Share News

సొంతానికి ‘పవర్‌’!

ABN , Publish Date - Oct 27 , 2024 | 04:52 AM

ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సరస్వతీ పవర్‌ అనేది విద్యుదుత్పత్తి కంపెనీ మాత్రమే.

సొంతానికి ‘పవర్‌’!

‘సరస్వతీ’ కంపెనీ కోసం అడ్డదారులు

అడ్డగోలుగా అధికార దుర్వినియోగం

‘పవర్‌’ ఉన్నది ప్రజలకు మేలు చేసేందుకు కాదు... తన సొంత మేళ్ల కోసమే! తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ చేసిందిదే! తాను అధికారంలోకి వచ్చాక జరిగిందీ అదే! దీనికి మరో ఉదాహరణ... ‘సరస్వతీ పవర్‌’ ఉదంతమే! ‘సరస్వతీ పవర్‌’ విషయంలో జగన్‌ స్వప్రయోజ నాలే పరమావధిగా వ్యవహ రించారు. ఇప్పుడు ‘ఇందులో వాటాలు మీకిచ్చేది లేదు. అంతా నా సొంతం’ అంటూ తల్లీ చెల్లిపై కేసు వేశారు. అసలు... సరస్వతీ పవర్‌ విషయంలో జరిగిందేమిటి? జగన్‌ అధికారంలోకి రాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కంపెనీకి ఎలాంటి మేళ్లు చేశారు? అందుకోసం అబద్ధాల గోడలు ఎలా కట్టారు? ఇవీ ఆ వివరాలు...

స్వప్రయోజనాలే పరమావధిగా నిర్ణయాలు

వ్యవస్థలను పణంగా పెట్టి సొంతానికి మేళ్లు

తమ వద్ద ప్రభుత్వ భూమి లేదంటూ

న్యాయస్థానం కళ్లకు అబద్ధాల గంతలు

25 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని

కేంద్రానికి పెట్టిన దరఖాస్తులో వెల్లడి

పచ్చి అబద్ధాలతో పర్యావరణ అనుమతులు

సొంత కంపెనీకి జీవితకాలం నీటి కేటాయింపు

భూమి విస్తీర్ణంలోనూ అడ్డగోలుగా సవరణలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మ్మడి రాష్ట్రానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సరస్వతీ పవర్‌ అనేది విద్యుదుత్పత్తి కంపెనీ మాత్రమే. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని జగన్‌ దాన్ని ఇండస్ట్రీస్‌ రంగంలోకి దించడానికి వ్యూహం రచించారు. దీనిలో భాగంగా 2008 జూలై 15న కంపెనీ బోర్డును అత్యవసరంగా సమావేశపరిచారు. సరస్వతీ పవర్‌ సిమెంట్‌ వ్యాపారంలోకి ప్రవేశించే విధంగా దాని బైలాస్‌ (కంపెనీ విధివిధానాలు)లో మార్పులు చేయించారు. ఈ మేరకు జగన్‌ సతీమణి భారతి తీర్మానం ప్రవేశపెట్టగా రాజశేఖరరెడ్డి సతీమణి, బోర్డు సభ్యురాలిగా ఉన్న విజయలక్ష్మి బలపరిచారు. కంపెనీ వ్యాపార స్వభావాన్ని అధికారికంగా మార్చడానికి నెలరోజుల ముందే జగన్‌కు మేళ్లు చేకూర్చేలా వైఎస్‌ ప్రభుత్వం నాటి గనులశాఖ డైరెక్టర్‌తో 2008 జూన్‌ 12నే మెమో ఇప్పించింది. తర్వాత అదే మెమో ఆధారంగా సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీ్‌సకు మైనింగ్‌ లీజులు కేటాయిస్తూ 2009 మే 18న గనుల శాఖతో జీవో 107ను ఇప్పించారు. నిబంధనల ప్రకారం రెండేళ్లల్లో కంపెనీ మైనింగ్‌ చేపట్టాలి. కానీ 2011 వరకూ ఆ కంపెనీ పని ప్రారంభించలేదు. దీంతో 2011లో సరస్వతీ కంపెనీకి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండుసార్లు (ఫిబ్రవరి, జూన్‌) షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం పని ప్రారంభించనందుకు లీజులు ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. చివరకు ఆ మైనింగ్‌ లీజులను 2014లో రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో 98 జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ సరస్వతి కంపెనీ కోర్టును ఆశ్రయించింది. ఇవన్నీ జగన్‌ అధిరాకంలోకి రాకముందు జరిగిన పరిణామాలు.

జగన్‌ అధికారంలోకి వచ్చాక...

మైనింగ్‌ లీజుల సందర్భంగా సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీ్‌సకు 2012లో ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం నీటి కేటాయింపు చేశారు. రోజుకు సగటున 0.0368 టీఎంసీ నీటి కేటాయింపునకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని ఈసీలో ఆదేశించారు. కానీ జగన్‌ అధికారంలోకి వచ్చాక ఈ నీటి కేటాయింపును 0.068 టీఎంసీలకు పెంచుకుంటూ 2019 డిసెంబరు 3న జీవో 81 జారీ చేయించారు. సహజంగా నీటి కేటాయింపు కాలపరిమితి ఐదేళ్లు ఉంటుంది. కానీ 2020 మే 15న జారీ చేయించిన జీవో 16తో జగన్‌ దీన్ని జీవితకాలం కేటాయింపుగా మార్చేశారు.

అమరావతి రాజధానికి సున్నం

జగన్‌ తన అవసరాల కోసం అమరావతి రాజధానిని కూడా వాడుకున్నారు. పనయ్యాక అమరావతికి సున్నం రాశారు. మైనింగ్‌ కోసం తెచ్చుకున్న పర్యావరణ అనుమతి కాలపరిమితి 2019లోనే పూర్తయింది. దీంతో మరోసారి దాని పొడిగింపు కోరతూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు పెట్టుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భారీగా సిమెంటు అవసరం ఉంటుందని, అందువల్ల తన పరిశ్రమకు మరోసారి అనుమతి కొనసాగించాలని అందులో విజ్ఞప్తి చేశారు. తీరా అనుమతి వచ్చాక ‘అమరావతి వద్దు.. మూడు రాజధానులే ముద్దు’ అంటూ జగన్‌ మూడు ముక్కలాటకు తెర తీశారు.


కేంద్రం కళ్లకు గంతలు

సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీ్‌సకు పర్యావరణ అనుమతులు పొందేందుకు కీలకమైన వాస్తవాలను కేంద్రం ముందు దాచిపెట్టారు. నిజాలు చెబితే అనుమతి కొనసాగించరని, అవాస్తవాలతో పనికానిచ్చారు. ఎన్విరాన్‌మెంట్‌ క్లియరెన్స్‌ ఇచ్చే ముందు... ‘కంపెనీ, భూములకు సంబంధించిన కేసులు ఏమైనా కోర్టులో ఉన్నాయా? కంపెనీకి ఇచ్చిన దానిట్లో ప్రభుత్వ భూములున్నాయా? ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ఉన్నాయా? వాటిపై ఏమైనా వివాదాలున్నాయా?’ అని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సరస్వతి కంపెనీ పచ్చి అబద్ధాలను వండివార్చింది.

జగన్‌ కంపెనీ దాచిపెట్టిన విషయాలివీ..

లీజుల రద్దుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ 2014లో హైకోర్టులో వేసిన పిటిషన్‌ గురించి కేంద్రానికి సమాచారం ఇవ్వలేదు. పైగా ఎలాంటి వాజ్యాలు లేవని తప్పుడు సమాచారం ఇచ్చారు.

మైనింగ్‌ లీజులను రద్దుచేస్తూ ప్రభుత్వం 2014 అక్టోబరులో జీవో 98 జారీ చేసిన విషయాన్ని తొక్కిపెట్టి, ఎలాంటి జీవోలు లేవని నివేదించింది. ఈ విధంగా తప్పుడు సమాధానాలతో కేంద్రానికి బురిడీ కొట్టి 2022 మార్చి వరకు పర్యావరణ అనుమతి సాధించారు.

వాస్తవానికి 2014లో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై తుది విచారణ 2019 అక్టోబరు 15న జరిగింది. అందులో తమవద్ద ప్రభుత్వ భూములే లేవని, ఉన్నవన్నీ ప్రైవేటు భూములే అని సరస్వతి యాజమాన్యం వాదనలు వినిపించి న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించింది. పర్యావరణ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో మాత్రం తమవద్ద 25 ఎకరాల ప్రభుత్వ భూమి (10.028 హెక్టార్లు) ఉందని పేర్కొంది.

కీలక వాస్తవాలు దాచిపెట్టడంతో.. ఏ కేసులు, వివాదాలు లేకుండా ప్రభుత్వం ఇచ్చిన జీవో 98ను హైకోర్టు నిలుపుదల చేసింది.

కోర్టు తీర్పు ఆధారంగా 2019 డిసెంబరు 12న జీవో 109 ద్వారా 613.476 హెక్టార్ల మైనింగ్‌ లీజును పునరుద్ధరిస్తూ జగన్‌ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి పది రోజుల ముందే, ఆ మైనింగ్‌కు నీటి కేటాయింపు చేస్తూ ఉత్తర్వులు ఇప్పించారు. పర్యావరణ అనుమతిలో పేర్కొన్న దానికి రెండురెట్లు అదనంగా నీటిని కేటాయించారు. మైనింగ్‌ లీజులకు సంబంధించి భ విస్తీర్ణంలోనూ మార్పులు చేసుకున్నారు. వేమవరం గ్రామంలో తొలుత కేటాయించిన 145.2 హెక్టార్ల భూమిని 202 హెక్టార్లుగా, చెన్నాయపాళెం గ్రామంలో తొలుత కేటాయించిన 202.2 హెక్టార్ల భూమిని 145.2 హెక్టార్లుగా మార్చుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Oct 27 , 2024 | 04:52 AM