AP GOVT: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ధాన్యం కొనుగోలుపై కీలక ప్రకటన
ABN, Publish Date - Sep 24 , 2024 | 05:17 PM
ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ఈ-పంట, ఈ కేవైసీ ద్వారా రైతులు, కౌలు రైతు వివరాలను ధాన్యం కొనుగోళ్లకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి: ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వికేంద్రీకరణ విధానంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రైతుసేవా కేంద్రాలు, ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని ఈ -పంట, ఈ కేవైసీ ద్వారా రైతులు, కౌలు రైతుల వివరాలను ధాన్యం కొనుగోళ్లకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ అనుసంధానంతో ఈ - పంట, ఈ -కేవైసీ ద్వారా రైతుల ఖాతాల్లోకి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ALSO READ: CM Chandrababu: నామినేటెడ్ పదవుల భర్తీ.. ఎంతమందికి అంటే
ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, ఏపీ మార్క్‌ఫెడ్ సంస్థలు రాష్ట్రస్థాయి ధాన్యం కొనుగోళ్లకు నోడల్ సంస్థలుగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ధాన్యం కొనుగోలు లావాదేవీల్లో ఉన్న రైస్ మిల్లర్లు కూడా ప్యాడీ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో నమోదు కావాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్ధతు ధర కామన్ వెరైటీ క్వింటాలుకు రూ.2300 , గ్రేడ్ ఏ రకానికి రూ.2320 క్వింటాలుకు చెల్లించాలని తెలిపింది. 2024-25 ఖరీఫ్ సీజన్‌కు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు స్పష్టం చేసింది. సేకరణతో సహా, మిల్లింగ్ ఆపరేషన్లపై పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లు, జేసీలను ఆదేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాం: మంత్రి కొలుసు పార్ధసారధి
కృష్ణా: ఆగిరిపల్లిలో '‘పొలం పిలుస్తోంది'’ కార్యక్రమాన్ని సమాచారశాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ఇవాళ(మంగళవారం) ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో నష్టపోయిన రైతులతో మాట్లాడారు. నీట మునిగిన పంట పొలాలు, తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్ధసారధి మీడియాతో మాట్లాడుతూ... వ్యవసాయం, యువతకు ఉపాధిపై సీఎం చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రతీ రైతు సంతోషంతో వ్యవసాయం చేయడమేకాక, యువతను వ్యవసాయం వైపు మరల్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. వరినాటు యంత్రాలు, పంటకోత మిషన్లు, డ్రోన్ల ద్వారా ఎరువులు పురుగుమందులు చల్లడం వంటివి సాగులో ఆధునిక టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నాయని తెలిపారు. డ్రోన్లలో కృత్తిమ మేథస్సును పెంచేందుకు అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు. డ్రోన్ల కొనుగోలుపై రైతులకు ప్రభుత్వం 50 శాతం వరకు సబ్సిడీని అందిస్తోందని మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Konakalla Narayana Rao: సీఎం సముచిత స్థానం కల్పించారు
Ganta: అప్పన్న ఆలయంలో సంప్రోక్షణ.. పాల్గొన్న గంటా
Read Latest AP News and Telugu News
Updated Date - Sep 24 , 2024 | 05:38 PM