Balineni : వైసీపీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదు: బాలినేని
ABN, Publish Date - Sep 19 , 2024 | 06:03 PM
జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉదయభాను ప్రకటించారు.
అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌రెడ్డికి విశ్వసనీయత లేదని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సంచలన విమర్శలు చేశారు. వైసీపీలో త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ను గెలిపించాలని ఆనాడు రాజీనామాలు చేశామని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను జగన్‌రెడ్డి మరిచిపోయారని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు.
పవన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధం..
సభల్లో జగన్ ఎప్పుడూ తన గురించి మాట్లాడలేదని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వాపోయారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడారని ప్రశంసించారు. తనపై పవన్ ఎంతో అభిమానంతో ఉన్నారని కొనియాడారు. పవన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. తనతోపాటు కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కలిసి జనసేనలో చేరుతారని బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.
ALSO Read:YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో ముఖ్య నేత జంప్.!
జగన్ మనస్తత్వం అందరూ తెలుసుకోవాలి
‘‘పవన్ కళ్యాణ్‌తో భేటీ తర్వాత జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నాను. ఒంగోలులో సభ ఏర్పాటు చేసి అక్కడ జనసేన కండువా కప్పుకుంటాను. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నాతో జనసేనలోకి వస్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో పనిచేశాను. నా మీద నమ్మకంతో నాకు వైఎస్ రాజకీయ భిక్ష పెట్టారు. ఆరోజు జగన్‌తో కలిసి నడిచాం. నేను, 17మంది నేతలు కాంగ్రెస్‌కు రాజీనామా చేశాం. జగన్ ఎదగాలని మేము అప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచి ప్రతిపక్షంలో ఉన్నాం. మా డబ్బులతో గెలిచి జగన్ వెంట నడిచాం. జీవితాంతం నా గుండెల్లో ఉంటారని జగన్ చెప్పారు. ఈ 17 మందిని వదలకుండా అండగా ఉంటాం అన్నారు. విశ్వసనీయత అని పదే పదే చెప్పే నువ్వు ఈ 17 మందిలో ఒక్కరినైనా మంత్రిని చేశావా. జగన్ మనస్తత్వం అందరూ తెలుసుకోవాలి. వైఎస్ మీద అభిమానంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వైసీపీలో కొనసాగాను’’ అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
నాకు పదవులు ముఖ్యం కాదు..
‘‘ఎన్నికల సమయంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జనసేనలోకి రాలేదు. నాకు పదవులు ముఖ్యం కాదు.. గౌరవం ముఖ్యం. పవన్ కళ్యాణ్‌కు ఇదే విషయాన్ని చెప్పి పార్టీ లోకి వస్తున్నా. నా చేరిక మీద సోషల్ మీడియాలో ఏవో ట్రోల్స్ చేస్తున్నారు. కూటమి పక్షాన అందరం కలిసి పని చేస్తాం. పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం నా పని తీరు ఉంటుంది. మూడు పార్టీల నేతలను కలుపుకుని వెళ్తాం. అడిగిన వెంటనే ఆహ్వానించినందుకు పవన్‌కు ధన్యవాదాలు. ఒంగోలులో ఎప్పుడు చేరేది త్వరలో తేదీ ఖరారు చేస్తాం’’ అని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
ఈనెల 22న జనసేనలోకి వైసీపీ కీలక నేతలు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో వైఎస్సార్సీపీ కీలక నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను జనసేన కార్యాలయంలో భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై చర్చించారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉదయభాను ప్రకటించారు. వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALSO Read:Kadambari Jethwani: హోంమంత్రి అనితను కలవనున్న నటి కాదంబరి జెత్వానీ.. ఎందుకంటే?
వైసీపీలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది: సామినేని ఉదయభాను
వైసీపీలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను విమర్శించారు. తన మనసుకి కష్టం కలిగింది కాబట్టి పార్టీ వీడానని ప్రకటించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఎంతో సన్నిహితంగా పని చేశానని గుర్తుచేశారు. వైఎస్ కుమారుడితో అదే కమ్మిట్‌మెంట్‌తో పనిచేశానని తెలిపారు. ఎన్నికలకు ముందు చాలాసార్లు జగన్‌ను కలిసి పార్టీ పరిస్థితి గురించి చెప్పినా పట్టించుకోలేదని సామినేని ఉదయభాను ధ్వజమెత్తారు.
ALSO Read:Nagababu: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా
వైసీపీలో పరిణామాలు చూస్తే ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేనట్లేనని అన్నారు. తమ భవిష్యత్తు తాము చూసుకోవాలనే భయటకు వచ్చామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి అన్ని విషయాలు చర్చించినట్లు చెప్పారు. ఈనెల 22వ తేదీన జనసేనలో చేరుతున్నామని ప్రకటించారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జనసేనలో చేరుతున్నారని చెప్పారు. కూటమి పార్టీల నాయకులతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నానని సామినేని ఉదయభాను వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
kadambari Jethwani: మరోసారి సంచలన విషయాలు బయటపెట్టిన నటి కాదంబరి జెత్వాని
Purandeshwari: జమిలి ఎన్నికలపై మంచి ఆశతో ఉన్నాం..
Dola Anjaneyulu: పుట్టలో నుంచి పాములు వస్తున్నట్లుగా జగన్ పాపాలు బయటకు....
Read LatestAP NewsAndTelugu News
Updated Date - Sep 19 , 2024 | 06:30 PM