Hyderabad: అక్కడే రామ్మూర్తి నాయుడి అంత్యక్రియలు.. పెద్దఎత్తున చేరుకోనున్న కూటమి శ్రేణులు..
ABN, Publish Date - Nov 16 , 2024 | 09:32 PM
తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణవార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు.
అమరావతి: తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు మరణవార్త తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకుని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్న ఆయన చికిత్సపొందుతూ మృతిచెందిన సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని చూసి కన్నీటిపర్యంతం అయ్యారు. విగతజీవిగా పడి ఉన్న తమ్ముడిని చూసి ముఖ్యమంత్రి కన్నీరు పెట్టుకోవడం కుటుంబసభ్యులను కలచివేసింది. తన పెద్దనాన్న చంద్రబాబును చూసి రామ్మూర్తి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ రోదించారు. దీంతో సీఎం అతడిని ఓదార్చారు. అలాగే కుటుంబసభ్యులు మెుత్తాన్ని ఆయన ఓదార్చి ధైర్యం చెప్పారు.
రామ్మూర్తి నాయుడు మరణంతో నారా, నందమూరి కుటుంబసభ్యులు పెద్దఎత్తున ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్నారు. బాబాయ్ మరణవార్త తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్.. తండ్రి చంద్రబాబు కంటే ముందుగానే ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అనారోగ్యంతో మృతిచెందిన వివరాలను వైద్యులను అడిగి ఆయన తెలుసుకున్నారు. చిన్నాన్న కుటుంబాన్ని లోకేశ్ ఓదార్చారు. చంద్రబాబు వచ్చిన తర్వాత హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తమ నివాసానికి కుటుంబసభ్యులంతా చేరుకున్నారు. ఇవాళ (శనివారం) రాత్రికి వారంతా అక్కడే బస చేయనున్నారు.
రామ్మూర్తి నాయుడి భౌతికకాయాన్ని నారావారిపల్లెకు తరలించాలని నారా కుటుంబ సభ్యులంతా నిర్ణయించారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని డిసైడ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం 6:30 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి నారావారిపల్లెకు ఆయన పార్థివదేహం ఎయిర్ లిఫ్ట్ కానుంది. మరోవైపు రేపు ఉదయం సీఎం చంద్రబాబు కుటుంబం ప్రత్యేక విమానంలో స్వగ్రామానికి చేరుకోనున్నారు. అనంతరం అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి నారా, నందమూరి కుటుంబ సభ్యులు సహా బంధువులంతా హాజరుకానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతలు విచ్చేయనున్నారు. అలాగే సినీ, పలు రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
AP News: నారా రామ్మూర్తి నాయుడు మృతికి సంతాపం తెలిపిన స్పీకర్, డిప్యూటీ సీఎం..
YS Sharmila: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ రాక ముందే ఆ పని చేయండి: వైఎస్ షర్మిల
Nara Rammurthy naidu: రామ్మూర్తి నాయుడు మృతిపై ప్రముఖుల సంతాపం
Updated Date - Nov 16 , 2024 | 10:03 PM