Share News

PV Sunil Kumar: వివాదంలో ఐపీఎస్‌ సునీల్‌!

ABN , Publish Date - Jul 13 , 2024 | 03:30 AM

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ వివాదంలో చిక్కుకున్నారు. జగన్‌ పాలనలో వైసీపీ చట్టాన్ని అమలు చేసిన ఆయన..

PV Sunil Kumar: వివాదంలో ఐపీఎస్‌ సునీల్‌!

  • సుప్రీంకోర్టు నిర్ణయానికి వక్రీకరణ

  • రఘురామ కేసులో ఎఫ్‌ఐఆర్‌పై అసత్యాలు

  • ఏబీవీకో రూల్‌.. ఈయనకో రూలా?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ వివాదంలో చిక్కుకున్నారు. జగన్‌ పాలనలో వైసీపీ చట్టాన్ని అమలు చేసిన ఆయన.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ విషయంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏకంగా సుప్రీంకోర్టు నిర్ణయాన్నే ఆయన వక్రీకరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా న్యాయస్థానాల నిర్ణయాలపై డీజీ ర్యాంకు అధికారి చేసిన వ్యాఖ్యలు ఆలిండియా సివిల్‌ సర్వీసు రూల్స్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి (రిటైర్డ్‌) ఏబీ వెంకటేశ్వరరావుపై జగన్‌ ప్రభుత్వం చర్య తీసుకోవడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. తనపై కేసు పెట్టడంపై సునీల్‌కుమార్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్షాత్తూ సుప్రీంకోర్టే తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా’ అని పోస్టు పెట్టారు. ఈ వ్యాఖ్య ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. రఘురామరాజు కుమారుడు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించలేదు. ‘మేం హైకోర్టుకు వెళ్తాం.. ఇక్కడ పిటిషన్‌ ఉపసంహరించకుంటాం’ అని ఆయన కోరడంతో అందుకు సమ్మతించింది. దీనికి సునీల్‌ వక్రభాష్యం చెబుతూ... ఎఫ్‌ఐఆర్‌ నమోదును బహిరంగంగా తప్పుబట్టడం ద్వారా ఆలిండియా సర్వీసు రూల్స్‌ ఉల్లంఘంచారు. సుప్రీంకోర్టు మూడేళ్ల క్రితమే మూసేసిందనడం తప్పుడు సమాచారమేనని నిపుణులు అంటున్నారు. కేసులో ఇరుక్కుని అడ్డగోలు వాదనలు వినిపిస్తున్న సునీల్‌ ఇప్పుడు తనను తాను రక్షించుకోవడానికి కుల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ‘దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ నేనుంటా..’ అంటూ మరో ట్వీట్‌ చేశారు. దీనిపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు స్పందిస్తూ... ఆలిండియా సర్వీసుల్లో ఉన్న వ్యక్తి ఒక వర్గాన్ని అడ్డుపెట్టుకోవడాన్ని నిలదీస్తున్నారు. ‘నిజంగా ఆయన దళిత పక్షపాతి అయితే డాక్టర్‌ సుధాకర్‌ను నడిరోడ్డుపై చేతులు కట్టేసి చితకబాదినప్పుడు ఎక్కడున్నారు? ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్‌ను చంపి శవాన్ని డోర్‌ డెలివరీ చేసినప్పుడు ఏమయ్యారు? రాజమండ్రిలో దళిత యువకుడికి శిరోముండనం చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నారు? అమరావతిలో దళిత రైతులపై అట్రాసిటీ కేసులు పెట్టినప్పుడు ఆయన సోషల్‌ మీడియాలో పోస్టులు ఎందుకు పెట్టలేదు? ఆయనపై గృహహింస కేసు పెట్టిన సహధర్మచారిణి దళిత మహిళ కాదా’ అని నెటిజెన్లు ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు.

Updated Date - Jul 13 , 2024 | 08:12 AM