Attack on TDP Activists: ఆ జిల్లాలో రెచ్చిపోతున్న వైసీపీ మూకలు, వరస దాడులు..
ABN, Publish Date - Oct 21 , 2024 | 07:57 AM
గుంటూరు జిల్లా తొండపి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగయ్య ఇంటి నిర్మాణం కోసం ఇసుక తెప్పించుకున్నారు. అయితే ఇంటి ఆవరణలో స్థలం లేకపోవడంతో రోడ్డుపై పోయించారు. ఇదే విషయమై వైసీపీ కార్యకర్త సుధీర్ ప్రశ్నించాడు.
పల్నాడు: ఉమ్మడి గుంటూరు (Guntur) జిల్లాలో వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోతున్నాయి. టీడీపీ (TDP) నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయి. తప్పులు చేస్తూ ఇదేమిటని ప్రశ్నిస్తే రక్తమెుచ్చేలా కొడుతున్నారు. నిన్న(ఆదివారం) ఇసుక మాఫియాపై ఫిర్యాదు చేసిన సురేశ్ అనే యువకుడిపై దాడి చేయగా.. నేడు చిన్న గొడవను పెద్దది చేసి టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. ఈ ఘటన పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో చోటు చేసుకుంది.
చిన్న విషయానికే..
తొండపి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాగయ్య ఇంటి నిర్మాణం కోసం ఇసుక తెప్పించుకున్నారు. అయితే ఇంటి ఆవరణలో స్థలం లేకపోవడంతో రోడ్డుపై పోయించారు. ఇదే విషయమై వైసీపీ కార్యకర్త సుధీర్ ప్రశ్నించాడు. ఇంటి ఆవరణలో చోటు లేక రోడ్డుపై పోసినట్లు నాగయ్య చెప్పాడు. తొలగిస్తానని చెప్పినా వినకుండా గొడవ పెట్టుకునేందుకు కాలు దువ్విన సుధీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాట మాట పెరగడంతో వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పెద్దఎత్తున గుమిగూడిన ఫ్యాన్ పార్టీ మూకలు.. కత్తులు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. విచక్షణా రహితంగా దాడి చేసి ముగ్గురు టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా గాయపరిచారు. రక్తమోడుతున్న బాధితులను కుటుంబసభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘర్షణ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు తొండపి గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
మరో దాడి..
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఆదివారం నాడు మరో దాడి జరిగింది. ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సురేశ్ అనే యువకుడిపై ఇసుక అక్రమ వ్యాపారులు దాడికి తెగపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాం నుంచీ గుండిమేడ, ప్రాతూరు, చిర్రావూరు ఇసుక క్వారీలలో హరికృష్ణ, రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఏపీలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రావడంతో వీరి ఆడగాలను అడ్డుకునేందుకు సురేశ్ అనే యువకుడు ప్రయత్నించాడు. వారి అక్రమాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అయితే తమపై ఫిర్యాదు చేయడంపై కొంతమంది వ్యక్తులతో కలిసి ఇసుక మాఫియా గ్యాంగ్ సభ్యులు సురేశ్‌పై దాడి చేశారు. అధికారులకు సమాచారం ఇస్తూ తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నావంటూ మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఘటనపై బాధితుడు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే నిందితుడు హరికృష్ణపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Drone Summit: పున్నమీఘాట్ వద్ద 5 వేలకుపైగా డ్రోన్లతో మెగా షో
Updated Date - Oct 21 , 2024 | 08:56 AM