AP Budget: రైతులకు శుభవార్త.. ఆ రోజు మీ బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి..
ABN, Publish Date - Nov 11 , 2024 | 01:39 PM
అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తానని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను ఆయన నెరవేర్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ఎన్డీయే ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. బడ్జెట్‍లో "అన్నదాత సుఖీభవ" పథకానికి చంద్రబాబు సర్కార్ రూ.4,500 కోట్లు కేటాయించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.20వేలు జమ చేయనుంది. 2025 సంక్రాంతి నుంచి దీన్ని అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు నిధులు కేటాయిస్తూ అన్నదాతల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తోంది.
అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తానని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను ఆయన నెరవేర్చారు. ఇటీవల దీపావళి నుంచి మహాలక్ష్మి పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను సైతం ఆయన మహిళలకు అందిస్తున్నారు. అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని వైసీపీ హయాంలో "వైఎస్ఆర్ రైతు భరోసా"గా అమలు చేశారు. ప్రస్తుతం దాని పేరు మారుస్తూ కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు తోడు చంద్రబాబు సర్కార్ ఏకంగా రూ.14 వేలు కలిపి రైతుల చేతికి రూ.20 వేలు అందించనుంది. అలాగే ఈ సంక్రాంతి నుంచి పథకాన్ని అమలు చేయనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
మరోవైపు బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. పలు కీలక రంగాలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు కేటాయించారు. అలాగే వ్యవసాయ బడ్జెట్‌ను సైతం అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రూ.43,402 కోట్లతో సభలో ఆయన బడ్జెట్ ప్రతిపాదించారు. అలాగే రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకంపై మంత్రి అచ్చెన్న స్పష్టత ఇచ్చారు.
Updated Date - Nov 11 , 2024 | 01:51 PM