Share News

Venkaiah Naidu: చైతన్యం విషయంలో భారత్ ముందజలో ఉంది

ABN , Publish Date - Sep 30 , 2024 | 01:22 PM

కాస్మాలజీ, మెటా ఫిజిక్స్ వంటి శాస్త్రాలు కూడా మన తత్వాల్లో ఉన్నాయని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆచార్య నాగార్జునుడు, ఆది శంకరాచార్యులు తాత్వికతను ప్రముఖంగా చెప్పారని గుర్తుచేశారు. వేమన శతకం చదివితే అద్భుతమైన ప్రాపంచిక చింతన అలవడుతుందని తెలిపారు.

 Venkaiah Naidu:  చైతన్యం విషయంలో భారత్ ముందజలో ఉంది
M Venkaiah Naidu

గుంటూరు జిల్లా: భారతతత్వ శాస్త్రంలో లౌకిక, అలౌకిక అంశాలు చాలా ఉన్నాయని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. గుణం లేని వారు కులం పేరు, మానవత్వం లేని వారు మతం పేరు, పస లేని వారు ప్రాంతం పేరు ఎత్తుతారనే గుర్రం జాషువా మాటలు ఈ సందర్భంగా ప్రస్తావించాలని అన్నారు. చైతన్యం విషయంలో భారత ఉప ఖండం ప్రపంచంలోని చాలా దేశాల కంటే ముందంజలో ఉందని తెలిపారు.


కాస్మాలజీ, మెటా ఫిజిక్స్ వంటి శాస్త్రాలు కూడా మన తత్వాల్లో ఉన్నాయని చెప్పారు. ఆచార్య నాగార్జునుడు, ఆది శంకరాచార్యులు తాత్వికతను ప్రముఖంగా చెప్పారని గుర్తుచేశారు. వేమన శతకం చదివితే అద్భుతమైన ప్రాపంచిక చింతన అలవడుతుందని తెలిపారు. ఇటీవలి కాలంలో జిడ్డు కృష్ణమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణన్ తర్వాత భారత తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన వారు కొత్త సచ్చిదానంద మూర్తి గురించి వింటున్నామని అన్నారు.


ఈ ముగ్గురు తెలుగువారు కావటం మన అదృష్టమని చెప్పారు. విజ్ఞానం సముపార్జించాలి.. ఇతరులతో పంచుకోవాలి.. అందులోనే ఆనందం ఉంటుందని చెప్పారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు మన తత్వశాస్త్రం పరిష్కారాలను చూపించగలదని అన్నారు. ఈ విషయాన్ని గుర్తించి అన్ని స్థాయిల్లో భారతీయ తత్వచింతనను అలవాటు చేసుకోవాలని సూచించారు. మన ఉపనిషత్తులలో ఎన్నో మంచి అంశాలు ఉన్నాయని వివరించారు. స్వామి వివేకానంద అమెరికాలో చేసిన ప్రసంగంలోని అంశాలు ఉపనిషత్తుల్లో నుంచి తీసుకున్నవేనని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Updated Date - Sep 30 , 2024 | 01:22 PM