Pawan Kalyan: RGV ఎక్కడున్నా వదిలేది లేదు.. పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:12 PM
జగన్ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను ఎందుకు వాడకోలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాల ఫలాలను ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందని చెప్పారు. ఉప రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రిని ఈరోజు కలుస్తానని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఢిల్లీ: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పోలీసులు (AP Police) రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టుల కేసులో రామ్‌గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌లో హాజరుకావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వర్మను అరెస్టు చేసేందుకు వెతుకుతున్నారు. అయితే ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. పలువురు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా మీడియాతో పవన్ కల్యాణ్ మాట్లాడారు.
పోలీసుల సామర్థ్యంపై స్పందించను..
‘‘ఆర్జీవీతో పాటు పలువురు నోటీసులు ఇచ్చినా విచారణకు రాకపోవడంపై ఇప్పుడే స్పందించను. ఈ కేసు విషయంలో పోలీసులను పని చేసుకొనివ్వండి. నా పని నేను చేస్తాను...పోలీసుల సామర్థ్యంపై నేనేమీ స్పందించను. హోంశాఖ, లా అండ్ ఆర్డర్ నా పరిధిలో లేదు. మీరు అడగాల్సిందే ముఖ్యమంత్రిని. నేను ఏం మాట్లాడినా బాధ్యతగా మాట్లాడాలి. మీరు చెప్పిన అన్ని అంశాలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని పట్టుకోవడానికి ఎందుకు తటపటాయిస్తున్నారని ఢిల్లీ మీడియా నన్ను అడిగిందని సీఎం చంద్రబాబుకు చెబుతా’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
సమోసాల కోసం రూ .9 కోట్లు ఖర్చు..
అదానీ జగన్ ముడుపుల వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని అన్నారు.సమోసాల కోసమే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ .9 కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో అసలు బాధ్యత లేదు. పారదర్శక లేదు. జవాబుదారీతనం అసలే లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి శాపాలుగా మారాయని చెప్పారు. జల్ జీవన్ మిషన్ బడ్జెట్ పెంచాలని, కాలవ్యవధి కూడా పెంచాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ని కోరానని అన్నారు.
ఆ డిజైనింగ్ లోపాలు..
జగన్ ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను వాడకోలేదన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నిధులు వినియోగించలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాల ఫలాలను ఇప్పుడు అనుభవించాల్సి వస్తోందని చెప్పారు. ఉప రాష్ట్రపతి, ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రిని ఇవాళ(మంగళవారం) కలుస్తానని తెలిపారు. రేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుస్తానని అన్నారు. రాష్ట్రంలో పైప్ లైన్లు వేయడంలో డిజైనింగ్ లోపాలు చాలా ఉన్నాయని చెప్పారు. ఇళ్లల్లో మోటార్ పెట్టి నీరు లాగేస్తున్నారని.. ఎత్తు మీద ఉన్నవారికి నీరు అందడం లేదని అన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులు ఉన్నాయని... ఉపరితల జలవనరులు ఉన్నాయి. కానీ డిజైనింగ్ లోపాల కారణంగా నీరు అందరికీ అందడం లేదని చెప్పారు. నీటిని అందించే విషయంలో రూరల్ వాటర్ సప్లై శాఖ కూడా కొంత బాధ్యత వహించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
భారత రాజ్యాంగం ఆదర్శప్రాయం..
‘‘భారత రాజ్యాంగం ఆదర్శప్రాయం. భారతదేశం పలు మతాలు, సంప్రదాయాలు, ఆచారాల సమాహారం. ఇంతటి భిన్నమైన జనజీవనం మరే దేశంలోనూ కనిపించదు. ఇటువంటి విభిన్నత ఉన్నా... మేమంతా ఒక్కటే అనే భావనతో ఐక్యంగా ఉంచేదే మన రాజ్యాంగం. భారతీయులందరికీ పవిత్ర గ్రంథం. అటువంటి రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవం జరుపుకుంటున్న శుభతరుణంలో భారతీయులందరికీ నా భక్తి పూర్వక శుభాకాంక్షలు. ఈ వజ్రోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ‘హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్’ నినాదంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నాను. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లోని మన రాజ్యాంగానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
సమాన హక్కులు ..
‘‘దేశంలోని ప్రజలందరికీ సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించడం ద్వారా మన రాజ్యాంగం ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. భారత రాజ్యాంగానికి అంబేద్కర్ సారథ్యంలో ఉద్ధండులైన 389 మంది తమ మేథోశక్తిని అందజేశారు. రాజ్యాంగ రచన పూర్తి కావడానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజులు పట్టింది. 1949 నవంబరు 26కి రాజ్యాంగ రచన పూర్తయి ఆమోదం పొందింది. మన రాజ్యాంగంలో 395 అధికరణలు, 8 షెడ్యూళ్లను పొందుపరిచారు. 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆనాటి నుంచి నేటి వరకు దేశానికి దిక్సూచిగా విరాజిల్లుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని దేశంలోని ప్రతి ఒక్కరూ అలవరుచుకుని ఈ దేశ ప్రగతికి శాయశక్తులా కృషి చేయాలి’’ అని పవన్ కల్యాణ్ మనస్ఫూర్తిగా కోరుకున్నారు.
ఆ నిధులు విడుదల చేయాలి..
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. 25 లక్షల జనాభాకు 7వేల కిలో మీటర్ల రహదారుల నిర్మాణం చేయాల్సి ఉందని చెప్పారు. కేవలం 9 శాతం ఉన్న జనాభాకు మాత్రమే రోడ్ల నిర్మాణం జరిగిందని అన్నారు. దీనికి ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంకు నుంచి నిధులు ఇప్పించాలని కోరానని తెలిపారు. జగన్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాండ్స్ నిధులు చెల్లించలేదని మండిపడ్డారు. దీంతో పనులు చేసేందుకు నిర్ణిత సమయం ముగిసిందని తెలిపారు. పనులు నిర్వహిస్తున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు 90 శాతం నిధులు వచ్చేలా చూడాలని అన్నారు. ఒకవేళ నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం 20శాతం నిధులు మంజూరు చేయాలని కోరామని.. కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని పవన్ కల్యాణ్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP: ఇలాంటి వారిని అస్సలు వదలద్దు.. కఠినంగా శిక్షించండి..
AP News: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు..
Chevireddy : మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు
Read Latest AP News and Telugu News
Updated Date - Nov 26 , 2024 | 04:14 PM