Share News

YSRCP: గుడ్‌బై చెబుతున్న నేతలు.. జగన్ దారెటు..

ABN , Publish Date - Sep 20 , 2024 | 11:05 AM

ఎన్నికల తర్వాత వైసీపీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జగన్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతోనే నేతలు జగన్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న క్రమంలో నాయకులు పార్టీని వీడటం..

YSRCP: గుడ్‌బై చెబుతున్న నేతలు.. జగన్ దారెటు..
YS Jagan

నాలుగు నెలల ముందు వరకు సీఎంగా ఉన్న వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఒంటరి వాడయ్యారా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు తనకు తిరుగులేదంటూ గర్వంగా చెప్పుకున్న జగన్ ప్రస్తుతం పార్టీని వీడి వెళ్లొద్దంటూ నాయకులను బతిమిలాడుతున్నారట. సింహం సింగిల్‌గా వస్తోందంటూ ఎన్నికల ముందు వరకు డైలాగ్స్‌ కొట్టిన జగన్ ప్రస్తుతం పార్టీ పరిస్థితిని చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారన్న చర్చ జరుగుతోంది. జగన్ నమ్ముకున్న నేతలే పార్టీని వీడుతుండటంతో ఏం చేయాలో అర్థం కావడంలేదట. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ భవిష్యత్తు ఏమిటనే ఆందోళనలో జగన్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనేది జగన్‌కు కత్తి మీద సాములా మారిందట. ఎన్నికల తర్వాత వైసీపీని వీడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా జగన్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతోనే నేతలు జగన్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న క్రమంలో నాయకులు పార్టీని వీడటం వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. కీలక నాయకులు పార్టీని వీడితే క్షేత్ర స్థాయిలో కేడర్ సైతం అదే బాటలో పయనించే అవకాశం ఉంటుందని.. అదే జరిగితే వైసీపీ రాష్ట్రంలో మరింత బలహీనడుతుందనే చర్చ జరుగుతోంది. జగన్‌కు సమీప బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి సైతం పార్టీని వీడటంతో మరికొందరు నాయకులు వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారట.

AP News : జగన్‌ బేజారు!


నేతల షాక్

వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డికి పార్టీ సీనియర్ నేతలు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ తీరును కొందరు నాయకులు బహిరంగంగానే తప్పుపట్టగా.. ప్రస్తుతం కొందరు సీనియర్లు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, మోపిదేవి వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, మద్దాలి గిరిధర్ వంటి నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి రాజీనామాతో వైసీపీలో ఓ రకమైన ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. మరికొందరు మాజీ మంత్రులు వచ్చే వారం రోజుల్లో రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. పార్టీ మారకుండా నాయకులను బుజ్జగించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు నాయకులను అసలు పట్టించుకోని జగన్‌కు ఇప్పుడు తాము కావాల్సి వచ్చిందా అంటూ కొందరు నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పి.. జనసేన లేదా టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన నాయకులు మాత్రం జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

Minister Lokesh: చిత్తూరు జిల్లాలో మంత్రి లోకేశ్ పర్యటన.. వివరాలు ఇవే..


జగన్ దారెటు

సీనియర్ నేతలు వరుసగా పార్టీని వీడుతున్న తరుణంలో జగన్ దారెటు అనే చర్చ జరుగుతోంది. ఏదైనా జాతీయ పార్టీతో వైసీపీ పొత్తు పెట్టుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం టీడీపీ, జనసేన ఎన్డీయే కూటమిలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలు ఎన్డీయేలో ఉండగా వైసీపీ బీజేపీతో జతకట్టే అవకాశం లేదు. వైసీపీతో స్నేహం కోసం టీడీపీ, జనసేనను దూరం చేసుకునే అవకాశం లేదు. ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. తెలుగుదేశం పార్టీ మద్దతు కేంద్రానికి చాలా కీలకం కానుంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును దూరం చేసుకునేందుకు బీజేపీ సహసించదు. ఇక మిగిలి ఉన్న ఆప్షన్ ఇండియా కూటమిలో చేరడం. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమిలో జగన్ చేరతారా అనే విషయంలో స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీతో విబేధించి జగన్ బయటకు వచ్చారు. ప్రస్తుతం వైఎస్ జగన్ సోదరి షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. జగన్, షర్మిల మధ్య విబేధాలు ఉన్నట్లు గత మూడేళ్లుగా పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. ఈ క్రమంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఆయన దారెటు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.


Tirumala laddu: తిరుమల లడ్డూ వ్యవహారం... జగన్‌పై కేంద్రహోంశాఖకు ఫిర్యాదు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News Click Here

Updated Date - Sep 20 , 2024 | 11:05 AM