Ap Govt : కాకినాడ సీపోర్టులో చెక్‌పోస్టు ఏర్పాటు!
ABN, Publish Date - Dec 10 , 2024 | 03:51 AM
విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు కాకినాడ సీపోర్టులో త్వరలో కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోకుండా చర్యలు
ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు
ప్రస్తుతం ప్రభుత్వ యాంకరేజ్ పోర్టు వద్ద రెండు చెక్‌పోస్టులు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
విదేశాలకు రేషన్ బియ్యం ఎగుమతి చేయకుండా అడ్డుకునేందుకు కాకినాడ సీపోర్టులో త్వరలో కొత్తగా చెక్‌పోస్టు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోర్టు లోపల నౌకలు ఆగే బెర్త్‌కు అతి సమీపంలో ఏర్పాటు చేసే అంశంపై అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోర్టు, బియ్యం ఎగుమతిదారులు, షిప్పింగ్ ఏజెంట్లతో దీనిపై చర్చిస్తున్నారు. ప్రైవేటు రంగానికి చెందిన సీపోర్టుకు నౌకలు నేరుగా ఒడ్డున ఉండే బెర్త్ వద్దకే వస్తాయి. ఇక్కడ బియ్యం ఎగుమతులు జరుగుతున్నా కనీసం తనిఖీలు లేవు. ఇదే అదనుగా రేషన్ అక్రమార్కులు వేల టన్నుల బియ్యాన్ని గుట్టుగా విదేశాలకు తరలిస్తున్నారు. ప్రభుత్వ యాంకరేజ్‌పోర్టు నుంచి వేలకోట్ల విలువైన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై పోర్టుకు వెళ్లే దారిలో రెండుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తోంది. రేయింబవళ్లు పోర్టు లోపలకు వెళ్లే లారీల్లో బియ్యం శాంపిళ్లను తనిఖీ చేస్తోంది. కానీ ఈ తరహా చెక్‌పోస్టులు సీపోర్టులో లేవు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా ఏర్పాటు చేసేందుకు అడుగులు పడుతున్నాయి. వాస్తవానికి బియ్యం ఎగుమతులన్నీ ప్రభుత్వానికి చెందిన యాంకరేజ్ పోర్టు నుంచే ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయి. ఈ పోర్టుకు డ్రెడ్జింగ్ సదుపాయం లేకపోవడంతో నౌకలు ఒడ్డుకు వచ్చే సౌలభ్యం లేదు. దీంతో సముద్రం లోపలే నౌకలు ఆగుతాయి. బార్జీల్లో బియ్యం బస్తాలు లోడ్ చేసి ఓ బోటుతో ఈ బార్జీలను తరలించి అక్కడ షిప్‌లోకి ఎక్కిస్తారు. ఇలా ఒక్కో నౌకలో బియ్యం లోడింగ్ మొత్తం పూర్తి కావాలంటే 26 రోజుల వరకు పడుతుంది.
అప్పట్లో ద్వారంపూడి కోసం
వైసీపీ అధికారంలోకి వచ్చాక ద్వారంపూడి తన సోదరుడు, అనుచరులు విదేశాలకు బియ్యం ఎగుమతులు అనుకున్నంత వేగంగా చేయలేకపోతున్నారని అప్పటి సీఎం జగన్‌ను కలిశారు. ప్రభుత్వ యాంకరేజ్‌పోర్టు నుంచి కాకుండా పక్కనే ఉన్న ప్రైవేటు సీపోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు అవకాశం కల్పించాలని కోరారు. అప్పటి ప్రభుత్వం ద్వారంపూడి కోసం బియ్యం ఎగుమతులు ప్రైవేటు పోర్టు నుంచి కూడా చేసుకోవచ్చని పేర్కొంటూ 2021 ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసింది. యాంకరేజ్‌పోర్టులో బియ్యం ఎగుమతి కోసం వచ్చే నౌకల సంఖ్య పది దాటితే, ఆపై అన్ని నౌకలను సీపోర్టుకు తరలించి బియ్యం ఎగుమతి చేసుకునేందుకు వెసులుబాటు ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి సీపోర్టు నుంచి బియ్యం ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ఈ అవకాశాన్ని ద్వారంపూడి వినియోగించుకుని వేలకోట్ల విలువైన బియ్యం ఎగుమతి చేశారు. సీపోర్టులో బియ్యం లోడింగ్ పూర్తికావడానికి 8 రోజులు మాత్రమే పడుతుంది. ప్రస్తుతం యాంకరేజ్‌పోర్టులో బియ్యం లోడింగ్ కోసం 14 షిప్‌లు నిరీక్షిస్తున్నాయి. వాటిలో నాలుగు నౌకలు ఇప్పుడు సీపోర్టుకు బియ్యం లోడింగ్‌కు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బియ్యం ఎగుమతి ప్రారంభానికి ముందే చెక్‌పోస్టు ఏర్పాటుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.
Updated Date - Dec 10 , 2024 | 03:51 AM