Hyderabad: సంక్రాంతికి గుడ్ న్యూస్ చెప్పిన ఎపీఎస్‌ఆర్టీసీ.. అక్కడ్నుంచి ఏకంగా..
ABN , Publish Date - Dec 28 , 2024 | 01:24 PM
సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్లే ప్రజలు ప్రయాణం కోసం నానావస్థలు పడతారు. అయితే బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సంక్రాంతి పండగ ఎంత ఘనంగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సంక్రాంతి (Sankranti) వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా వలస వెళ్లిన ప్రజలు మెుత్తం సొంతూళ్లకు వచ్చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad) నుంచి ఏపీకి వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. ఆ పండగ రోజు హైదరాబాద్ మెుత్తం ఖాళీ అవుతుందంటే అతిశయోక్తి కాదు. పంటలు చేతికి రావడంతో రైతులు ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు. కోడి పందెలు, గుండాటలతో మామిడి తోటలు కిక్కిరిసిపోతాయి. అలాగే కోడికూర, గారెలు వంటి పిండి వంటలు చేసుకుని సంతోషంగా గడుపుతారు.
ప్రత్యేక బస్సులు..
సంక్రాంతి వేళ సాధారణంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రయాణికులు నానావస్థలు పడతారు. అయితే బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంక్రాంతి పండగకు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ప్రత్యేక బస్సు సేవలు జనవరి 9 నుంచి జనవరి 13 వరకూ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్లతో సహా వివిధ ప్రాంతాలకు వెళ్లే సాధారణ, ప్రత్యేక బస్సులు ఎంజీబీఎస్ (MGBS) ఎదురుగా ఉన్న గౌలిపురలోని పాత సెంట్రల్ బస్ స్టేషన్ (CBS) నుంచి బయలుదేరుతాయని వెల్లడించింది.
అదనపు ఛార్జీలు లేవు..
ప్రతి ఏటా సంక్రాంతి వేళ నడితే ప్రత్యేక బస్సులకు సాధారణంగా అదనపు ఛార్జీలు వసూలు చేస్తుంటారు. ఒక్కోసారి రెట్టింపు ఛార్జీలు సైతం వసూలు చేసిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. అయితే ఈసారి ఈ విషయంలోనూ ప్రయాణికులకు ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది. పండగ వేళ ప్రజలకు ఖర్చులు అధికంగా ఉండడంతో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
టీజీఎస్‌ఆర్టీసీ ఇలా..
మరోవైపు సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 3 వేల ప్రత్యేక బస్సులు నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాల మార్గాల్లో ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సౌకర్యం ఎప్పటిలాగే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వరకు మాత్రమే ఉంటుందని సమాచారం. జనవరి, 2025 మెుదటి వారం నుంచే ప్రయాణికులకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది.