార్మికుడు పాల సుబ్చారావు పొలాన్ని వైసీపీ నాయకులు అక్రమించుకుని వారి పేరు మీద ఆన్‌లైన్ చేయించుకున్నారు. తహశీల్దార్ దగ్గరికి వెళ్లినా న్యాయం జరగకపోవడంతో సుబ్బారావు తన భార్య, కూతురితోపాటు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న మరో కుమార్తె లక్ష్మీప్రసన్న ప్రాణాలతో మిగిలిపోయింది. ఆవులపల్లె రిజర్వాయర్ పనులు చేయకుండానే.. రూ.600 కోట్లు పెద్దిరెడ్డి దోచేశాడు.. ఎన్జీటీ రూ.100 కోట్లు జరిమానా విధిస్తే.. ప్రజల సొమ్మును జరిమానాగా చెల్లించారు. హంద్రీ-నీవా పనులు కూడా పూర్తి చేయలేదు. గాలేరు-నగిరికి నీళ్లు ఇవ్వలేని సిగ్గులేని ప్రభుత్వమిది. హంద్రీ-నీవాపై గండికోట నుంచి మరో ప్రాజెక్టును మంజూరు చేయించుకుని.. రూ.1,500 కోట్ల బిల్లులు తెచ్చుకున్నారు. ఇవన్నీ బయటకు తెచ్చినందుకు.. అంగళ్లులో నాపై దాడికి యత్నించి.. నాతో సహా 600 మందిపై కేసులు పెట్టారు. పాపాల పెద్దిరెడ్డీ.. నీ పనై పోయింది.
ఫ 2019 ఎన్నికల్లో బాబాయి వివేకానందరెడ్డిని గొడ్డలిపోటుతో చంపించి జగన్ రాజకీయం చేశాడు. అప్పుడు కోడికత్తి డ్రామా ఆడాడు. ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నాడు. గులకరాయి గాయం రోజు రోజుకూ పెద్దదవుతోంది. వైసీపీని ఓడించి ఆ గాయానికి ప్రజలే చికిత్స చేయాలి.
- చంద్రబాబు
పిఠాపురంలో నన్ను ఓడించడానికి వందల కోట్లు ఖర్చు చేస్తున్న మిథున్‌రెడ్డి ముందు రాజంపేటలో గెలవాలి. పెద్దిరెడ్డి కుటుంబ అరాచకాలకు రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు అంతం పలకాలి.
- పవన్ కల్యాణ్
ఎర్రచందనం స్మగ్లర్లకు టికెట్లా?
పెద్దిరెడ్డి జైలుకు పోవడం ఖాయం: పవన్
రాష్ట్రంలో ఏ మూలకి వెళ్లిన ఈ సారి ఎన్నికల్లో మార్పు తఽథ్యంగా కనిపిస్తోందని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలు వైసీపీని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ‘అన్ని ప్రాంతాల యువత మార్పు కోరుకుంటున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లకు వైసీపీ సీటు ఇవ్వడం నీచాతినీచం. మంగంపేట గనులను అమాంతం మింగిన పెద్దిరెడ్డి జైలుకు పోక తప్పదు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది. ఇది మారాలంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూట మి ప్రభుత్వం రావాలి. మేమొచ్చాక పోలీసులకు టీఏ, డీఏలు ఇచ్చి వారాంతపు సెలవులు అమలు చేస్తాం. ఉద్యోగుల సీపీఎస్ రద్దుపై కమిటీ వేసి న్యా యం చేస్తాం. రాష్ట్రంలో గత ఐదేళ్లలో 33 వేల మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ కోసం ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జగన్ బటన్ నొక్కినా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పడలేదు. మేం రాగానే ఇస్తాం’ అని తెలిపారు.
ఇసుక దాహానికి అన్నమయ్య ప్రాజెక్టు బలి..
జగన్ సర్కారు రాజంపేటకు తీవ్ర అన్యాయం చేసిందని పవన్ అన్నారు. ‘ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఇసుక దాహానికే అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయి 30 మంది చనిపోయి అనేక గ్రామాలు మునిగిపోయాయి. లష్కర్ రామయ్య వల్లే ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలతో బ యటపడ్డాడు. ఆ రామయ్యను గుర్తించి నేను రూ.2 ల క్షలు ఇచ్చా’ అన్నారు. మిథున్‌రెడ్డి అధికారంలో ఉం డి అధికారమదంతో కొట్టడాలు, చంపడాలు చేయడం వల్లే అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.
ఇంత దరిద్రపు సీఎంను ఎన్నడూ చూడలేదు: కిరణ్
4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎందరో ముఖ్యమంత్రులను చూశానని.. జగన్‌రెడ్డి అంత దర్రిదపు ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదని మాజీ సీఎం, రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు.
For More Andhra Pradesh and Telugu News
Updated Date - Apr 26 , 2024 | 06:45 AM