Share News

టీటీడీలో అక్రమాలు వాస్తవమే

ABN , Publish Date - Jul 24 , 2024 | 05:31 AM

గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.

టీటీడీలో అక్రమాలు వాస్తవమే

తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైసీపీ

విజిలెన్స్‌ విచారణ తర్వాత చర్యలు: మంత్రి ఆనం

అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని, తిరుమల పవిత్రతను దెబ్బతీశారని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. టీటీడీ నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారని మండిపడ్డారు. మంగళవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పంచుమర్తి అనురాధ, బీటీ నాయుడు, రామారావు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. ఎన్నికలకు ముందు రూ.1,600 కోట్లతో రోడ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారని, ఈ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విచారణకు ఆదేశించామని చెప్పారు. పరకామణిలో పనిచేసే రవికుమార్‌ సుమారు రూ.100 కోట్లకు సమానమైన అమెరికా డాలర్లను దారిమళ్లించడంతోటీటీడీకి నష్టం వాటిల్లిందని, అతనిపై నమోదైన కేసు విషయంలో గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనుమానాలకు అవకాశం ఇచ్చిందని చెప్పారు. ఈ వ్యవహారంలో అప్పటి ఈవో, బోర్డు చైర్మన్‌, సీఐ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. వైసీపీ పాలనలో తిరుమల కొండపై జరిగిన అక్రమాల నిగ్గు తేలుస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రాథమిక విచారణ పూర్తయిందని పూర్తిస్థాయి నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం తిరుమల క్యూలైన్లలో భక్తులకు, పిల్లలకు పాలు, అల్పాహారం ఇవ్వలేదని ఆనం ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇసున్నట్లు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా భక్తుల నుంచి రూ.1,300కోట్లు వసూలు చేయగా, అందులో రూ.1,000కోట్లే బ్యాంకులో డిపాజిట్‌ చేశారని చెప్పారు. మిగతా రూ.300కోట్లు గోవిందరాజుల సత్రం పునర్మిర్మాణానికి ఖర్చుచేయాలని గత బోర్డు నిర్ణయించిందని, అయితే ఏకంగా రూ.600 కోట్లతో టెండర్లు పిలిచారని పేర్కొన్నారు. ఈ టెండర్లలో కూడా చాలా లోపాలు ఉన్నాయని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్‌ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీటీడీలో రూ.వందలు, వేల కోట్ల దుర్వినియోగం జరిగిందన్నారు. దేవుడి సొత్తు వైసీపీ దొంగలపాలైందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధులకు ఇచ్చే సిఫారసు లేఖల విషయంలోనూ గత ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శించిందని చెప్పారు.

సిఫారసు లేఖలపై ఆసక్తికర చర్చ

టీటీడీ సిఫారసు లేఖలపై శాసనమండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలతో సమానంగా చూడాలని, వీఐపీ బ్రేక్‌ దర్శనాల కోటా కల్పించాలని పీడీఎఫ్‌, టీడీపీ, వైసీపీ ఎమ్మెల్సీలు కోరారు. వారంలో ఆరు రోజులు ఒక లేఖకు 10మందికి దర్శనానికి అనుమతి ఇవ్వాలని కోరారు. గతంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి తమపట్ల అధర్మంగా వ్యవహరించారని వైసీపీ ఎమ్మెల్సీ తూబాటి మాధవరావు ఆరోపించారు.

Updated Date - Jul 24 , 2024 | 09:09 AM