AP Cabinet: ఏపీ క్యాబినెట్.. ఏఏ పనులకు ఆమోదం పడే అవకాశం ఉందంటే..
ABN, Publish Date - Nov 20 , 2024 | 05:33 PM
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏపీలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి క్యాబినెట్ ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది.
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన పలు అంశాలతోపాటు మెుత్తం 22 అంశాల ఏజెండాగా ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. సమావేశంలో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు, మంత్రులు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రులు క్యాబినెట్‌లో తీర్మానం చేయనున్నారు. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. మొత్తం 10 కంపెనీలకు సంబంధించి రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదముద్ర వేయనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి గతంలో ఇచ్చిన పనుల టెండర్ల రద్దుపై క్యాబినెట్‌లో మంత్రులు చర్చించనున్నారు. ఆయా పనులకు కొత్తగా టెండర్లు పిలిచే అంశంపై మంత్రిమండలిలో చర్చ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ అనుమతులను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల నుంచి తొలగించేలా చట్ట సవరణపై మంత్రులు చర్చించనున్నారు. ఇక నుంచి భవన నిర్మాణ అనుమతులను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లే ఇచ్చేలా ఏపీ మెట్రో రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్ట సవరణకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఏపీ వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానానికి ఉన్న గడువు తగ్గించే అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. నాలుగేళ్లు ఉన్న గడువును రెండున్నరేళ్లకు కుదించేలా చట్ట సవరణకు క్యాబినెట్‌లో ఆమోదముద్ర పడే అవకాశం ఉంది.
విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులపైనా మంత్రిమండలి చర్చించనుంది. ఈ ప్రాజెక్టులను వందశాతం కేంద్రమే భరించేలా క్యాబినెట్‌లో తీర్మానం చేయాలనే ప్రతిపాదనలపైనా మంత్రులు చర్చించనున్నారు. విశాఖలో మూడు కారిడార్లు, విజయవాడలో రెండు కారిడార్లలో మెట్రో రైలు నిర్మాణానికి ప్రతిపాదనలపై మంత్రులు నిర్ణయం తీసుకోనున్నారు. తొలిదశలో రూ.11 వేల కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్నారు. టూరిజం పాలసీకి నేటి క్యాబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశమూ లేకపోలేదు. టూరిజం రంగానికి పరిశ్రమ హోదా కల్పించడంపై క్యాబినెట్‌లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. దేవాలయ పాలకమండళ్లలో మరో ఇద్దరు సభ్యులను పెంచేలా ప్రతిపాదన చేయనున్నారు. ఇద్దరు బ్రాహ్మణులను అదనపు సభ్యులుగా నియమించేందుకు ప్రతిపాదన చేయనున్నారు.
ఏపీ దేవాలయ చట్ట సవరణకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లాగర్స్, డెకాయిట్స్, డ్రగ్ అఫెండర్స్, గూండాస్ అండ్ ఇమ్మొరల్ ట్రాఫిక్ అఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాఫర్ యాక్ట్- 1986 సవరణ బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త యాక్ట్-1983 ముసాయిదా బిల్లుపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాక్ట్-2019, దానికి అనుబంధంగా ఇచ్చిన అన్ని ఉత్తర్వులనూ రద్దు చేస్తూ ఆమోదముద్ర వేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన స్పోర్ట్స్ పాలసీ 2024-29కి సైతం మంత్రులు ఆమోదం తెలపనున్నారు. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ పేరును ఎలైట్ యాంటీ నార్కొటిక్ గ్రూప్ ఫర్ లా ఇన్ఫోసిమెంట్(ఈగల్)గా మార్చే తీర్మానానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
YS Sharmila: కడప స్టీల్ ప్లాంట్ అంటే కొబ్బరి కాయలు కొట్టే ప్రాజెక్టా?: వైఎస్ షర్మిల
AP News: వైసీపీ నేతపై హైకోర్టు సీరియస్.. ఇలాగేనా మాట్లాడేది?
Updated Date - Nov 20 , 2024 | 06:10 PM