CM Chandrababu: మీ కష్టాలను పంచుకోడానికే వచ్చా.. వారినెప్పటికీ మరవను
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:13 PM
Andhrapradesh: ‘‘ఇంటింటికి వచ్చి పింఛన్ అందిస్తున్నాం. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తా. ఫోన్లో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుంది. డ్రోన్‌తో కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
పల్నాడు జిల్లా , డిసెంబర్ 31: ప్రజల స్థితిగతులు తెలుసుకుని న్యాయం చేయడానికే వచ్చా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. మంగళవారం నాడు పల్నాడు జిల్లా యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇళ్ళకు వెళ్లి లబ్దిదారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి... శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందజేశారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ మీ కష్టాల్లో భాగం పంచుకోవడానికే వచ్చా. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా పనులు చేయించాలనేదే నా తపన. గత ఐదేళ్లు బయటకు పోలేని పరిస్థితి.. కనీసం నవ్వలేకపోయారు. ఇంటింటికి వచ్చి పింఛన్ అందిస్తున్నాం. ఇంటి వద్ద ఇవ్వకుండా ఆఫీస్‌లో ఇస్తే వెంటనే మెమో పంపిస్తా. ఫోన్లో జీపీఎస్ ద్వారా సమాచారం వస్తుంది. డ్రోన్‌తో కూడా సహాయ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నాం. ఇప్పుడే శారమ్మ ఇంటికెళ్లా.. 2021లో ఆమె భర్త కరోనాతో చనిపోయారు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ జీవితాన్ని వెళ్లదీస్తోంది. ఐదు కోట్ల ప్రజల కోసమే నేను కష్టపడుతున్నా. నేను ఏం చేసినా అందరికీ న్యాయం జరగాలనేదే నా ఆలోచన, తపన. శారమ్మ కుమార్తెకు నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించా. ఒక లబ్దిదారుడి ఇంట్లో కాఫీ చేసి ఇచ్చా.. ఇది నాకు ఆనందాన్నిచ్చింది. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మరచిపోలేము’’ అని స్పష్టం చేశారు.
ప్రజలు ఏమైనా చేయగలరు...
90 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారన్నారు. పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలన్నారు. పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. పింఛన్లు ఒకరోజు ముందే 31 వ తేదీనే ఇస్తున్నామని.. ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం చేస్తారన్నారు. టీడీపీని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమైనా చేయగలరని చెప్పారు. 40 ఏళ్లలో ఎప్పుడూ చూడని విజయాన్ని చూశానన్నారు. ‘‘ నాకు హైకమాండ్ ఎవరూ లేరు. 5 కోట్ల మంది ప్రజలే నా హైకమాండ్. తెలుగువారంతా చేసుకునే పండుగ సంక్రాంతి. మళ్లీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే బాధ్యత నాది’’ అని సీఎం వెల్లడించారు.
అదే మా బాధ్యత..
ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని.. రాజకీయాలకు అతీతంగా మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలపాలన్నారు. పేదరికం లేని సమాజం ఎన్టీఆర్ కల అని అన్నార. ‘‘ సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి. కష్టాల్లో ఉన్న పేదలకు అండగా ఉండాలి. 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ. మంచి నాయకడుంటే అంతా మంచే జరుగుతుంది. రూ.4 వేల పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జూన్‌లో అధికారంలోకి వచ్చినా ఏప్రిల్ నుంచే పింఛన్లు ఇచ్చాం. పేదరికం లేని సమాజం నా జీవిత ఆశయం. పేదవాళ్ల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు పెట్టాం. 198 అన్న క్యాంటీన్లు పెట్టాం.. అవసరమైతే ఇంకా పెడతాం. పేదవాళ్లకు ఉచితంగా అన్నం పెట్టే బాధ్యత మాది. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంసం గత ఐదేళ్లలో చూశా. అన్ని వ్యవస్థలను దోపిడీ చేసి ధ్వంసం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ దారి మళ్లించేశారు. గతంలో సీఎం వస్తే పరదాలు కట్టేవారు. గుంతలు లేని రహదారులుగా మార్చే బాధ్యత మాది. మేము అధికారంలోకి రాగానే చెత్తపై పన్ను ఎత్తేశాం. మత్స్యకారుల ఉపాధి దెబ్బతీసే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. మద్యం దుకాణాల్లో కల్లు గీత కార్మికులకు 10 శాతం కేటాయించాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తివేశాం’’ అని అన్నారు.
డ్రోన్ల ద్వారా..
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ఖాతాల్లో డబ్బు వేస్తున్నాం. డ్రోన్స్ ద్వారా వ్యవసాయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. రాబోయే రోజుల్లో రైతులకు ఎలాంటి కష్టాల రాకుండా చూసుకుంటాం. తెగుళ్లు ఉందని అనుమానం రాగానే డ్రోన్స్ వస్తాయి. వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి.. ఆదాయం పెరగాలి. అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రైతులే. గాడి తప్పిన ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్నా. నదుల అనుసంధానంతో నీటి కొరత లేకుండా చేస్తాం. నేల తల్లికి జలహారతి ద్వారా శ్రీకారం చుడుతున్నాం. గోదావరి నుంచి 3 వేల టీఎంసీల నీల్లు సముద్రంలోకి పోతున్నాయి. ఈ ఏడాది కృష్ణాలో వచ్చిన వరదలు 800 టీఎంసీలు సముద్రంలోకి పోయాయి. 300 టీఎంసీలు మనం వాడుకోగలిగితే నీటి కొరత ఉండదు. కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. వైసీపీ పాలనలో కంపెనీలన్నీ రాష్ట్రం నుంచి పారిపోయాయి. ఇవాళ ఒక్కో కంపెనీ రాష్ట్రంలోకి మళ్లీ వస్తున్నాయి. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నాం’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో జనవరి ఫూల్స్ అవుతారు..
బాస్ నన్ను అనకూడని మాటలు అంటున్నాడు: యువ ఉద్యోగి
Read Latest AP News And Telugu News