Vangalapudi Anitha: 36 హత్యల వివరాలు జగన్ ఇవ్వగలరా?: హోంమంత్రి అనిత
ABN, Publish Date - Jul 21 , 2024 | 03:31 PM
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 36రాజకీయ హత్యలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా మండిపడ్డారు. నూతన ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్‌పై చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు. 36హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారు, వాటి వివరాలు ఆయన ఇవ్వగలరా? అంటూ ఆమె సవాల్ విసిరారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వం(NDA Govt) అధికారంలోకి వచ్చిన తర్వాత 36రాజకీయ హత్యలు జరిగాయని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) తీవ్రంగా మండిపడ్డారు. నూతన ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్‌పై చర్యలు తీసుకుంటామని అనిత హెచ్చరించారు. 36హత్యలు జరిగాయని జగన్ చెప్తున్నారు, వాటి వివరాలు ఆయన ఇవ్వగలరా? అంటూ ఆమె సవాల్ విసిరారు. రాజకీయ హత్యల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ ఇవ్వాలని, లేకుంటే ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
దమ్ముంటే అసెంబ్లీకి జగన్ రావాలి..
ఏపీ ప్రభుత్వాన్ని ఎవరైనా టార్గెట్ చేసి ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. మైకు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే చట్టం ఎందుకు ఊరుకోవాలని ఆమె ప్రశ్నించారు. రాజకీయ హత్యలు జరిగాయంటూ నోటికొచ్చిన నంబర్ చెప్పేస్తే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఢిల్లీలో జగన్ ధర్నా చేయబోతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఆయనకు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీలో శాంతి భద్రతలపై మేము ప్రవేశపెట్టే శ్వేతపత్రంపై జగన్ చర్చించగలరా?, తప్పుడు ప్రచారం చేయడం ఆయనకు అలవాటుగా మారిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ఇంకా తన మాట నమ్ముతారనే భమ్రలో ఆయన ఉన్నారని హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు.
ఇదీ మీ చరిత్ర..!
వైసీపీ హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేశ్ దాడి చేశారని, జై జగన్ అని అనలేదని చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్తను దారుణంగా పీక కోసి చంపేశారని ఆమె గుర్తు చేశారు. రోడ్డు మీద పరదాలు కట్టడానికి, చెట్లు నరకడానికి, టీడీపీ నేతలను వేధించడం కోసం మాత్రమే పోలీసులను జగన్ వాడుకున్నారు. నెల రోజుల కాలంలో మేం ఎక్కడన్నా వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశామా?. అడుగడుగునా అడ్డుకున్న వైసీపీది ఆటవిక పాలనా లేక యథేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతున్నా జగన్‌ను అడ్డుకోని మాదా ఆటవిక పాలన? అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సాయంత్రమే గ్యాంగ్ రేప్ జరిగింది. నేరాలు, హత్యలు, అత్యాచారాలపై సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారైనా స్పందించారా?. లా అండ్ ఆర్డర్, గంజాయిపై ఒక్కసారైనా సమీక్ష జరిపారా అంటూ అనిత ప్రశ్నల వర్షం కురిపించారు.
వివేకా హత్యపై మాట్లాడగలరా?
వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన జగన్ రాజకీయాలు మాట్లాడారే తప్ప కనీసం బాధిత కుటుంబానికి ఒక్క రూపాయి కూడా అందజేయలేదని హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన సంపాదించిన అక్రమ ఆస్తిలో నుంచి డబ్బులు ఇవ్వలేకపోయిన జగన్‌కు బాధిత కుటుంబంపై ప్రేమ ఉందంటే ఎవరు నమ్ముతారంటూ ఆమె ప్రశ్నించారు. సీఎంగా ఆయన పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అమరావతిలో ఉన్న పాపానికి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణానికి గత ప్రభుత్వం డబ్బులు కూడా ఇవ్వలేదు. ఢిల్లీలో జగన్ కూర్చొని వివేకా హత్య గురించి చెప్పగలరా?. చంద్రబాబుపై రాళ్లు వేసి భావ ప్రకటన స్వేచ్ఛ అని కామెంట్లు చేసిన వైసీపీ నేతలా మమ్మల్ని విమర్శిస్తోందని ఆమె దుయ్యబట్టారు. గతంలో ఏం జరిగిందో గుర్తు చేసుకో పులివెందుల ఎమ్మెల్యే అంటూ ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఐదేళ్లపాటు రాజారెడ్డి రాజ్యాంగం!
ఏపీలో గత ఐదేళ్లలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని హోంమంత్రి ధ్వజమెత్తారు. వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, విజయసాయి రెడ్డి అంశాన్ని పక్కకు పెట్టేందుకే రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయంటూ జగన్ హడివిడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం మీద కావాలనే నిందలు వేస్తున్నారు. రాజకీయ హత్యలు కేవలం 4మాత్రమే జరిగాయని, బాధితుల్లో ముగ్గురు టీడీపీ నాయకులే ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. అధికారం కోల్పోయిన నెల రోజుల్లోనే జగన్‌కు అధికార కాంక్ష పట్టుకుంది. చంపుకోవడం తప్పు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సీఎం కుర్చీలో కూర్చోవడం కోసం బాబాయి హత్య, కోడికత్తి డ్రామా నడిపారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తే జగన్‌పై కూడా కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. జగన్ అకృత్యాలపై మేము కూడా ఢిల్లీలో మాట్లాడతాం. వినుకొండ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై కేసు నమోదు చేస్తామని హోం మంత్రి అనిత హెచ్చరించారు.
Updated Date - Jul 21 , 2024 | 03:56 PM