Ambati Rayudu: అందుకే వైసీపీని వీడాను.. క్లారిటీ ఇచ్చిన అంబటి రాయుడు
ABN , Publish Date - Jan 07 , 2024 | 06:59 PM
ఇటీవలే వైసీపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. కొద్ది రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి పొలిటికల్ ప్రకంపనలు సృష్టించారు. అయితే, తాజాగా అంబటి రాయుడు మరో సంచలన ప్రకటన చేశారు.
అమరావతి, జనవరి 07: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. ఇటీవలే వైసీపీలో చేరిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.. కొద్ది రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి పొలిటికల్ ప్రకంపనలు సృష్టించారు. అయితే, తాజాగా అంబటి రాయుడు మరో సంచలన ప్రకటన చేశారు. అసలు వైసీపీని ఎందుకు వీడాడో క్లారిటీ ఇచ్చాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా అందుకు గల కారణాన్ని పేర్కొన్నాడు అంబటి రాయుడు.
వృత్తిపరమైన కారణాలవల్లే వైసీపీని వీడినట్లు ప్రకటించారు అంబటి రాయుడు. జనవరి 20 నుండి దుబాయ్‌లో జరగబోయే ILt20లో ముంబై ఇండియన్స్‌కు అంబటి రాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడట. అయితే, వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నప్పుడు తనకు రాజకీయాలతో సంబంధాలు ఉండకూడదని, అందుకే వైసీపీని వీడినట్లు అంబటి రాయుడు ప్రకటించారు.
అయితే, వాస్తవానికి అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత.. రాజకీయాలపై ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. ముఖ్యంగా జగన్‌కు సపోర్ట్‌గా ప్రకటనలు చేస్తూ వచ్చారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు అంబటి రాయుడు. దాంతో ఆయన త్వరలోనే వైసీపీలో చేరబోతున్నారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ఆయనకు గుంటూరు ఎంపీ సీటు కన్ఫామ్ అనే ప్రచారం కూడా జరిగింది. అయితే, ఇటీవల తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్‌ను కలిసిన అంబటి రాయుడు.. ఆ క్షణమే పార్టీ కండువా కప్పుకుని వైసీపీలో చేరారు. ఏమైందో తెలియదు కానీ.. పట్టుమని పది రోజులు కూడా తిరక్కుండానే ఆయన వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.
రాజీనామాకు కారణం ఇదేనా?
అంబటి రాయుడు గుంటూరు జిల్లా వాసి. క్రికెట్ అనంతరం రాజకీయాలపై ఫోకస్ పెడుతూ వచ్చిన రాయుడు.. వైసీపీకి దగ్గరయ్యారు. అలా దగ్గరైనట్లే అయ్యి.. వెంటనే దూరమయ్యాడు. ఇప్పుడిదే సంచలనంగా మారింది. అయితే, అంబటి రాయుడు వైసీపీని వీడటానికి సీట్ల కేటాయింపే ప్రధాన కారణం అని ప్రచారం నడుస్తోంది. రాయడికి అసెంబ్లీకి వెళ్లాలని ఉందట. కానీ, వైసీపీ మాత్రం గుంటూరు ఎంపీ సీటు ఇస్తామని చెప్పిందట. దాంతో ఆయన ఆ పార్టీనీ వీడినట్లు ప్రచారం నడుస్తోంది. ఈ ప్రచారం కొనసాగుతుండగానే.. అంబటి రాయుడు అసలు కారణాన్ని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి.. అన్ని ప్రచారాలకు తెరదించాడు.