Kadapa: దారుణం.. ఇంటర్ విద్యార్థిని హత్య.. సీఎం చంద్రబాబు సీరియస్..
ABN, Publish Date - Oct 20 , 2024 | 08:35 AM
బద్వేల్‌కు చెందిన విఘ్నేశ్, బాధితురాలు చిన్నప్పటి నుంచీ ఒకే వీధిలో పెరిగారు. అయితే వీరిద్దరూ ప్రేమించుకోగా.. ఆరు నెలల క్రితం యువకుడికి మరో యువతితో పెళ్లి అయ్యింది.
కడప: జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. బాలిక బట్టలకు నిప్పంటించి ఆమెను ఘోరంగా హత్య చేశాడు. బద్వేల్ పట్టణానికి చెందిన ఓ యువకుడికి ఆరు నెలలు క్రితం పెళైంది. అయినా మాజీ ప్రేయసినే కావాలనుకున్నాడు. మాయమాటలు చెప్పి ఆమెను ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. బాలిక ఒప్పుకోకపోవడంతో నిప్పంటించి పరారయ్యాడు. తీవ్రగాయాలైన బాలికను స్థానికులు కడప రిమ్స్‌కు తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందింది. ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
కలవాలంటూ ఫోన్..
బద్వేల్‌కు చెందిన విఘ్నేశ్, బాధితురాలు చిన్నప్పటి నుంచీ ఒకే వీధిలో పెరిగారు. అయితే వీరిద్దరూ ప్రేమించుకోగా.. ఆరు నెలల క్రితం యువకుడికి మరో యువతితో పెళ్లి అయ్యింది. యువకుడు కడపలోని ఓ హోటల్‌లో పని చేస్తుండగా.. బాలిక బద్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మెుదటి సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం విఘ్నేశ్ భార్య గర్భవతి. అయితే పెళ్లి అయినా విఘ్నేశ్ మాత్రం మాజీ ప్రేయసినే కావాలనుకున్నాడు. శుక్రవారం రాత్రి ఆమెకు ఫోన్ చేసి శనివారం నాడు కలవాలని కోరాడు. దీనికి బాలిక నిరాకరించడంతో చనిపోతానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో భయపడిన విద్యార్థిని అతడిని కలిసేందుకు ఒప్పుకుంది.
నిప్పంటించి..
శనివారం ఉదయం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పిన బాలిక అనంతరం ఆటోలో నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వెళ్లింది. అప్పటికే అక్కడ ఉన్న విఘ్నేశ్ కూడా ఆటో ఎక్కాడు. ఇద్దరూ ఆటోలో పీపీకుంట వద్ద ఉన్న సెంచురీ ప్లైవుడ్ సమీపంలో దిగారు. అక్కడి నుంచి పక్కనే ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ తనను పెళ్లి చేసుకోవాలంటూ యువకుడు ఆమెపై ఒత్తిడి చేశాడు. నీకు పెళ్లైందని, తన వెంట పడొద్దని యువతి హెచ్చరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన విఘ్నేశ్ తన వద్ద ఉన్న లైటర్‌తో ఆమె దుస్తులకు నిప్పు పెట్టి పరారయ్యాడు. మంటలకు తాళలేక బాలిక కేకలు వేస్తూ జాతీయ రహదారి వైపు పరుగులు పెట్టింది. ఆ సమయంలో అటుగా వస్తున్న ఓ లారీ డ్రైవర్ ఆమెను గమనించి వెంటనే లారీని ఆపి తన వద్ద ఉన్న దుప్పటి తీసుకొచ్చి మంటలు ఆర్పాడు. స్థానికుల సమాచారం మేరకు బద్వేల్ రూరల్ సీఐ నాగభూషణం, ఎస్‌ఐ శ్రీకాంత్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలని వెంటనే కడప రిమ్స్‌కు తరలించారు.
సీఎం సీరియస్..
అయితే దాడిలో బాలిక శరీరం దాదాపు 80శాతం కాలిపోయింది. విద్యార్థిని వాంగ్మూలం సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వెంటనే కడప ఎస్పీ హర్షవర్ధన్‌రాజుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు విఘ్నేష్‌ను పట్టుకునేందుకు ఎస్పీ నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే తీవ్రంగా గాయపడి ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాటం చేసిన యువతి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మరోవైపు నిందితుడు విఘ్నేశ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Updated Date - Oct 20 , 2024 | 08:52 AM