AP News: దళితులను అణగదొక్కేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు: దేవానంద్
ABN, Publish Date - Sep 21 , 2024 | 06:37 PM
దళితులను అణగదొక్కే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మండిపడ్డారు. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తీసేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు తెలియచేస్తుందని చెప్పారు.
విజయవాడ : అమెరికా జార్జ్ విశ్వావిద్యాలయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ అన్నారు. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తీసేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు తెలియచేస్తుందని దేవానంద్ చెప్పారు.
కుట్ర రాజకీయాలకు అంతం పలకాలని ఎస్సీ మోర్చా నుంచి నిరసనలు తెలియజేస్తామని అన్నారు. గత కాంగ్రెస్ పాలనలో లక్షలాది మంది దళితులు రోడ్డు పైన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పని చేస్తున్నారని ప్రశంసించారు. విదేశీ గడ్డపై భారతీయ దళితులను అణగదొక్కే విధంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని.. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని దేవానంద్ అన్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: ఎంపీ మునిస్వామి
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎస్సీ మోర్చా నిరసనలు చేపడుతుందని బీజేపీ ఎంపీ మునిస్వామి తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తీసేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడారని చెప్పారు. 1956లో ఓబీసీకి వ్యతిరేకంగా జవహర్ లాల్ నెహ్రూ కూడా మాట్లాడారని గుర్తుచేశారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ రిజర్వేషన్ల విషయంలో స్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై బుద్ది హీనులని వ్యాఖ్యానించారని ఎంపీ మునిస్వామి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎస్సీల దగ్గరకి వచ్చి ఓట్లని అడుగుతారు కానీ రిజర్వేషన్ల విషయంలో మాత్రం వ్యతిరేకత చూపిస్తారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు దళితుల ఓట్లు కావాలి కానీ దళితుల అభివృద్ధిని మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు పట్టించుకోరా అని ఎంపీ మునిస్వామి ప్రశ్నించారు. వారు చైనా, పాకిస్థాన్‌తో రహస్యంగా మాట్లాడుతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉండే నేతలు అందరు జైలుకి వెళ్లి వచ్చినవారే ఉంటారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశంతో వ్యతిరేకంగా ఉండేవారితో చేతులు కలిపేవారని ఎంపీ మునిస్వామి విమర్శలు చేశారు.
ఇండియా మిత్ర కూటమిలో ఉన్న నేతలు కూడా తమకు మద్దతు తెలియజేస్తున్నారని అన్నారు. అలీబాబా 40 దొంగళ్లా లెక్క ఇండియా కూటమి ఉందని విమర్శించారు. మొదటి సారి మోదీ ప్రధానిగా ఎన్నికైనప్పుడు అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్లు ఆశయాలనే కొనసాగిస్తామని అన్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ మరణించినప్పుడు రాజ్ ఘాట్‌లో స్థలం ఎందుకు ఇవ్వలేదని ఎంపీ మునిస్వామి ప్రశ్నించారు.
కాంగ్రెస్ అగ్ర నాయకులు మరణించినప్పుడు రాజ్ ఘాట్‌లో ఎక్కువ స్థలం కేటాయించి సమాధులు నిర్మించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’తో దేశం అభివృద్ధి చెందుతోందని ఎంపీ మునిస్వామి తెలిపారు.
Updated Date - Sep 21 , 2024 | 07:15 PM