Alert: ఓటరూ.. ఈ ‘గుర్తింపు’ చాలు
ABN, Publish Date - May 13 , 2024 | 05:18 AM
ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే కంగారుపడాల్సిన పనేం లేదు. ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉంటే చాలు...
ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే కంగారుపడాల్సిన పనేం లేదు. ప్రత్యామ్నాయంగా 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉంటే చాలు... ధీమాగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ప్రవాస ఆంధ్రులు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు తప్పనిసరిగా తమ ఒరిజినల్ పాస్‌పోర్టును చూపించాల్సి ఉంటుంది. ఈసీ ఆమోదించిన 12 రకాల గుర్తింపు కార్డులు... 1)ఆధార్ కార్డు, 2) ఉపాధి జాబ్ కార్డు, 3) ఫొటోతో ఉన్న బ్యాంక్ పాస్‌బుక్, 4) పోస్టాఫీసు పాస్‌బుక్, 5) కార్మిక శాఖ మంజూరు చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు, 6) డ్రైవింగ్ లైసెన్స్, 7) పాన్ కార్డ్, 8) ఎన్‌పీఆర్ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్ కార్డు, 9) ఇండియన్ పాస్‌పోర్ట్, 10) ఫొటోతో కూడిన పెన్షన్ డాక్యుమెంట్, 11) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డులు, ప్రభుత్వం, పీఎ్‌సయూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చే సిన కార్డులు, 12) ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చూపించే అధికారిక గుర్తింపు కార్డులు, ప్రత్యేక వైకల్యం ఐడీ కార్డు(యూడీఐడీ) కార్డు... పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్క గుర్తింపు కార్డు ఉన్న ఓటరైనా తమ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు. ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చూసుకోండి. ఉంటే మీ ఓటరు ఐడీ కార్డు తీసుకొని వెళ్లండి. అదిలేకపోతే... పైన పేర్కొన్న 12 రకాల కార్డుల్లో ఏది ఉన్నా మీరు నిరభ్యంతరంగా మీ ఓటు హక్కును ఉపయోగించుకోవచ్చు.
మీ ఓటు వేరేవాళ్లు వేస్తే...
ఓటు వేయాలన్న పట్టుదలతో పోలింగ్ బూత్‌కు వెళ్లిన మీకు చావు కబురు చల్లగా చెప్పినట్లు... ‘మీ ఓటు వేసేశారు’ అని చెపితే... డీలా పడకండి. మీ గుర్తింపును చూపించి టెండరు ఓటు వేస్తానంటూ డిమాండ్ చేయండి. ప్రిసైడింగ్ అధికారి మీ చేతికి ప్రత్యేకంగా టెండర్డ్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. మీరు ఓటు వేసిన తరువాత దానిని జాగ్రత్తగా సీల్ చేస్తారు. అలా ఓటు వేసిన వేసిన వ్యక్తి వివరాలను ఫాం 15 లేదా 17బీలో నమోదు చేస్తారు. టెండర్ ఓటు ఓటరు హక్కు. పోటీ హోరాహోరీగా జరిగి, ప్రత్యర్థుల మధ్య స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంటే మీ టెండరు ఓటే నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ప్రత్యర్థుల మధ్య మెజారిటీ వ్యత్యాసం భారీగా ఉంటే మాత్రం టెండర్ ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉండదు.
- అమరావతి, ఆంధ్రజ్యోతి
Updated Date - May 13 , 2024 | 06:27 AM