సర్వేలో దోపిడీపై చర్యలేవీ?!
ABN, Publish Date - Aug 20 , 2024 | 06:07 AM
జగన్ పాలనలో సర్వే, సెటిల్‌మెంట్ శాఖ నిధుల దుర్వినియోగానికి కేరాఫ్ అడ్ర్‌సగా మారింది. నాటి ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కైన కొందరు కీలక అధికారులు...
జగన్ ప్రభుత్వంలో వందల కోట్లు మాయం
కేంద్ర నిధులూ దారి మళ్లించి వాడుకున్నారు
మీసేవ, డీఐఎల్‌ఆర్‌ఎంపీ సొమ్ములు స్వాహా
రీసర్వే డ్రోన్ల కొనుగోలు టెండర్లలో గోల్‌మాల్
ఏసీబీ విచారణ చేయిస్తామని జగన్ గొప్పలు
సొంత మనుషుల పాత్ర ఉండటంతో మౌనం
తాడేపల్లి మెప్పు కోసం ఓ సర్వే అధికారి ఆరాటం
దుబాయ్, సింగపూర్, మలేసియా నుంచి
ఖరీదైన ఆభరణాలు, హ్యాండ్‌బ్యాగ్‌లు కొనుగోలు
ప్యాలె్‌సలో పెద్దమనిషికి అవే బహుమతులు
దీనికోసం నిధులను కొల్లగొట్టేందుకు మాస్టర్‌ప్లాన్
ఈ అవినీతి, అక్రమాలపై విచారణ ఉంటుందా?
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ పాలనలో సర్వే, సెటిల్‌మెంట్ శాఖ నిధుల దుర్వినియోగానికి కేరాఫ్ అడ్ర్‌సగా మారింది. నాటి ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కైన కొందరు కీలక అధికారులు... సర్వే శాఖకు వివిధ మార్గాల నుంచి సమకూరిన సొమ్మును అందినకాడికి స్వాహా చేశారు. భూముల సర్వే కోసం రూ.700 కోట్లతో సర్వే రాళ్ల కొనుగోలు చేయడం మాత్రమే బయటకి కనిపించే అతిపెద్ద అక్రమం.
కానీ కంటికి కనిపించని అవినీతి, నిధుల దుర్వినియోగం ఈ శాఖలో చాలానే ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చిన డీఐఎల్‌ఆర్‌ఎంపీ నిధులు, మీసేవ నుంచి నెలనెలా వచ్చే కోట్లాది రూపాయల సొమ్ము, ఇవి చాలవన్నట్లుగా భూముల సర్వే కోసం నిరంతరాయంగా జరిపిన డ్రోన్ల కొనుగోలు టెండర్లలో జగన్ ప్రభుత్వంలో కీలక సలహాదారు, మరో ఉన్నతాధికారి భారీగా కమీషన్లు తీసుకున్నట్లుగా ఫిర్యాదులున్నాయి. భూముల సర్వేలో జరిగిన అక్రమాలపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టిపెట్టింది.
సర్వేరాళ్ల కొనుగోలులో అవకతవకలపై విచారణ చేయించాలని టీడీపీ వర్గాలే కోరుతున్నాయి. దీంతోపాటు సర్వేశాఖలో గత ఐదేళ్లలో జరిగిన ఇతర ఆర్థిక నేరాలు, నిధుల దోపిడీపై ఏసీబీ లేదా విజిలెన్స్‌తో విచారణ చేయించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి.
సర్వేశాఖ ఉన్నతాధికారి నిర్వాకం
మీ-సేవ పద్దు నుంచి సర్వేశాఖకు ప్రతీ నెలా నిధులు జమ అవుతుంటాయి. ఈ నిధులను ఎప్పటికప్పుడు తిరిగి ఆర్థిక శాఖకు అందించాలి. అయితే, జగన్ పాలనలో మీసేవ నిధులను సర్వే శాఖలోని అధికారులు సొంతానికి వాడుకున్నారు. ఈ విధంగా దాదాపు రూ.250 కోట్ల మేర అడ్డగోలుగా దారి మళ్లించినట్లు 2022లోనే ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది.
భూముల సర్వే, ఆధునీకరణ, ఇతర అవసరాల పేరిట కేంద్రం డి జిటల్ ఇండియా ల్యాండ్స్ రికార్డ్ మేనేజ్‌మెంట్ ప్రొగ్రామ్(డీఐఎల్‌ఆర్‌ఎంపీ) కింద ఇచ్చిన నిధుల్లో రూ.75 కోట్లపైనే దుర్వినియోగం అయినట్లు ఫిర్యాదులు వచ్చాయి. అప్పట్లో సర్వేశాఖలో పనిచేసిన ఓ ఉన్నతాధికారి తాడేపల్లి ప్యాలెస్ మెప్పు కోసం అక్కడి పెద్దలకు అత్యంత ఖరీదైన కానుకలు, బహుమతులు తీసుకెళ్లేవారు.
వాటిలో అంతర్జాతీయంగా పేరుగాంచిన బ్రాండ్‌లకు చెందిన నగలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, అత్యంత ఖరీదైన వస్తువులు ఉండేవి. ప్రతీ మూడు నెలలకోసారి దుబాయి, అబుదాబీ, మలేసియా, సింగపూర్ నుంచి ఖరీదైన లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌లు, ఆభరణాలు తెప్పించి ప్యాలె్‌సలోని ఓ పెద్దమనిషికి బహుమతిగా పంపించేవారని తెలిసింది. ఇటీవల రాజీనామా చేసిన ఓ ఐఏఎస్ అధికారి సహకారంతో ప్యాలె్‌సకు వెళ్లి వాటిని సమర్పించుకునేవారని సమాచారం.
ఈ ఖరీదైన వస్తువుల కొనుగోళ్లకు ఆయనకొచ్చే జీతం ఏ మూలకూ సరిపోదు. అందుకే మీసేవ, డీఐఎల్‌ఆర్‌ఎంపీ నిధులను అప్పనంగా వాడేశారని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నిధులను కొల్లగొట్టేందుకు ఎవరికీ అర్థంకాని మాస్టర్‌ప్లాన్ అమలు చేశారు. తొలుత చిరుద్యోగుల పేరిట లక్షలాది రూపాయలకు చెక్‌లు జారీ చేశారు. ఆ తర్వాత ఆ డబ్బును వారు బ్యాంక్ ఖాతాల నుంచి డ్రాచేసి తీసుకొచ్చి ఓ ఉన్నతాధికారికి ఇచ్చేవారు.
ఇలా ఒకేనెలలో సగటున ఐదారుగురు ఉద్యోగుల పేరిట కోట్లాది రూపాయల నిధులు డ్రా చేయడం వాటితో జల్సా చేయడం, తనమీదకు రాకుండా ప్యాలెస్ పెద్దలు, పలువురు సీనియర్ అధికారులకు ఖరీదైన కానుకలు సమర్పించుకోవడం గత ఐదేళ్లలో ఆనవాయితీగా సాగింది.
అస్మదీయ కంపెనీలకే టెండర్లు
ఒక ఉద్యోగి ఇంట్లో పెళ్లికి రెండు బస్సుల్లో ఉద్యోగులను తీసుకెళ్లారు. అక్కడే భోజనాలు చేసి తిరిగి వచ్చారు. కానీ అదేరోజు ఓ శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లుగా బిల్లులు పెట్టి డబ్బులు డ్రా చేసుకున్నారు. నిధులు దోచుకునేందుకు పెళ్లి భోజనాలు కూడా వదల్లేదనడానికి ఇదో చిన్న ఉదంతం మాత్రమే. ఇటు రీసర్వే పేరిట పేరిట డ్రోన్ల కొనుగోళ్లలో జగన్ సలహాదారు పెత్తనం సాగింది. ఆయన సూచించిన కంపెనీలకే బిడ్‌లు కట్టబెట్టారు.
ఆ కంపెనీల నుంచి ఎందుకూ పనికిరాని డ్రోన్లను కొనుగోలు చేసినట్లుగా ఆచరణలో తేలిపోయింది. అయితే, అవి అద్భుతంగా పని చేసినట్లుగా తప్పుడు రిపోర్టులు రాయించి, భజన చేయించినట్లు తెలిసింది.
ఈ పరిణామాలపైనా ‘ఆంధ్రజ్యోతి’ వరుసగా కథనాలు ప్రచురించింది. దీంతో ఏసీబీతో విచారణ చేయిస్తామని జగన్ ఓ సమావేశంలో చెప్పారు. జగన్ ఆదేశాల మేరకు గత ఏడాది నిఘా విభాగం నివేదిక ఇచ్చింది.
అందులో అస్మదీయ సలహాదారుతో పాటు ఇద్దరు సొంత అధికారుల పేర్లు ఉండటంతో... విచారణ పక్కన పెట్టేయాలని ఆదేశించారు. ఆ తర్వాత అధికారులు మరింతగా రెచ్చిపోయారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే జగన్ సలహాదారు ఒకరు బిల్లులు ఇప్పించేందుకు చేయని ప్రయత్నం లేదు.
అది వర్కవుట్ కాకపోవడంతో అందుబాటులో ఉన్న డీఐఎల్‌ఆర్‌ఎంపీ నిధులు దారిమళ్లించి వాటికి బిల్లులు రూపంలో కొంతమేర చెల్లించినట్లుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ పరిణామాలపై ఏసీబీ లేదా విజిలెన్స్‌తో విచారణకు టీడీపీ వర్గాలు డిమాండ్ చేశాయి. అక్రమాలపై విచారణకు కూటమి ప్రభుత్వం పూనుకుంటుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - Aug 20 , 2024 | 06:07 AM