Share News

Partha Saradhi: నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన డీఎస్

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:41 PM

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి (Minister Kolusu Partha Saradhi) సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Partha Saradhi:  నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన డీఎస్
Minister Kolusu Partha Saradhi

అమరావతి: మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి డాక్టర్ కొలుసు పార్థసారథి (Minister Kolusu Partha Saradhi) సంతాపం వ్యక్తం చేశారు. డీఎస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి, ఎంపీ, పీసీసీ చీఫ్‌గా ఎన్నో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఈరోజు (శనివారం) తన కార్యాలయంలో మంత్రి పార్ధసారధి మీడియాతో మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజా సేవకు అంకితమైన నాయకుడు డి. శ్రీనివాస్ అని చెప్పారు.


తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన డి.శ్రీనివాస్‌తో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. డీఎస్ ఎప్పుడూ హుందాగా వ్యవహరించే వారని, తాను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేవారని తెలిపారు. అందరితో సమన్వయంతో పని చేస్తూనే.. పనిచేసే నాయకులకు ప్రాధాన్యం ఇచ్చేవారని చెప్పారు. యువతను ఎక్కువగా ప్రోత్సహించారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్, ఉన్నత విద్య, అర్బన్, ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా విశేష సేవలు అందించారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో క్రియాశీలకంగా వ్యవహరించి తనదైన ముద్ర వేశారని, ఆయన మృతి రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు.

Updated Date - Jun 29 , 2024 | 04:32 PM