AP News: రోడ్ల మరమ్మతులపై మంత్రి జనార్దన్ రెడ్డి కీలక ఆదేశాలు
ABN, Publish Date - Sep 02 , 2024 | 10:35 PM
ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో ఏపీలోని రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రహదారుల మరమ్మతుల కోసం ఆర్ అండ్ బీ శాఖతో మంత్రి జనార్ధన్ రెడ్డి ఈరోజు(సోమవారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు కుండపోతగా పడుతుండటంతో ఏపీలోని రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో రహదారుల మరమ్మతుల కోసం ఆర్ అండ్ బీ శాఖతో మంత్రి జనార్దన్ రెడ్డి ఈరోజు(సోమవారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. .వరద ప్రభావిత జిల్లాల ఎస్.ఈ, ఈఈ లతో వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి. మాట్లాడారు. ఈ సందర్భంగా మరమ్మతులపై అధికారులకు మంత్రి జనార్దన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
వరద పరిస్థితులు, రోడ్లు, భవనాల స్థితిగతులపై ఆరా తీశారు. ఇప్పటికే 2వేల కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వంతెనల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని మంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
వరద పరిస్థితులు సద్దుమణిగే వరకు ఆర్ అండ్ బీ శాఖలో సెలవులు రద్దు చేసినట్లు మంత్రి ప్రకటించారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని మంత్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే వర్మ కూరగాయల పంపిణీ
కాకినాడ జిల్లా: పిఠాపురం నుంచి వరద బాధితులకు 4 టన్నుల కూరగాయలను విజయవాడకు మాజీ ఎమ్మెల్యే వర్మ పంపించారు. గతంలో తుఫానులు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడారని తెలిపారు. విజయవాడ వరద ముంపు నుంచి త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు.
ద్వారకాతిరుమల ఆలయం నుంచి విజయవాడకు ఆహార పొట్లాలు
ఏలూరు: ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయం నుంచి విజయవాడ వరద బాధితులకు ఐదువేల ఆహార పొట్లాలు తయారీ చేసి పంపించారు. వాహనాలను జండా ఊపి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు విజయవాడకు పంపింంచారు. ప్రకృతి విపత్తు కారణంగా వరదలు సంభవించాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రి, పగలు తేడా లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారని చెప్పారు. ప్రకృతి విలయ తాండవానికి ప్రజలు ఆహారం కొరతతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఆపదలో ఉన్న సాటి మనిషికి సాయం చేయాలనే ఆలోచనతో దేవస్థానం తరఫున బాధితులకు ఆహార పొట్లాలు తయారీ చేయించి పంపుతున్నామని వివరించారు. మరో 10 వేల ఆహార పొట్లాలు తయారు చేసి బాధితులకు అందజేస్తామని మద్దిపాటి వెంకటరాజు వెల్లడించారు.
Updated Date - Sep 02 , 2024 | 10:50 PM