Nara Lokesh: ఐటీ పాలసీపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు
ABN, Publish Date - Nov 21 , 2024 | 12:45 PM
ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. టైర్ 2,3 సిటీస్‌లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉందని తెలిపారు. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్‌ను కల్పించేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు.
అమరావతి: ఒకే రాష్ట్రం ఓకే రాజధాని అన్న నినాదం కూటమి ప్రభుత్వానిదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆదే సమయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నాన్ని ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని గతంలోనే హామీ ఇచ్చామని తెలిపారు. దాని కోసమే డాటా సెంటర్ పాలసీని కూడా రూపకల్పన చేశామని చెప్పారు. ఈరోజు(గురువారం) అసెంబ్లీలో ఐటీ పాలసీపై చర్చ జరిగింది. ఈ సభలో మంత్రి నారా లోకేష్ పలు కీలక విషయాలు వెల్లడించారు.జగన్ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలకు సంబంధించిన ఒక్క కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదని చెప్పారు. వైసీపీ హయాంలోని ఐటీ మంత్రి గుడ్డూ-కోడి అంటూ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో ఏపీ ఐటీ మంత్రి ఇలా ఉంటారా అంటూ కూడా గతంలో కొందరు మాట్లాడారని గుర్తుచేశారు. గడచిన ఐదు నెలల్లో చాలా ఐటీ సంస్థలతో సమావేశాలు నిర్వహించామని తెలిపారు.
విశాఖలో టీసీఎస్ క్యాంపస్..
‘‘మూడు నెలల్లో టీసీఎస్ సంస్థ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నాం. డేటా సెంటర్లు హైదరాబాద్, ముంబై, చెన్నైలో మాత్రమే ఉన్నాయి. డేటా సెంటర్లపై 300 బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారు. టీడీపీ తెచ్చిన డేటా సెంటర్ పాలసీ ప్రకారం అవి వస్తే విశాఖ ప్రపంచ డేటా సెంటర్ అయి ఉండేది. ఐటీ కంపెనీలు రావాలంటే సామాజిక మౌలిక సదుపాయాలు కూడా ఉండాలి. అందుకే భోగాపురం లాంటి అంతర్జాతీయ విమానాశ్రయం వేగంగా నిర్మిస్తున్నాం.అలాగే వేలాది హోటళ్లు కూడా ఏర్పాటు కావాల్సి ఉంటుంది. అందుకే టూరిజం పాలసీ కూడా రూపొందించాం, పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. విశాఖపట్నంకు గ్రేడే ఆఫీసు స్పేస్ , నివాస స్థలాలు కూడా ఉండాలి. అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీలతోనూ చర్చిస్తున్నాం.పెండింగ్ ఇన్సెంటివ్‌లు చెల్లించేందుకు బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాం. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం ఐటీ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తాం.స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి పెట్టాలని టీసీఎస్ చంద్రశేఖరన్ చెప్పారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్లపై రిలయన్స్‌కు అభినందనలు తెలియచేస్తే వారు ఏపీలో 700 యూనిట్లు పెడతామని హామీ ఇచ్చారు’’ అని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
త్వరలోనే ఐటీ పాలసీ..
‘‘ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న ఐటీ కంపెనీలను కూడా ఏపీకి ఆహ్వానించటంలో శాసనసభ్యులు కూడా సహకరించాలి. కంపెనీలు ఏపీకి తేవటంలోనా ఒక్కడి వల్లే సాధ్యం కాదు అందరూ సహకరించాలి. ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించటమే మా ప్రభుత్వ లక్ష్యం. టైర్ 2,3 సిటీస్‌లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉంది. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్‌ను కల్పించేలా కార్యాచరణ చేపట్టాం. త్వరలోనే ఐటీ పాలసీ కూడా తీసుకువస్తున్నాం. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. అదానీతో పాటు కొన్ని కంపెనీలు విశాఖపట్నంకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. డేటా సెంటర్లకు సంబంధించిన ఓ జాతీయ స్థాయి ఫ్రేమ్ వర్క్ రూపకల్పన జరుగుతోంది. వచ్చే మూడు నెలల్లో విశాఖలోని ఐటీ హిల్స్‌పై డేటా సెంటర్లు వస్తాయి. నిక్సీ సంస్థతో మాట్లాడుతున్నాం, సింగపూర్ నుంచి సీ ల్యాండింగ్ ఇంటర్నెట్ కేబుల్ తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం’’ అని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
Updated Date - Nov 21 , 2024 | 12:49 PM