AP FiberNet : వర్మకు నోటీస్
ABN, Publish Date - Dec 22 , 2024 | 06:15 AM
మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు కూటమి ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఎన్నికలకు ముందు జగన్‌కు, వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన తీసిన ‘వ్యూహం’...
‘వ్యూహం’ వెబ్‌సిరీస్‌కు చెల్లింపులవ్యవహారంలో ఫైబర్‌నెట్ జారీ
వచ్చిన వ్యూస్ 2,228.. కానీ 2 లక్షలంటూతప్పుడు ఇన్‌వాయిస్‌లు
2.09 కోట్లు ఇవ్వాలని వర్మ అండ్ కో వినతి
రూ.1.14 కోట్లు ఇచ్చిన గత పాలకులు
దాన్ని 18 శాతం అపరాధ రుసుముతో 15 రోజుల్లో వడ్డీతో చెల్లించాలి
వర్మకు, చిత్ర బృందానికి ఎండీ తాఖీదు
అమరావతి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు, సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు కూటమి ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. ఎన్నికలకు ముందు జగన్‌కు, వైసీపీకి ప్రయోజనం చేకూర్చేలా ఆయన తీసిన ‘వ్యూహం’ వెబ్‌సిరీ్‌సకు నిబంధనలు, ఒప్పందానికి విరుద్ధంగా రూ.1,14,96,610 చెల్లించడాన్ని ఏపీ రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్(ఏపీఎ్‌సఎ్‌ఫఎల్) తీవ్రంగా పరిగణించింది. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టం జరిగిందంటూ ఎండీ దినేశ్‌కుమార్ దర్శకుడు వర్మకు, చిత్ర నిర్వాహకులకు శనివారం లీగల్ నోటీసులు జారీచేశారు. సదరు మొత్తాన్ని 12 శాతం వడ్డీతో, 18శాతం అపరాధ రుసుముతో.. నోటీసు అందుకున్న 15రోజుల్లో చెల్లించాలని ఆదేశించారు. గతంలో ఫైబర్‌నెట్ ఏజీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన వుయ్యూరు గుణశంశాక్ రెడ్డి, మాజీ ఎండీ మద్దిరాల మధుసూదన్‌రెడ్డి, మెస్సర్స్ ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ భాగస్వామి రవిశంకర్ వర్మ గొట్టుముక్కల, ఆర్జీవీ ఆర్వీ గ్రూప్ మేనేజింగ్ పార్ట్‌నర్ రాంగోపాల్‌వర్మ పెనుమత్స, మెస్సర్స్ ఆర్జీవీ ఆర్వీ గ్రూప్‌కు లీగల్ నోటీసులు పంపారు. ‘వ్యూహం’ తొలిభాగానికి 1,845 వ్యూస్, రెండో భాగానికి 383 వ్యూస్ వచ్చాయని.. అయితే 2,09,000 వ్యూస్ వచ్చాయంటూ రూ.2,09 కోట్లకు వర్మ అండ్ కో తప్పుడు ఇన్వాయిస్ సమర్పించారని తెలిపారు. దీనిద్వారా సంస్థకు ఆర్థికంగా భారీ నష్టాన్ని చేకూర్చారని తెలిపారు.
ఒప్పంద పత్రంలో ఎవరి పేర్లూ లేవు
సహజంగా అవగాహనా ఒప్పందాలు చేసుకున్నప్పుడు.. ఎవరితో ఎవరు ఒప్పందం చేసుకుంటున్నారో.. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలేమిటో స్పష్టంగా ఉంటాయి. ఇవేవీ గత ఫైబర్‌నెట్ యాజమాన్యం పాటించలేదని దినేశ్‌కుమార్ నోటీసులో పేర్కొన్నారు. వ్యూహం చిత్ర బృందంతో మార్చి 5న ఏపీఎ్‌సఎ్‌ఫఎల్ చేసుకున్న ఒప్పందంలో.. అస్సైనీల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు.
అస్సైనీల ప్రతినిధుల పేర్లూ రాయలేదు. ఆర్జీవీ మేకర్స్‌కు చెందిన రబ్బర్ స్టాంప్ లేదా సీల్‌పై నిర్మాతల పేర్లూ లేవు. అస్సైనర్ ప్రతినిధుల పేర్లు కూడా ఒప్పందంలో కనిపించలేదు. ఏజీఎంగా శశాంక్‌రెడ్డి సంతకం ఉన్నప్పటికీ.. ఆ సంతకం కింద ఆయన పేరు రాయలేదు. ఇలాంటి ఒప్పందం చెల్లదు. పైగా సదరు ఒప్పందం చేసుకునేందుకు.. ముందస్తుగా ఫైబర్‌నెట్ వేసిన కమిటీ సిఫారసు కూడా లేదు. సాంకేతిక కమిటీ ఆమోదమూ లేదు. అప్పటి ఎండీ మధుసూదన్‌రెడ్డి నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. సాంకేతిక కమిటీ సిఫారసులు లేకుండానే ఒప్పందం చేసుకున్నారు. 25 సినిమాలను ప్రసారం చేసేందుకు వర్మతో ఫైబర్‌నెట్ అవగాహన కుదుర్చుకుంది. ప్రతి సినిమాకు వచ్చే ‘వ్యూస్’తో సమకూరే ఆదాయాన్ని చెరిసగం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ‘వ్యూహం’ వెబ్‌సిరీస్ రెండు భాగాలకు కలిపి 2,228 వ్యూస్ రాగా.. 2 లక్షల వ్యూస్ వచ్చినట్లు చూపించారు. ఇందుకు చెల్లించే మొత్తంలో 75 శాతం ఆర్జీవీకి ఇచ్చారని నోటీసులో పేర్కొన్నారు. ఇన్వాయి్‌సలను పరిశీలిస్తే.. మార్చి 11న 70,000 వ్యూస్‌కు గాను రూ.70,00,000, మార్చి 14న 49,000 వ్యూస్‌కు రూ.49,00,000, మార్చి 18న 90,000 వ్యూస్‌కు రూ.90,00,000.. మొత్తం పన్నులతో కలిపి రూ.2,09,00,000 చెల్లించారు. వ్యూహం తొలి భాగానికి 1,845 వ్యూస్‌తో రూ.1,86,225, రెండో భాగానికి 383 వ్యూస్‌తో రూ.50,046 (మొత్తం రూ.2,36,271) మాత్రమే ఆదాయం వచ్చింది. అయితే గత యాజమాన్యం వర్మకు ఏకంగా రూ.1,14,96,610 చెల్లించడాన్ని ప్రస్తుత యాజమాన్యం తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై విచారణ జరపాలని ఫైబర్‌నెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను చైర్మన్ జీవీ రెడ్డి ఆదేశించారు. దీని ఆధారంగా సంబంధిత సిబ్బందిపై క్రిమినల్ చర్యలు చేపడతామని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Updated Date - Dec 22 , 2024 | 06:15 AM