Pawan Kalyan: షర్మిల భద్రతపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:41 PM
ఐ.ఏఫ్.యస్ అధికారులు ఎందరో వన్య ప్రాణుల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. అటవీ సంరక్షణ అనేది అందరి కర్తవ్యమని అన్నారు. అటవీ సంరక్షణ కోసం నేటి తరం, భవిష్యత్తు తరాలు కూడా బాధ్యత తీసుకోవాలని పవన్ కల్యాణ్ కోరారు.
గుంటూరు జిల్లా: అటవీ శాఖ అధికారులు ఎందరో స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని.. అనేక మంది తీవ్రమైన దెబ్బలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. గుంటూరులో పవన్ కల్యాణ్ పర్యటించారు. గుంటూరు అరణ్యభవన్‍లో అటవీ అమరవీరుల సంస్మరణ సభ ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. విధుల్లో ప్రాణాలు అర్పించిన అధికారులు, సిబ్బందికి పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.
అమరవీరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పవన్ కల్యాణ్ పలకరించారు. స్మగ్లర్‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23మంది ఐ.ఏఫ్.యస్ అధికారుల కుటుంబ సభ్యులకు సాయం అందించారు. వీరిలో అన్ని కేటగిరీల సిబ్బంది, అధికారులు ఉన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... అడవులను సంరక్షించడంలో ఐ.ఏఫ్.యస్ అధికారుల పాత్ర కీలకమని కొనియాడారు. వీరప్పన్ వంటి వారితో పోరాటం చేసిన ఐ.ఏఫ్.యస్ అధికారులు ఉన్నారని గుర్తుచేశారు. వన్య సంపద, వన్య ప్రాణులను కాపాడారని ప్రశంసించారు. ఈ స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించేలా తమ వంతుగా కృషి చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.
అటవీశాఖలో సంస్కరణలకు కృషి
‘‘రాష్ట్ర అటవీశాఖ తరపున ఆయా కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం. వారి త్యాగాలను స్మరిస్తూ కొంతమంది ఫారెస్ట్ అధికారుల విగ్రహాలు ఏర్పాటు చేస్తాం. భవిష్యత్తు తరాలకు ఒక ధైర్యం కలిగించేలా సంస్మరణ దినోత్సవం చేయాలి. చెట్లను నరుకుతుంటే ... అడ్డుకుని వారి తలలే బలి ఇచ్చిన చరిత్ర ఐ.ఏఫ్.యస్ అధికారులకు ఉంది. ఐ.ఏఫ్.యస్ అధికారులు ఎందరో వన్య ప్రాణుల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయారు. అటవీ సంరక్షణ అనేది అందరి కర్తవ్యం. నేటి తరం, భవిష్యత్తు తరాలు కూడా బాధ్యత తీసుకోవాలి. నేను ఈ శాఖ మంత్రిగా ఉన్నంతవరకు ఎంత మేలు చేయగలనో అంతవరకూ నా కృషి ఉంటుంది. 23మంది ఐ.ఏఫ్.యస్ అధికారులు బలి అయిన ఘటనకు జ్ఞాపకంగా ఒక స్మృతి వనం ఉండాలని అడిగారు. ఐ.ఏఫ్.యస్ అధికారి శ్రీనివాస్ విగ్రహం పెట్టాలని కోరారు. అటవీ శాఖలో ఎలాంటి సంస్కరణలు చేపట్టినా నేను మద్దతుగా ఉంటాను. వీటికి అవసరమైన నిధులు కూడా సీఎం చంద్రబాబుతో మాట్లాడి మంజూరు చేస్తాను’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
మాది మెతక ప్రభుత్వం కాదు..
‘‘మాది మంచి ప్రభుత్వమే కాని మెతక ప్రభుత్వం కాదు. ఐఏఎస్‌లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తాం. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అధికారుల మీద చిన్న గాటు పడిన చూస్తూ ఊరుకోం. 20 ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారు. గంజాయి మన్యంతో పాటు రెవెన్యూ భూముల్లో కూడా సాగుచేస్తున్నారు. గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. దండీ మార్చి తరహాలో రానున్న కాలంలో పెద్ద స్తూపాలు నిర్మించి అటవీ అమరవీరులకు నివాళులు అర్పిద్దాం. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అడవులను కాపాడేందుకు ఎలాంటి సహాయం కావాలన్నా మీకు అందిస్తాను. అటవీ అధికారులకు అడవులను రక్షించేందుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం’’ అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు.
పవన్ పర్యటనలో అపశృతి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. అటవీ శాఖ అమరుల సంస్మరణ సభకు ఇవాళ(ఆదివారం) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. పవన్ కల్యాణ్ కోసం రహదారిని పోలీసులు బ్లాక్ చేశారు. పవన్ కాన్వాయ్ పోలీసుల వాహనంతో కలెక్టర్ బంగ్లా రోడ్డు నిండిపోయింది. చిలకలూరిపేట నుంచి ఓ రోగినీ గుంటూరులోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలిస్తున్నారు. దారి లేక అంబులెన్స్ నిలిచిపోయింది. శ్వాస సంబంధిత ఇబ్బందితో రోగి బాధపడుతున్నట్లు బాధితులు చెప్పారు. శ్వాస అందక అంబులెన్స్ సిబ్బంది సీపీఎస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగానే అంబులెన్స్‌కు దారి ఇచ్చుంటే ప్రమాదం జరిగి ఉండదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది సమయం తర్వాత అంబులెన్స్‌కు పోలీసులు దారి ఇచ్చారు. పవన్ కల్యాణ్ పర్యటనకు అధికారుల ఏర్పాట్లపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి.
Updated Date - Nov 10 , 2024 | 01:36 PM