సీఎం చంద్రబాబు మందలింపుపై మంత్రి వాసంశెట్టి రియాక్షన్..
ABN, Publish Date - Nov 05 , 2024 | 05:57 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మందలించడంపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ స్పందించారు. చంద్రబాబు తనను తండ్రిలా మందలించారే తప్ప అందులో అపార్థం చేసుకోవాల్సిన విషయం లేదని మంత్రి అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మందలించడంపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ స్పందించారు. చంద్రబాబు తనను తండ్రిలా మందలించారే తప్ప అందులో అపార్థం చేసుకోవాల్సిన విషయం లేదని మంత్రి అన్నారు. రాష్ట్రంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్‌ను గెలిపించాలని టీడీపీ అధినేత ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. అందులో భాగంగా ఎక్కువ మంది పట్టభద్రుల ఓటర్లను నమోదు చేయాల్సిన బాధ్యత తమపై పెట్టారని తెలిపారు. ఓటర్ల నమోదులో వెనకబడిన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నేతలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారని, ఆ సమయంలోనే తనను మందలించినట్లు వాసంశెట్టి చెప్పుకొచ్చారు. దీన్ని తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదని మంత్రి సుభాశ్ అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాశ్ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి చంద్రబాబు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తారు. నేను కనీసం ఓ వార్డు మెంబర్ కూడా కాదు. అలాంటిది నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి బీసీ సామాజిక వర్గం గర్వపడేలా మంత్రి పదవి ఇచ్చారు. పనిలో అలసత్వం వహించడం నా తప్పే. అందుకే చంద్రబాబు నన్ను తండ్రిలా మందలించారు. ఆయన మాటలతో తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. మీ అందరికీ చంద్రబాబు మాటలు వేరేలా అర్థమై ఉండొచ్చు.
కానీ పార్టీలో ఉన్న మేము అధినేత మాటలను తప్పుగా తీసుకోం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని తిట్టినా, కొట్టినా కేవలం అది వారి శ్రేయస్సు కోసమే. అలాగే పార్టీ అధినేత ఏం చెప్పినా మా మంచి కోసమే చెబుతారు. నిన్న ఆయన మాట్లాడిన మాటలతో నేను రాజకీయంగా నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని గ్రహించాను. ఇకపై నా పనిలో ఎలాంటి అలసత్వం ఉండదు. అయితే ఈ విషయాన్ని చాలా మంది పెద్దఎత్తున ట్రోల్ చేస్తున్నారు. మీ విర్శమలు, ట్రోల్స్ వల్ల నాకు ఎలాంటి నష్టం లేదు" అని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Atchannaidu: ఆ ముగ్గురూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు..
Former Minister Roja: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి రోజా..
Pawan Kalyan: పెట్రోల్ బాంబులు వేసి భయభ్రాంతులకు గురిచేశారు
Updated Date - Nov 05 , 2024 | 06:52 PM