Rains Effect: విషాదాన్ని మిగులుస్తున్న భారీ వర్షాలు..
ABN, Publish Date - Sep 01 , 2024 | 11:57 AM
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. విజయవాడలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర రోదనలు మిగిల్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా కురుస్తున్న వర్షాలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని మిగుల్చుతున్నాయి. విజయవాడలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఐదుగురు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీవ్ర రోదనలు మిగిల్చింది. బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అయితే శిథిలాల కింద తమ కుమారుడు యశ్వంత్ ఉన్నాడంటూ ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమ కుమారుడిని రక్షించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
విరిగిపడిన కొండ చరియలను తొలగిస్తూ వాటి కింద చిక్కుకున్న బాధితుల కోసం అధికారులు వెతుకుతున్నారు. శనివారం నుంచి భారీ జేసీబీల, డ్రిల్లింగ్ మిషన్ల సహాయంతో తొలగిస్తున్నారు. కొండ చరియలు తొలగింపు కార్యక్రమాన్ని మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ పరిశీలించారు. సున్నపుబట్టిల సెంటర్‌లో ఇంటిపై కొండచరియలు విరిగిపడి మృతిచెందిన లక్ష్మీ అలియాస్ సత్యమ్మ భౌతికకాయానికి వారు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ఎంపీ కేశినేని శివనాథ్ ధైర్యం చెప్పారు.
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం వద్ద గ్రామానికి చెందిన శెట్టిపల్లి కృష్ణారెడ్డి(45) బుడమేరు వరదకు గల్లంతయ్యారు. కృష్ణారెడ్డి శనివారం ఉదయం పొలం పనులకు వెళ్లారు. బుడమేరు వరద ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో సమీపంలోని చెత్త డంపింగ్ యార్డులో ఆయన చిక్కుకున్నారు. వరదలో చిక్కుకుపోయానంటూ శనివారం మధ్యాహ్నం ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. నిన్న అర్ధరాత్రి కృష్ణారెడ్డి కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం వెళ్లింది. అయితే ఆయన డంపింగ్ యార్డులో లేకపోవడంతో పోలీసులు బాధితుడి ఇంటికి వెళ్లారు. అక్కడా లేకపోవడంతో వరదలో కొట్టుకుపోయినట్టు నిర్ధారించారు. దీంతో బాధిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం చామర్రు కృష్ణానది లంకభూముల్లో గొర్రెల మేపేందుకు వెళ్లిన కొమరగిరి అంకమ్మరావు దంపతులు వరదనీటిలో చిక్కుకున్నారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. దీంతో 150గొర్రెలతో సహా భార్యభర్తలిద్దరూ లంక భూముల్లో చిక్కుకున్నారు. సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు వద్ద ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న రాములేరువాగులో ప్రయాణించిన కారు కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని సురక్షితంగా కాపాడారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Rain Effect: వర్ష ప్రభావిత ప్రాంతాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా..
Rains: ఎన్టీఆర్ జిల్లాను ముంచెత్తిన వరదలు..
Rains: భారీ వర్షాలతో జలాశయాలకు పెరుగుతున్న వరదనీరు..
Updated Date - Sep 01 , 2024 | 11:57 AM