Minister Sathya Kumar: అమిత్ షాతో సత్యకుమార్ భేటీ.. ఏం చర్చించారంటే..?
ABN, Publish Date - Oct 21 , 2024 | 09:51 PM
ఆరోగ్య శాఖపై మంత్రి సత్యకుమార్‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ అమలు తీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని విధానంపై సమగ్ర వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం జరుగుతున్న విధానాన్ని అమిత్ షాకు వివరించారు.
ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుమారు 20 నిముషాల పాటు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇవాళ( సోమవారం) ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మూడు నెలల పాలన, మంత్రిగా చేపట్టిన కార్యక్రమాల గురించి అమిత్ షాకు సత్య కుమార్ వివరించారు. రాష్ట్రాన్నిమాజీ సీఎం జగన్ రూ. 11 లక్షల కోట్ల అప్పుల్లో ముంచి పోయారని, ఏడాదికి సుమారు రూ. 75 వేల కోట్లు వడ్డీలు కట్టాల్సి వస్తున్నట్లు హోంమంత్రికి చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టించి దుర్వినియోగం చేశారని, యుసీలు ఇవ్వలేదని సత్యకుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత... అన్ని శాఖల్లో వినియోగించిన నిధులు, యుసీలు ఇప్పుడు కేంద్రానికి పంపుతున్నట్లు సత్యకుమార్ చెప్పారు. జగన్ ప్రభుత్వం చేసిన పాపాలను కూటమి ప్రభుత్వం సరిచేయాల్సిన పరిస్థితి ఉందని అమిత్ షాకు సత్యకుమార్ చెప్పారు. కేంద్ర ప్రాయోజిత పథకాల వినియోగంపై కూడా సత్యకుమార్ వివరించారు.
ఆరోగ్య శాఖపై సత్యకుమార్‌ని పలు వివరాలు అడిగి అమిత్ షా తెలుసుకున్నారు. ఆయుష్మాన్ భారత్ అమలు తీరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పని విధానంపై సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం జరుగుతున్న విధానాన్ని అమిత్ షాకు వివరించారు. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, పోలవరం నిర్మాణానికి కేంద్రం పూర్తి సహకారంపై సీఎం చంద్రబాబు అవకాశం వచ్చినప్పుడు ప్రజలకే నేరుగా చెబుతున్నారని సత్యకుమార్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉన్న పరిస్థితుల్లో కేంద్రం ఆక్సిజన్ అందిస్తోందని సీఎం చెబుతున్నారని అమిత్ షా దృష్టికి సత్యకుమార్ తీసుకెళ్లారు. కేంద్ర సహకారంతోనే రాష్ట్రం నిలబడుతోందని సీఎం చంద్రబాబు వివరిస్తున్నారని అమిత్ షాకు సత్యకుమార్ చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణంపై కూడా ఇరువురి మధ్య కీలకంగా చర్చించారు. బీజేపీ పనితీరు, రాష్ట్రంలో బలోపేతం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురి మధ్య సమగ్రంగా చర్చ జరిగింది.
మంత్రి సత్యకుమార్‌కు వైసీపీ నేతల బెదిరింపులు
గుంటూరు జిల్లా: వైసీపీ నేతలు బోరుగడ్డ అనిల్, నందిగాం సురేష్‌పై బీజేపీ నేతలు ఎస్పీకి ఈరోజు ఫిర్యాదు చేశారు. గతంలో అమరావతి రైతుల ఉద్యమానికి వెళ్లి వస్తున్న సత్య కుమార్‌పై దాడికి ప్రయత్నించారని బీజేపీ జాతీయ యువమోర్చా మాజీ కార్యదర్శి సురేష్ అన్నారు. మంత్రి సత్య కుమార్‌కు ఫోన్ చేసి చంపుతానని బోరుగడ్డ అనిల్ బెదిరించారని అన్నారు. బోరుగడ్డ అనిల్, నందిగం సురేష్ అనుచరులు సత్య కుమార్‌పై అసభ్యకరమైన పదజాలంలో ధూషణలు చేశారని చెప్పారు, దళిత నాయకుడిగా ఉన్న తనపైనే దాడులకు దిగడం అమానుషమని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ఫిర్యాదు చేసిన తుళ్ళూరు పోలీసులు స్వీకరించలేదని అన్నారు. ఇప్పటికైనా పోలీసుల చర్యలు తీసుకోకపోతే డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సత్య కుమార్‌పై హత్యాయత్నం చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సురేష్ విజ్ఞప్తి చేశారు,
Updated Date - Oct 21 , 2024 | 09:54 PM