AP Politics: ఇదెక్కడి ట్విస్ట్.. పేర్ని నానిని కాపాడుతోంది కూటమి నేతలేనా..!
ABN, Publish Date - Dec 18 , 2024 | 05:16 PM
Perni Nani - PDS Rice Bags: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి. ప్రస్తుతం బందరు రాజకీయాలకు దాన్ని అన్వయించే పరిస్థితి ఏర్పడింది. అధికారం ఉన్నా, లేకున్నా, రాజకీయ నేతలు కుంభకోణాలు, వివిధ అవినీతి ఆరోపణల్లో..
తెరపైకి బందరు బంధాలు..!
పేర్ని నానికి కూటమి నేతల అండ!
రగులుతున్న కార్యకర్తలు..
3,708 బస్తాల బియ్యానికి లెక్కలు లేవని అంగీకరించినా నోరు మెదపని కూటమి నేతలు.
తెరవెనుక చక్రం తిప్పుతోంది ఎవరు?
నూజివీడు లచ్చన్న విగ్రహావిష్కరణ వ్యవహారం ఇక్కడా కొనసాగుతోందా?
మచిలీపట్నం, డిసెంబర్ 18: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి. ప్రస్తుతం బందరు రాజకీయాలకు దాన్ని అన్వయించే పరిస్థితి ఏర్పడింది. అధికారం ఉన్నా, లేకున్నా, రాజకీయ నేతలు కుంభకోణాలు, వివిధ అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంటే ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం తెరవెనుక జరుగుతున్నాయా? విభిన్నమైన రాజకీయ పరిస్థితులు బందరులో వేళ్లూనుకున్నాయా? అనే ప్రశ్నలు వారం రోజులుగా ఉదయిస్తున్నాయి. తాజాగా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రి కొలుసు పార్థసారథి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతోపాటు గతంలో చంద్రబాబు నివాసంపైకి వెళ్లిన జోగి రమేశ్ ర్యాలీ, సభావేదికపై పాలు పంచుకోవడం టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వారంరోజులుగా బందరుకు చెందిన మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోడౌన్ల నుంచి 3,708 బస్తాల బియ్యం మాయమైన ఘటన వెలుగులోకి వచ్చినా అధికార పార్టీ నేతలు పెదవి విప్పకపోవడంపై టీడీపీ కార్యకర్తల మధ్య చర్చ జరుగుతోంది. సోమవారం మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం మినహా, మరే నేత కనీసం మాట్లాడకపోవడంతో కార్యకర్తలు రగిలిపోతున్నారు.
నాటి బంధం బందీ చేస్తోందా..?
బందరు నియోజకవర్గంలో రాజకీయ నేతలెవరైనా, ఏ పార్టీలో ఉన్నా వారి మధ్య అలవిమాలిన స్నేహంతోపాటు, తెరవెనుక వ్యాపార సంబంధాలుంటాయి. పార్టీల పరంగా పగలు విమర్శించుకున్నా రాత్రికి అందరూ ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకుని సరదాగా మాట్లాడుకునే సంస్కృతి నేటికీ గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూనే ఉంది. అందుకే ఎవరు అవినీతి అరోపణల్లో చిక్కుకున్నా స్పందించరు. తాజాగా పేర్ని నాని తన గోడౌన్‌లో 3,708 బస్తాల బియ్యం తరుగు ఉందని, ఎంత నగదు చెల్లించాలో చెబితే ప్రభుత్వానికి చెల్లిస్తానని స్వయంగా జేసీకి లేఖ రాశారు. దీంతో బియ్యం మాయమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారం రోజులుగా మీడియాలో కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా అధికారపక్ష కీలక నేతలెవరూ సరిగా స్పందించలేదు. దీనివెనుక కూటమి నేతలకు, మాజీ మంత్రి పేర్ని నానికి మధ్య బలమైన సత్సంబంధాలే కారణమనే అంశంపై టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య చర్చ జరుగుతోంది.
అధికారులపై ఒత్తిడి తెచ్చేదెవరు?
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నాని తరచూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, ఇతరత్రా అంశాలపై తనదైన శైలిలో మీడియా ముఖంగా విరుచుకుపడుతూ ఉంటారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసేందుకు వైసీపీ తరపున పేర్ని నానినే మాజీ సీఎం సాధనంలా వాడుకుంటారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు పీడీఎస్ బియ్యం ఎగుమతుల వ్యవహరంపై ఉపముఖ్యమంత్రి పరిశీలించి వచ్చిన తరువాత పేర్ని నాని ఈ అంశంపై విలేకరుల సమావేశంలో సెటైర్లు వేశారు. ఆ కొద్దిరోజులకే ఆయన పీడీఎస్ బియ్యం మాయం కేసులో చిక్కుకున్నారు. ఇంతా జరిగినా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, టీడీపీ సీనియర్ నేతలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ కూటమి నేతలెవ్వరూ పేర్ని నాని అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేయకపోవడం విశేషం. అంతేకాక పీడీఎస్ బియ్యం మాయం కేసులో అధికారులు త్వరగా పేర్నినానిపై చర్యలు తీసుకోకుండా తెరవెనుక అధికారపక్ష నేతలే ఒత్తిడి తెస్తున్నారని కూటమి కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు.
Also Read:
అదిరిపోయే స్కీమ్.. ఒకసారి అప్లై చేస్తే ఏడాదికి రూ.40
దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు..
కీలక నియామకంపై మోదీతో రాహుల్, ఖర్గే భేటీ
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Dec 18 , 2024 | 05:16 PM