AP Govt: భారీ వర్షాలపై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. కీలక ఆదేశాలు
ABN, Publish Date - Jun 28 , 2024 | 10:11 PM
వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
విజయవాడ: వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anita) కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. భారీ వర్షాలపై హోంమంత్రి అనిత ఈరోజు(శుక్రవారం) ఏపీ ఎమర్జెన్సీ అలర్ట్ సెంటర్‌ను స్వయంగా పరిశీలించారు. అధికారుల విధులను మంత్రి అనితకు వివరించారు. సమీక్ష సమావేశం నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, డీఆర్వోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులపై ఆరా తీశారు.
ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉండాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఐఎండీ అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైయ్యే అవకాశం ఉందని చెప్పారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గోదావరి, కృష్ణా నదీ పరివాహక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడూ వరద ప్రవాహాన్ని పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జూన్ నెలలో ఇప్పటివరకు 12 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 9 జిల్లాల్లో అధికం, 5 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయంలోపు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధిలో అత్యధికంగా 184 మి.మీ అతిభారీ వర్షపాతం నమోదైందని తెలిపారు. తరచూ వరదలు సంభవించే నదీపరివాహక ప్రాంతాల్లో చెరువులు, వాగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, సంభవించే వరదలపై కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Jun 28 , 2024 | 10:11 PM