Jagan Appeals : నన్ను నమ్మండి.. పార్టీని వీడకండి!
ABN, Publish Date - Dec 25 , 2024 | 04:38 AM
‘‘నన్ను నమ్మండి.. పార్టీని వీడి వెళ్లకండి’’ అని వైసీపీ క్యాడర్‌ను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ బుజ్జగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో బృంద గీతాలు పాడించుకున్న జగన్‌కు అధికారం పోయిన ఆరు నెలల్లోనే తత్వం తెలిసివచ్చింది.
క్యాడర్‌ను బుజ్జగిస్తున్న వైసీపీ అధినేత
పులివెందుల కార్పొరేటర్లతో సుదీర్ఘ భేటీ
అమరావతి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ‘‘నన్ను నమ్మండి.. పార్టీని వీడి వెళ్లకండి’’ అని వైసీపీ క్యాడర్‌ను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ బుజ్జగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో బృంద గీతాలు పాడించుకున్న జగన్‌కు అధికారం పోయిన ఆరు నెలల్లోనే తత్వం తెలిసివచ్చింది. అధికారంలో ఉండగా ఉపముఖ్యమంత్రులైనా, ఎంతటి సీనియర్ మంత్రులైనా, బలమైన ప్రజానాయకులనైనా జగన్ లెక్క చేయలేదు. ఎంత పెద్ద నాయకుడైనా జగన్ రమ్మని పిలిస్తేనే తాడేపల్లి ప్యాలె్‌సకు రావాలి. ఒకవేళ వచ్చినా.. జగన్ మనసు మార్చుకుంటే.. సీఎంవో అధికారులను కలసి వెనుదిరిగిపోవాల్సిందే. నోరుతెరచి ప్రశ్నించే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. 2019లో వైసీపీ తరఫున గెలిచిన 150 మంది (జగన్ మినహా) ఎమ్మెల్యేలు.. 22 మంది లోక్‌సభ సభ్యులలో మెజారిటీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ ప్రహరీకి పక్కగా ఉన్న సమావేశ మందిరాన్ని దాటి ప్యాలెస్ గడప దాటి లోపలకు వెళ్లలేదు. అలాంటి అవకాశమే వారికి రాలేదు.
ఇది మెజారిటీ వైసీపీ ముఖ్యనేతల అనుభవం. అయితే, అధికారాన్ని కోల్పోయిన ఆరునెలల్లోనే సీనియర్లు కాదు.. చోటా మోటా నాయకులకు కూడా తాడేపల్లి ప్యాలె్‌సలో జగన్ రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకుతున్నారు. ఇక, తన సొంత నియోజకవర్గం పులివెందులలోని ఇండుపులపాయ ఎస్టేట్‌లో కార్పొరేటర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తననే నమ్మాలని, తనతోనే ఉండాలని చేతిలో చేయి వేసి బాసలు తీసుకుంటున్నారు. సమస్యలు ఉన్నాయని అంగీకరిస్తూనే.. గతంలో తప్పులు జరిగాయని చెబుతూనే.. పార్టీ మారాల్సిన అవసరం లేదని వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వారు జగన్ మాటలను విశ్వసించేందుకు సిద్ధంగా లేరని పార్టీలో చర్చ సాగుతుండడం గమనార్హం.
క్యూకట్టి వెళ్తుండటంతో..
నెల రోజుల ముందువరకు తనదైన పంథాలోనే జగన్ నడిచారు. సీనియర్ నేతలు జనసేన,టీడీపీల్లోకి వెళ్లిపోతున్నారంటూ మీడియా ప్రశ్నించినప్పుడు కూడా.. ‘‘ఎవురమ్మా.. ఏ నాయకుడమ్మా పోతున్నారు?’’ అంటూ ఎగతాళి చేశారు. కానీ, ఇప్పుడు క్యూ కట్టినట్టు నాయకులు వైసీపీని వీడుతుండడంతో చిన్నస్థాయి నేతను కూడా పిలిచి బుజ్జగిస్తున్నారు.
కేసుల చిక్కులు
వైసీపీ అధికారంలో ఉండగా నోటికి పనిచెప్పిన నేతలందరిపైనా కూటమి సర్కారు వచ్చాక కేసులు నమోదవుతున్నాయి. విచారణల నిమ్మిత్తం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అరెస్టయినవారు బెయిలు కోసం.. అరెస్టు కానివారు ముందస్తు బెయిల్ కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో వైసీపీ నేతలంతా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తాడేపల్లి ప్యాలె్‌సకు వచ్చి జగన్‌ను కలిసేందుకు విముఖత ప్రదర్శిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. తాను ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుందోనన్న ఆందోళన జగన్‌లో స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. జగన్‌లో భవిష్యత్తు భయం నెలకొందనేందుకు మంగళవారం నాటి పులివెందుల పర్యటనే ప్రత్యక్ష ఉదాహరణగా చెబుతున్నారు. సొంత నియోజకవర్గానికి జగన్ రావడంతో.. ఆయనకు పార్టీ క్యాడర్ మొత్తం స్వాగతం పలుకుతుందని వైసీపీ నేతలు భావించారు. కానీ.. దీనికి భిన్నంగా పార్టీ ముఖ్యనేతలు అంతంత మాత్రంగానే వచ్చారు. పులివెందులలో వైసీపీ కార్పొరేటర్లు కూడా పూర్తిస్థాయిలో రాలేదు. మరోవైపు భారీ సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల్లోకి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. ఫలితంగా పులివెందుల కార్పొరేషన్ వైసీపీ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే జరిగితే జగన్ మరింత బలహీనమవుతారు. రాజకీయ ప్రతిష్ఠ మసకబారిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా వైసీపీని, జగన్‌ను విశ్వసిస్తున్న కొద్దిమంది కార్పొరేటర్లతో జగన్ సమావేశమయ్యారు. తనను నమ్మాలంటూ కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేశారు. తనను విడిచి వెళ్లిపోవద్దంటూ బతిమలాడుకున్నారు. దీనిని ప్రత్యక్షంగా చూసిన కొందరు నేతలు.. జగన్ అధికారంలో ఉండగా తమకు తాడేపల్లి వద్ద.. పులివెందులలోనూ జరిగిన అవమానాలను గుర్తు చేసుకున్నారు.
మంచి రోజులు వస్తాయి
‘‘ప్రతిపక్షంలో ఉండడం మనకు కొత్తకాదు. ఇబ్బందులు ఉంటాయి. ఎదుర్కొని పనిచేయండి. అధైర్యం వద్దు. అండగా నేనున్నా. నేను, అమ్మతో ప్రారంభమైన పార్టీతో రాష్ట్రానికి సీఎం అయ్యాను. అప్పట్లో పార్టీ 151సీట్లు సాధించింది. మళ్లీ మనకు మంచిరోజులు వస్తాయి’’ అని పార్టీ శ్రేణులకు జగన్ చెప్పారు. ఏసమస్య ఉన్నా అవినాశ్‌రెడ్డి దృష్టికి తీసుకువస్తే అండగా తాముంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లు అవకాశవాదులని వ్యాఖ్యానించారు.
Updated Date - Dec 25 , 2024 | 04:39 AM